సెలవుల్లో స్నేహితులతోపాటు సరదాగా గడపడానికి షికారుకు వెళ్లిన పది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి కొట్టుకుపోయారు.
నేరేడుగొండ (ఆదిలాబాద్) : సెలవుల్లో స్నేహితులతోపాటు సరదాగా గడపడానికి షికారుకు వెళ్లిన పది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి కొట్టుకుపోయారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలోని కుంటాల జలపాతంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన పదిమంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు విహారయాత్రలో భాగంగా కుంటాల జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న స్నేహితుల్లో ఇద్దరు యువకులు జలపాతంలోని మొదటి గుండం వద్ద ప్రమాదవశాత్తూ కాలు జారి నీళ్లలో కొట్టుకుపోయారు.
వెంటనే అప్రమత్తమైన తోటి స్నేహితులు వారిని రక్షించేందుకు ప్రయత్నించేలోపే వాళ్లు గల్లంతయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా.. గల్లంతైన వారిలో ఒకరు గీతం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న అనిల్(21) గా, మరొకరు జేబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న రవి(20) గా గుర్తించారు. కాగా గత 15 రోజుల్లో కుంటాల జలపాతంలో పడి మృతి చెందటం ఇది మూడోసారి.