
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివేక్
స్కూల్ బ్యాగ్‌లోకి చొరబడిన పాము విద్యార్థిని కాటేసింది. స్థానికుల కథనం ప్రకారం..
విద్యార్థిని కాటేసిన రక్త పింజర
దొన్కల్ గ్రామంలో ఘటన
ఇందల్‌వాయి(నిజామాబాద్ రూరల్) : స్కూల్ బ్యాగ్‌లోకి చొరబడిన పాము విద్యార్థిని కాటేసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని దొన్కల్ గ్రామానికి చెందిన వివేక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఉంచిన స్కూల్ బ్యాగులోకి పాము చొరబడింది. ఇది గమనించిన వివేక్ సోమవారం ఉదయం ఆ బ్యాగ్‌ను తీసుకొని స్కూల్‌కు వెళ్లాడు. క్లాస్‌రూంలో పుస్తకాల కోసమని బ్యాగులో చేతు పెట్టగా, అందులో ఉన్న రక్త పింజర కాటు వేసింది.
విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. వివేక్‌ను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, యాంటీ వీనమ్ ఇంజక్షన్లు చేయించి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పాము కాటు వల్ల విద్యార్థి చేయి వాచిందని, పెద్దగా ప్రమాదం ఏమి లేదని వైద్యులు చెప్పినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.