‘త్రీ ఇన్‌ ఒన్‌’ | three in one system in education department | Sakshi
Sakshi News home page

‘త్రీ ఇన్‌ ఒన్‌’

Sep 24 2016 11:12 PM | Updated on Sep 4 2017 2:48 PM

‘త్రీ ఇన్‌ ఒన్‌’

‘త్రీ ఇన్‌ ఒన్‌’

విద్యార్థి జీవితంలో కీలక మలుపు ఇంటర్‌ విద్య. వారి భవిష్యత్తుకు పునాది ఇంటర్‌ దశ.

– ప్రిన్సిపల్, డీవీఈఓ, ఆర్జేడీ విధులు ఒక్కరికే
– గాడితప్పుతున్న పరిపాలన


అనంతపురం ఎడ్యుకేషన్‌ : విద్యార్థి జీవితంలో కీలక మలుపు ఇంటర్‌ విద్య.  వారి  భవిష్యత్తుకు పునాది ఇంటర్‌ దశ. ఇంతటి ప్రాధాన్యత కల్గిన ఇంటర్‌ విద్య అమలులో అధికారుల పర్యవేక్షణ కూడా కీలకం. ఇంటర్‌ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. లేపాక్షి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉన్న వెంకటరమణను జిల్లా ఒకేషనల్‌ విద్యాశాఖ అధికారి (ఎఫ్‌ఏసీ)గా నియమించింది. దీంతోపాటు తాజాగా ఇంటర్‌ విద్య రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (కడప) పోస్టులోనూ ఆయననే కూర్చోబెట్టింది. ప్రిన్సిపల్‌ బాధ్యతలతోపాటు డీవీఈఓ, ఆర్జేడీగా విధులు నిర్వర్తించడం ఎలా సాధ్యమని, ఈ క్రమంలో ఆయా శాఖల్లో పాలనావ్యవహారలు గాడితప్పుతాయని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇష్టారాజ్యంగా అధ్యాపకులు..
వెంకటరమణ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న లేపాక్షి జూనియర్‌ కళాశాలలో కొందరు అధ్యాపకుల మధ్య అంతర్గత పోరు సాగుతోంది.   పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్‌ లేకపోవడంతో కొందరు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు.  ఓ అధ్యాపకుడు రోజుల తరబడి కళాశాలకు రాకపోయినా వచ్చిన రోజు మాత్రం అన్ని రోజులకు హాజరైనట్లు  సంతకాలు చేస్తున్నట్లు  సమాచారం.

ఎక్కడ సమస్యలు అక్కడే..
జిల్లాలో 41 జూనియర్, ఒకేషనల్‌  జూనియర్‌ కళాశాలలున్నాయి. చాలా కళాశాలల్లో కనీస వసతులైన తాగునీరు, తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలను  పరిశీలించాల్సి ఉంటుంది. ఓజేటీ(ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌)లు, బ్రిడ్జి కోర్సులపై దష్టి సారించాల్సి ఉంది.  ఈ విద్యా సంవత్సరం  నుంచి ప్రాక్టికల్స్‌ జంబ్లింగ్‌లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ∙నేపథ్యంలో ప్రాక్టికల్‌ తరగతుల నిర్వహణ పర్యవేక్షించాల్సిన బాధ్యత డీవీఈఓదే.  

తూతూ మంత్రంగా తనిఖీలు.‘.
మరోవైపు ఆర్జేడీ కేడర్‌లో రాయలసీమ జోన్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లోనూ ఇంటర్‌ విద్య అమలును పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతి జిల్లాలోనూ పర్యటించి సమస్యాత్మక కళాశాలలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.    ప్రిన్సిపల్, డీవీఈఓ, ఆర్జేడీ మూడు పోస్టుల్లోనూ ఒకే వ్యక్తి ఉంటే ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది  అనంతపురం    కర్నూలు, శ్రీకాకుళం మూడు జిల్లాల్లోనూ ఆగస్టు 31న డీవీఈఓ పోస్టులు ఖాళీ అయితే అనంతపురం మినహా తక్కిన రెండు జిల్లాల్లోనూ పది రోజుల్లోపే డీవీఈఓ ఎఫ్‌ఏసీ బాధ్యతలను సీనియర్‌ ప్రిన్సిపాళ్లకు అప్పగించారు. ఇక్కడ మాత్రం ఆర్జేడీని కొనసాగించడం వెనుక ఆంతర్యం అధికారులే చెప్పాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఈ ప్రభావం రానున్న ఇంటర్‌ ఫలితాల్లో పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement