
తొలి అడుగు ఇక్కడి నుంచే..
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం ప్రకాశం జిల్లా నుంచే
⇒ఒంగోలు నుంచే వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం ప్రారంభం
⇒1977లో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ
ఒంగోలు: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం ప్రకాశం జిల్లా నుంచే ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. ఆ తర్వాత 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి బీఎల్‌డీ (భారతీయ లోక్‌దళ్) అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పులి వెంకటరెడ్డి చేతిలో ఓటమి చెందాడు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మొత్తం 7,41,462 ఓట్లు ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి పులి వెంకటరెడ్డికి 2,52,206 (55.97 శాతం) రాగా, బీఎల్‌డీ అభ్యర్థి వెంకయ్యనాయుడుకు 1,62,281 (36.14 శాతం) ఓట్లు వచ్చాయి. సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన గుజ్జుల యలమందారెడ్డి 35,551 (7.9 శాతం) ఓట్లు వచ్చాయి. మొత్తంగా వెంకయ్యనాయుడు ఎన్నికల ప్రస్థానం ప్రకాశం జిల్లా నుంచే ప్రారంభమైంది.