జనజీవనంలోకి.. | tigers in people areas | Sakshi
Sakshi News home page

జనజీవనంలోకి..

Sep 7 2017 9:28 PM | Updated on Jun 1 2018 8:45 PM

జనజీవనంలోకి.. - Sakshi

జనజీవనంలోకి..

జనావాసాల్లోకి వన్యప్రాణులు చొరబడుతున్నాయి.

నివాస ప్రాంతాల్లోకి దూసుకొస్తున్న వన్యప్రాణులు
అటవీ ప్రాంతాల్లో నీరు, ఆహారం కరువు
అపారంగా నష్టపోతున్న ప్రజలు


జనావాసాల్లోకి వన్యప్రాణులు చొరబడుతున్నాయి. జిల్లాలోని పలు అటవీ శివారు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో చిరుతలు, నెమళ్లు, పాములు, జింకలు, ఎలుగుబంట్లు.. ఇలా రకరకాల జంతువులు హల్‌చల్‌ చేస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు వన్యప్రాణులకు ఆహారం, నీటి కొరత కూడా ఎక్కువగా ఉంది. దాహంతో అలమటిస్తున్న పలు వన్యప్రాణులు జనారణ్యంలోకి చొరబడుతున్నాయి. కనిపించిన పశుసంపద, కుక్కలపై దాడి చేసి చంపేస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అడవి జంతువుల దాడిలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఇక పాముకాటు మరణాలకు జిల్లాలో కొదవ లేదు.
- అనంతపురం సెంట్రల్‌

జిల్లాలో అడవుల విస్తీర్ణం : 1.96 లక్షల హెక్టార్లు
చిరుత పులులు :    128
ఎలుగు బంట్లు : 300
జింకలు, అడవిపందులు : వేలల్లో
వన్యప్రాణుల వలన జరుగుతున్న పంట నష్టం : వేల హెక్టార్లలో
పంట నష్ట పరిహారం అందజేస్తున్నది : ఎకరాకు రూ.5 నుంచి 6 వేలు మాత్రమే
అడవి జంతువుల నుంచి ముప్పు ఉన్న గ్రామాలు : 80


ఆగస్టు 26న వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యంలో అర్దరాత్రి రైతు కురబ నాగేంద్రకు చెందిన ఆవుదూడపై చిరుతదాడి చేసి చంపేసింది. ఇంటి ఎదుట దూడను తాడుతో కట్టేసి ఉండగా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత దాడి చేసింది. అలికిడికి రైతు నిద్రలేచి చూసే సరికి దూడ చనిపోయింది.

ఆగస్టు 27న అమడగూరు మండలం పేరంవాండ్లపల్లిలో చాకల రంగప్ప అనే వ్యక్తి గ్రామ శివారులోని కొండ వద్ద తన పొలాన్ని చూసేందుకు వెళ్లాడు. పంటలో ఉన్న కొండ చిలువ రంగప్ప పైకి దూసుకొచ్చింది. ప్రాణభయంతో స్థానికులతో కలిసి సదరు కొండ చిలువను చంపేశాడు.

జిల్లాలో కొన్ని నెలలుగా వరుసగా వన్యప్రాణుల దాడులు పెరిగిపోయాయి.   అడవుల్లో వాటికి సరైన ఆహారం, నీరు లభ్యం కాకపోవడంతోనే జనావాసాల వద్దకు వస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.96 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. గుత్తి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, తనకల్లు ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వర్షాభావం, ఇతర కారణాలతో జిల్లాలో ఏడాదికేడాదికి అడవులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా వన్యప్రాణుల మనుగడ కష్టమైంది. అడవుల్లో వాటికి సరైన ఆహారం, నీరు లభ్యం కావడం లేదు. దీంతో అటవీ శివారు గ్రామాలు, పట్టణాల్లో అవి చొరబడి నష్టాలకు కారణమవుతున్నాయి.

చిరుతల హల్‌చల్‌
ప్రతి ఏటా జిల్లాలో చిరుతలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో రాయదుర్గం పట్టణంలోనే జనావాసాల్లోకి చిరుతలు చొరబడి భయాందోళనలకు గురి చేశాయి. వజ్రకరూరు మండలం ప్రతి ఏటా చిరుత దాడిలో మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు కొండ చిలువలు, ఇతర విషసర్పాలు కలకలం రేపుతున్నాయి. కొండ శివారు ప్రాంతాల్లోకి మేకలు, గొర్రెలు, పశువులను మేపునకు తీసుకెళ్లేందుకు కాపరులు భయపడుతున్నారు.

పంటలకూ అపార నష్టం
అడవి జంతువుల దాడితో అటవీ శివారు ప్రాంత గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంట పొలాలు ధ్వంసమైపోతున్నాయి. జింకలు, అడవి పందుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఉరవకొండ, కళ్యాణదుర్గం, యల్లనూరు, పామిడి, గుంతకల్లు  ప్రాంతాల్లో జింకల దాడిలో వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లుతోంది. దీనికి తోడు విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే లోపు అడవి పందుల దాడులు కూడా భారీగా ఉంటోంది. వన్యప్రాణుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు పొలాలకు కంచె వేసుకునే అవకాశం కూడా రైతులకు లేదు. అంతేకాక మెట్ట పంటలకు రూ. లక్షలు వెచ్చించి కంచె ఏర్పాటు చేసుకోవడం కరువు జిల్లా రైతులకు తలకు మించిన భారమవుతోంది.

అరకొర పరిహారం
వన్యప్రాణుల బారిన పడి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అరకొరగానే అందుతోంది. గతేడాది చిరుతల దాడిలో 85 పాడి పశువులు చనిపోతే బాధితులకు రూ.6.48 లక్షలు మాత్రమే పరిహారం కింద చెల్లించారు. అంటే సగటున రూ. 10 వేలు నుంచి రూ. 15 వేలకు మించి పరిహారం దక్కలేదు. వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు పరిహారం చెల్లిస్తున్నారు. వన్యప్రాణుల దాడిలో రైతులు భారీగా నష్టపోతున్నా.. అందుకు తగ్గ పరిహారం అందడం లేదు అన్నది అక్షర సత్యం. పొలాలకు కంచె వేసుకునేందుకు అనుమతి ఇస్తే వన్యప్రాణుల బారి నుంచి పంట కాపాడుకునేందుకు వీలవుతుందని రైతులు అంటున్నారు.

చీకట్లు నింపిన ఎలుగుబంటి
పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో బోయ శ్రీనివాసులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది.  గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తోటి గొర్రెల కాపరులతో కలిసి వెళ్లిన  శ్రీనివాసులుపై ఎలుగుబంటి దాడి చేసింది. భర్త అకాల మృతిని జీర్ణించుకోలేని  ఆయన భార్య రాణెమ్మ సైతం కొన్నాళ్లకు మరణించారు. దీంతో వారి కుమారుడు వర్థన్‌బాబు  (11) కుమార్తె కుసుమ (8) అనాథలయ్యారు. వీరిని ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదు. ప్రస్తుతం అవ్వాతాతల సంరక్షణలో వారు ఉన్నారు.  

రామరాజుపల్లి రైతులకు తప్పని జింకల బెడద
పామిడి మండలంలోని నీలూరు, తంబళ్లపల్లి, పొగరూరు, గజరాంపల్లి, రామరాజుపల్లి గ్రామాల్లో 2 వేల మంది రైతులు  2,400 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. రామరాజుపల్లి గ్రామపరిధిలోని నల్లరేగడి భూముల్లో 300 మంది రైతులు 2వేల ఎకరాల్లో పత్తిపంట సాగుచేస్తున్నారు. సాగుచేసినప్పటి నుంచి జింకల బెడద తీవ్రంగా ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

జింకల నుంచి పంటను కాపాడాలి
వేలాది రూపాయల పెట్టుబడితో పత్తి పంట సాగు చేశాం. పంట మొలక దశలో ఉండగానే జింకల గుంపు దాడిచేసి తిసేస్తున్నాయి. దీంతో తిరిగి రెండోసారి విత్తనం వేయాల్సి వస్తోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  జింకల బెడదను అరికట్టడంలో అటవీశాఖాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు.
- సి.హరినాథ్‌రెడ్డి, రామరాజుపల్లి గ్రామం, పామిడి మండలం

కంచె ఏర్పాటు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపుతాం
అటవీ శివారులోని పంట పొలాలకు వన్యప్రాణుల బెడద ఉందనేది వాస్తవమే. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తున్నాం. పంటలకు రక్షణగా కంచె ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ అందజేసే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. సాధ్యమైనంత వరకూ అటవీ శివారు ప్రాంతాల్లో నివాసమున్న వారు.. పశుసంపదను మేపునకు తీసుకెళ్లడంలో జాగ్రత్తలు పాటించాలి.  గ్రామాల్లో పశువుల పాకలు ఎత్తుగా నిర్మించుకోవాలి.
- ఎ.చంద్రశేఖర్, జిల్లా అటవీశాఖ అధికారి

జాగరణ చేస్తున్నాం
నాకున్న ఐదు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు ముందస్తు గుత్త చెల్లించి వేరుశనగ పంట సాగు చేశాను. ఎకరాకు రూ. 15 వేలుకు పైగా పెట్టుబడి పెట్టాను. జింకల సంచారంతో భారీగా నష్టం వాటిల్లుతోంది.  పంటను కాపాడుకునేందుకు ప్రతి రోజూ రాత్రి జాగరణ చేయాల్సి వస్తోంది.
– ఉచక్కగారి రమేష్, కౌలురైతు వజ్రకరూరు మండలం

40 శాతం పంట నష్ట పోయాను
నాకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఎకరాకు రూ. 10వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. జింకల సంచారంతో ఇప్పటికే 40 శాతం పంట నష్టపోయాను. అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది.
– నెట్టయ్య, రైతు, పొట్టిపాడు, వజ్రకరూరు మండలం

తీవ్రంగా నష్టపోతున్నాం.
:నాకున్న 4.50 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. విత్తనం వేసినప్పటి నుంచి అడవి జంతువుల బెడద ఎక్కువైంది. ఆడవి పందులు రాత్రి పూట పొలంలోకి ప్రవేశించి భూమిలోని విత్తనాన్ని తినేశాయి. మొలకెత్తిన చెట్లను సైతం అవి పెకలించేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రెండు ఎకరాల్లో పంట నష్టపోయాను. ప్రతి ఏటా ఇలాగే జరుగుతోంది.
- జానూబీ, అచ్చంపల్లి, కంబదూరు మండలం

ఎకరాల కొద్ది పంటల ధ్వంసం
అడవి పందులు రాత్రిళ్లు పంటలపైబడి నాశనం చేస్తున్నాయి. పందుల సంచారంతో ఎకరాల కొద్ది పంట ధ్వంసమవుతోంది. వారం రోజుల్లో నేను సాగు చేసిన మూడు ఎకరాల్లోని వేరుశనగ పంటలో 40 శాతం పంటను పందులు తోడేశాయి.  రాత్రికి ఇద్దరు కాపలాకు వెళ్లినా పందుల బారి నుంచి పంటను కాపాడుకోలేకపోతున్నాం. 20 నుంచి 30కి పైగా పందులు గుంపులుగా వచ్చి నిమిషాల్లో పంటను పెకలించి వేస్తున్నాయి.  
- సరోజమ్మ, మహిళా రైతు, కెంచంపల్లి, కుందుర్పి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement