శాంటా క్లాజ్ కావాలంటే...

శాంటా క్లాజ్ కావాలంటే...

కొలరాడో : క్రిస్మస్‌తో పాటు శాంటా క్లాజ్ కూడా వచ్చేస్తాడు. తమకెన్నో బహుమతులు తెచ్చే శాంటా క్లాజ్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. శాంటా క్లాజ్ అంటే ఎరుపు రంగు డ్రస్ వేసుకుని.. తెల్లటి గడ్డం పెట్టుకుని.. జింగిల్ బెల్ అంటూ పాటలు పాడటమేనా.. కాదు.. శాంటా క్లాజ్ కావాలంటే ప్రత్యేకమైన శిక్షణ అవసరమంటున్నారు.. ఇదో కోర్సు అంటున్నారు నోయిర్ ప్రోగ్రామ్స్ కంపెనీ.. అందుకోసం శాంటా వర్సిటీనే ఏర్పాటు చేసిందీ సంస్థ.. ఇక్కడ శాంటాలకు శిక్షణ ఇస్తారు. అమెరికాలోని కొలరాడోకు చెందిన నోయిర్ ప్రోగ్రామ్స్ సంస్థ శాంటాలను రిక్రూట్ చేసుకుని.. వారికి 4 రోజుల పాటు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది.

 

వీరి వద్ద 70 మంది నిపుణులైన శాంటాలు ఉన్నారట. శిక్షణలో భాగంగా శాంటాలు పాటించాల్సిన నియమాలు..ఫొటోలకు పర్‌ఫెక్ట్‌గా పోజు ఎలా ఇవ్వాలి? సోషల్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో ఎలా మసలు కోవాలి? పిల్లలతో ఎలా కలిసిపోవాలి? క్రిస్మస్‌కు సంబంధించి పిల్లల నుంచి ఏదైనా అనూహ్యమైన ప్రశ్నలు వస్తే ఎలా వ్యవహరించాలి? అదే విధంగా పండుగ రోజుల్లో ఆరోగ్యకరంగా ఉండటం వంటి వాటిని బోధిస్తారు. అలాగని శాంటా శిక్షణకు కూడా ఎవరిని పడితే వారిని తీసుకోరట. వాళ్ల నేపథ్యం వంటివాటిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత, పలుమార్లు ఇంటర్వ్యూ చేసిన అనంతరం రిక్రూట్ చేసుకుంటామని నోయిర్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇంతకీ ఈ శాంటాల సంపాదన ఎంత అని ప్రశ్నిస్తే.. ‘వాళ్ల అనుభవం బట్టి ఉంటుంది. అయితే.. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు.. పిల్లలకు ఎంత అద్భుతమైన, చిరస్మరణీయమైన అనుభూతిని కలుగజేశామన్నదే ముఖ్యం’ అని అన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top