కేసీఆర్ అబద్ధాల కోరు | Shinde fires on KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్ అబద్ధాల కోరు

Nov 17 2015 1:56 AM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్ అబద్ధాల కోరు - Sakshi

కేసీఆర్ అబద్ధాల కోరు

కేసీఆర్ అబద్ధాల కోరు అని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే విమర్శించారు.

సాక్షి, హన్మకొండ: కేసీఆర్ అబద్ధాల కోరు అని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే విమర్శించారు. తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పాడని, ఆయనో మోసకారని మండిపడ్డారు. వరంగల్ జిల్లా వర్థన్నపేటలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో షిండే ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జటిల సమస్యగా మారినా, కొన్ని పార్టీలు వ్యతిరేకించినా, ఎన్ని కష్టాలు ఎదురైనా... చేసిన వాగ్దానం మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చినా కూడా, తెలంగాణను ఏర్పాటు చేస్తే మహారాష్ట్రలో విదర్భ సమస్య ఎదురవుతుందని తెలిసినా... సోనియాగాంధీ తన మాటకు కట్టుబడ్డారన్నారు.

కేంద్ర హోం మంత్రిగా తెలంగాణ బిల్లు ఆమోదం కోసం చివరిగా సంతకం చేసింది తానేనని, అందుకు ఎంతగానో గర్విస్తున్నానని షిండే చెప్పారు. కొత్త రాష్ట్రంలో దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్... ఆ తర్వాత మాట తప్పాడని విమర్శించారు. మోసం చే సి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం నీతిమాలిన పని అని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఇక్కడి పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల బలవనర్మణాలను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని... హామీ మేరకు రుణమాఫీ చేయడంతోపాటు సకాలంలో రుణాలిప్పించాలని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా సమర్థుడు, యోగ్యుడైన సర్వే సత్యనారాయణను సోనియాగాంధీ ఎం పిక చేశారని, ఆయనను గెలిపిస్తే వరంగల్ అభివృద్ధికి దోహదపడుతుందని పిలుపునిచ్చారు.

 తల్లిని సైతం మోదీ అవమానిస్తున్నారు
 ఎన్నికల సమయంలో తాను చాయ్ వాలా అంటూ చెప్పుకున్న ప్రధాని మోదీ.. విదేశీ పర్యటనలో తన తల్లి పనిమనిషి అంటూ ప్రచారం చేసుకుంటున్నారని షిండే విమర్శించారు. విదేశాల్లో తన తల్లిని మోదీ అవమానిస్తున్నారన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ అనుసరించిన విధానాలకు బిహార్ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, అదే ఫలితం ఇక్కడ టీఆర్‌ఎస్‌కు వస్తుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల జోలికి వస్తే బీజేపీ పుట్టగతులు లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, నంది ఎల్లయ్య, భట్టివిక్రమార్క, బలరాంనాయక్, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్  పాల్గొన్నారు.
 
 ప్రజలే బుద్ధి చెప్పాలి: దిగ్విజయ్
 వరంగల్: అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క హామీనీ నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పిలుపునిచ్చారు. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం డీసీసీ భవన్‌లో గౌడ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలతో ఆయన సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా పెంపు, రెంటల్ తగ్గింపు, సొసైటీల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టామని దిగ్విజయ్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు, తండాలను పంచాయతీలుగా చేస్తామని చెప్పిన కేసీఆర్... ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. హామీలు విస్మరించిన టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశం సందర్భంగా గీత కార్మికులు అందించిన కల్లును దిగ్విజయ్ తాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement