కడపలో భారీగా ఓట్లు గల్లంతు!

కడపలో భారీగా ఓట్లు గల్లంతు! - Sakshi


కడప కార్పొరేషన్‌: కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా లక్షా పన్నెండు వేల ఓట్లు గల్లంతయ్యాయి. ఇందులో ముస్లిం మైనార్టీల ఓట్లు 35వేల వరకూ ఉన్నాయి. నగరంలో అస్తవ్యస్తంగా డోర్‌ నంబర్లు కేటాయించడం వల్లే ఓట్లు తీసేశారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి కడప నియోజకవర్గంలో పురుషుల ఓట్లు 1,27,143, మహిళల ఓట్లు 1,28,050 కలిపి మొత్తం 2,53,193 ఓట్లు ఉండేవి. ప్రస్తుతం తొలగించిన ఓట్లతో ఆ సంఖ్య 1.41లక్షలకు పడిపోయింది. సాధారణంగా కొత్త డోర్‌ నంబర్లు వేయాలంటే కలెక్టర్‌ గెజిట్‌ తీసుకొని చేయాలి.



కానీ ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందని చెప్పి రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులు ఆగమేఘాలపై రూ.45లక్షల వ్యయంతో ఒక ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థ నగరాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌ అనే నాలుగు జోన్లుగా విభజించి ఈ డోర్‌ నంబర్లు కేటాయించింది. ఈక్రమంలో కొన్ని ఇళ్లకు నంబర్లు వేయకపోగా, రెండు, మూడు అంతస్తులు ఉన్న ఇంటికి గ్రౌండ్‌ఫ్లోర్‌కు మాత్రమే ఒకే డోర్‌ నంబర్‌ ఇచ్చారు. దీంతో పైరెండు అంతస్తుల్లో ఉన్నవారి ఓట్లు గల్లంతయ్యాయి. ఇలా వందల సంఖ్యలో ఇళ్లకు కొత్త డోర్‌ నంబర్లు కేటాయించలేదు.



విచారణ చేపట్టకుండానే తొలగింపు

నగరశివార్లలోని తులసీప్రాజెక్టు వెంచర్‌లో 100 కుటుంబాలు నివసిస్తుంటే ఒక్క ఇంటికి కూడా కొత్త డోర్‌ నంబర్లు వేయలేదు. కడప నగరంలో మొత్తం 84వేల నివాసగృహాలు ఉన్నాయి. అనధికారికంగా మరో ఐదువేలు ఉండే అవకాశం ఉంది. ఇంటికి ఇద్దరు ఓటర్లు అని లెక్కవేసుకున్నా 1.80లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఎలాంటి విచారణ చేపట్టకుండానే గత తహసీల్దార్‌ ఈ ఓట్లను తొలగించినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర వరకూ ఎన్నికలు లేనందున ఎవరి ఓట్లు ఉన్నాయో, ఎవరి ఓట్లు గల్లంతయ్యాయో ప్రజలకు తెలియడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలేవీ లేవు కాబట్టి ప్రస్తుతం వారికి దానిపై అంత ఆసక్తి లేదు. కొత్తగా వేసిన డోర్‌ నంబర్లనే ఓటు కార్డుల్లో పొందుపరిచడం వల్ల కొత్త నంబర్లు వేయని ఇళ్లలో ఉన్నవారి ఓట్లన్నీ తొలగించినట్లే.



చెల్లాచెదురైన ఓట్లు

కొత్త డోర్‌ నంబర్ల వల్ల ఓట్లన్నీ చెల్లాచెదురయ్యాయి. గతంలో ఒక డివిజన్‌లోని ప్రజలు మూడు లేదా నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు వేసేవారు. ప్రస్తుత డోర్‌ నంబరింగ్‌ విధానం వల్ల ఆయా ఓట్లన్నీ 20 నుంచి 30 పోలింగ్‌ స్టేషన్లకు మారిపోయాయి. ఉదాహరణకు మాజీ కార్పొరేటర్‌ భాగ్యమ్మ చెమ్ముమియ్యాపేటలో నివసిస్తుండగా, ఆమె ఓటు అగాడి పోలింగ్‌ స్టేషన్‌లో ఉంది. అలాగే ప్రస్తుత కార్పొరేటర్‌ ఎస్‌ఏ షంషీర్‌ నకాస్‌లో నివసిస్తుండగా ఆయన ఓటు బెల్లంమండీ పోలింగ్‌స్టేషన్‌లో ఉంది. అంతేగాక 11మంది కార్పొరేటర్ల ఓట్లు మాయం అయ్యాయి. 47వ డివిజన్‌ కొత్త డోర్‌ నంబర్లతో ఓట్లన్నీ చెల్లాచెదరయ్యాయి. ఒక డివిజన్‌ ప్రజలు గతంలో కేవలం మూడు బూతుల్లో ఓట్లు వేసేవారు. మారిన విధానం ప్రకారం 26 బూతులకు ఆ ఓట్లను చెల్లాచెదరు చేశారు. అదే డివిజన్‌కు సంబంధించి 16వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌ మరియాపురం జూనియర్‌ కాలేజీలో ఉండగా, దాన్ని 11గా మార్చి వికాస్‌ ఇంగ్లిషు మీడియం స్కూల్లో వేశారు. అంటే అక్కాయపల్లెలోని ప్రజలంతా చెమ్ముమియ్యాపేటకు పోయి ఓట్లు వేయాలన్నమాట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చెల్లాచెదరైన ఓట్లు, పోలింగ్‌బూతుల వల్ల 15శాతం ఓటింగ్‌ కూడా జరగడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.



ఈనెలలో మళ్లీ మొదలుపెడుతున్నాం:

రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న ఇళ్లకు నంబర్లు కేటాయించకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. అది ఇప్పుడు జరిగింది కాదు. ఈ నెలలో డోర్‌నంబర్లు వేయని ఇళ్లకు నంబర్లు కేటాయిస్తాము. తద్వారా కొత్త ఓట్లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తాం.

–ప్రేమంత్‌ కుమార్, కడప తహసీల్దార్‌





కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మేయర్, ఎమ్మెల్యే

కడప నగరంలో లక్షా ముప్‌పై ఐదు వేల ఓట్లు గల్లంతు కావడంపై మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా కలెక్టర్‌ బాబూరావునాయుడుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.



మళ్లీ ఓటు నమోదు చేసుకోవచ్చంటున్న అధికారులు

ఉన్న ఓట్లన్నీ తొలగించిన రెవెన్యూ అధికారులు కొత్తగా మళ్లీ ఎక్కించుకోవచ్చని తాపీగా చెబుతుండటంపై ప్రజాప్రతినిధులు, ప్రజలు మండిపడుతున్నారు. ఎలాంటి విచారణ లేకుండా లక్షకు పైగా ఓట్లు తొలగించి, ఇప్పుడు నమోదు చేసుకోమంటే ఎవరి ఓటు ఉందో, ఎవరి ఓటు లేదో నిరక్షరాస్యులకు ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top