చిత్తూరు జిల్లా తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో టి.భూపతిరెడ్డి ఇంటిపై మంగళవారం రెండో రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో టి.భూపతిరెడ్డి ఇంటిపై మంగళవారం రెండో రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు భూపతిరెడ్డి ఆస్తులు 29 ప్లాట్లు, ఓ లాడ్జీ ఉన్నట్లు గుర్తించామని.. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. టీటీడీ అధికారిగా పనిచేసినప్పుడు తాను ఏ తప్పు చేయలేదని, తన కుమారులు విదేశాలలో ఉంటూ సంపాదించిందే తప్ప.. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని భూపతిరెడ్డి చెప్పారు.
తనపై ఎవరో కుట్ర పన్ని తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం రావడంతో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆయన ఇంట్లో పలు కీలకమైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.