సాక్షి మీడియా పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు రోజుకో రీతిలో నిరసనలు తెలుపుతున్నాయి.
- ఏపీలో కొనసాగుతున్న ఆందోళనలు
సాక్షి నెట్‌వర్క్: సాక్షి మీడియా పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు రోజుకో రీతిలో నిరసనలు తెలుపుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఆర్కే బీచ్‌లో సాక్షి సిబ్బంది, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు గురువారం సాగర దీక్ష చేశారు. మోకాళ్లపై నిల్చొని చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీచ్‌లో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్కేబీచ్ జంక్షన్‌లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
మీడియా స్వేచ్ఛను హరిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్న చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని ఎన్టీఆర్‌ను వేడుకొన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సింహాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు మనసు మార్చాలంటూ తొలిపావంచా వద్ద ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామికి వినతిపత్రం అందజేశారు. గురువారం రాత్రి అనంతపురంలో జర్నలిస్టు సంఘాలు, వైఎస్సార్‌సీపీ నేతలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రాస్తారోకో నిర్వహించారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
సాక్షి టీవీకి మద్దతుగా చైనాలో విద్యార్థుల నిరసన
లయోనింగ్: ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలుపుదలపై మన తెలుగు రాష్ట్రాల్లోనేకాదు దేశవిదేశాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని లయోనింగ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జిన్‌ర మెడికల్ వర్సిటీలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనను వ్యక్తంచేశారు. టీడీపీ ప్రభుత్వం తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారని చైనా వైఎస్సార్సీపీ మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కొనకళ్ల పవన్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు.