‘సదావర్తి’లో సత్యం సమాధి! | rjc a detailed report to the Ministry of Endowments | Sakshi
Sakshi News home page

‘సదావర్తి’లో సత్యం సమాధి!

Aug 11 2016 3:42 AM | Updated on Sep 4 2017 8:43 AM

‘సదావర్తి’లో సత్యం సమాధి!

‘సదావర్తి’లో సత్యం సమాధి!

సదావర్తి సత్రం భూములను ప్రభుత్వ పెద్దలు కారుచౌకగా కొట్టేశారన్నది నిజమని మరోసారి తేటతెల్లమైంది.

దేవాదాయ శాఖకు ఆర్‌జేసీ సవివర నివేదిక
అమరావతి:  అత్యంత విలువైన సదావర్తి సత్రం భూములను ప్రభుత్వ పెద్దలు కారుచౌకగా కొట్టేశారన్నది ముమ్మాటికీ నిజమని మరోసారి తేటతెల్లమైంది. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 83.11 ఎకరాల సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో వారు దక్కించుకున్నట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా ఇప్పటికే వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వేలం నిబంధనల మేరకే జరి గిందని, అక్రమాలకు ఆస్కారమే లేదం టూ సర్కారు పెద్దలు అడ్డంగా బుకాయిస్తున్నా... వారి దోపిడీని బయటపెట్టే సాక్ష్యం ‘సాక్షి’ చేతికి చిక్కింది. సదావర్తి సత్రం భూముల వేలంలో నిబంధనలకు పాతరేశారని, అడ్డగోలుగా వ్యవహరించారని ఆక్షేపిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయు క్త కమిషనర్(ఆర్‌జేసీ) ఆ శాఖ కమిషనర్‌కు సవివరమైన నివేదిక అందజేశారు. తమ బండారం బయటపడుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలు ఈ లేఖను తొక్కిపెట్టేశారు. సదరు నివేదిక ‘సాక్షి’కి అందింది.

అక్రమాలపై 9 పేజీల నివేదిక
రూ.1,000 కోట్ల భూ దోపిడీపై ఈ ఏడాది మే 28న ‘సాక్షి’ ప్రత్యేక కథనం తర్వాత దేవాదా య శాఖ తిరుపతి రీజినల్ జాయింట్ కమిషనర్ డి.భ్రమరాంభ ఈ వ్యవహారంపై మరి న్ని ఆధారాలు సేకరించి కమిషనర్‌కు జూన్ 8న ఒక నివేదిక సమర్పించారు. సదావర్తి సత్రం భూముల అమ్మకంలో చోటుచేసుకున్న అక్రమాలను 9 పేజీల నివేదికలో ఆర్‌జేసీ సమగ్రంగా వివరించారు. ఈ భూముల వేలం విధానం ఏమాత్రం సరికాదని, మార్గదర్శకాల కు విరుద్ధంగా జరిగిందని ఆమె పేర్కొన్నారు.

ఎకరాకు రూ.27 లక్షలేనా?
వేలంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆర్‌జేసీ స్పష్టంగా పేర్కొన్నారు. భూముల అమ్మకానికి రూపొందించిన నిబంధనల ప్రకారం... మొదట బహిరంగ వేలం నిర్వహించారు. ఎక్కువ మొత్తానికి పాడిన పాటదారుడిని ఎంపిక చేయాలి. తదుపరి సీల్డు టెండర్లు తెరవాలి. అయితే, మార్చి 28న నిర్వహించిన వేలం సమయంలో తాను నిబంధనలను గుర్తు చేసినా హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం నుంచి వేలం పాట పర్యవేక్షణకు వచ్చిన ఎస్టేట్స్ విభాగపు అసిస్టెంట్ కమిషనర్ ఖాతరు చేయలేదని ఆర్‌జేసీ వెల్లడించారు. ముందుగా సీల్డు టెండర్లు తెరిపించారని పేర్కొన్నారు. భూముల వేలానికి ఎకరాకు రూ.50 లక్షల బేస్ ధరను దేవాదాయ శాఖ నిర్ణయించినా.. తర్వాత దాన్ని క్రమంగా తగ్గించారని, చివరకు ఎకరాకు రూ.27 లక్షల ధర నిర్ణయించారని తెలిపారు.

 
రిజిస్ట్రేషన్ ధరే ఎకరాకు రూ.7.80 కోట్లు

వేలానికి ముందే భూముల వాస్తవ ధర తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. సదావర్తి సత్రం కార్యనిర్వహణాధికారి(ఈవో) భూముల వాస్తవ ధర తెలుసుకోవడానికి ప్రయత్నించినా తమిళనాడులోని అధికారులు సహకరించలేదనడం కూడా  అవాస్తవమే స్పష్టమవుతోంది. మే 28న భూముల విలువ గురించి తాను స్వయంగా తమిళనాడులోని సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించగా, సత్రం ఈవో నుంచి తనకు ఎలాంటి లేఖ అందలేదని వారు తెలియజేశారని ఆర్‌జేసీ నిదేదికలో పొందుపరిచారు. అక్కడి రిజిస్ట్రార్ అందజేసిన వివరాల ప్రకారం వేలం నిర్వహించిన భూములకు రిజిస్ట్రేషన్ ధరే రూ.2 కోట్ల నుంచి రూ.7.80 కోట్ల వరకు ఉందని తెలినట్టు నివేదికలో భ్రమరాంబ పేర్కొన్నారు. సర్వే నెంబర్ల వారీగా భూముల రిజిస్ట్రేషన్ ధరలను నివేదికలో ఆమె వివరించారు. భూముల వాస్తవ విలువ విషయంలో సత్రం ఈవో దేవాదాయ శాఖలోని ఇతర ఉన్నతాధికారులందరినీ తప్పదారి పట్టించారని వివరించారు.

 
నిబంధనల ద్వారా బెదరగొట్టేశారు

తమ బినామీలకే సత్రం భూములు దక్కేందుకు వీలుగా ప్రభుత్వ పెద్దలు ఇతరులను భయభ్రాంతులను గురిచేసేలా టెండర్ల నిబంధనలను రూపొందించారని ఆర్‌జేసీ నివేదిక ద్వారా తెలిస్తోంది. వేలం నిర్వహిస్తున్న 83.11 ఎకరాలు అక్రమణల్లో ఉండడంతోపాటు ఆ స్థలాల్లో భవనాలు, విల్లాలు, నిర్మాణాలు, ఫెన్సింగ్‌లు ఉన్నాయని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, వేలం నిర్వహించిన భూముల్లో 30 నుంచి 40 ఎకరాల భూమి ఖాళీగా ఉందని.. దాని చుట్టూ ప్రహరీ గోడ లేదా ఫెన్సింగ్ మాత్రమే ఉందని ఆర్‌జేసీ గుర్తుచేశారు. ఆ భూమిలో నిర్మాణాలు లేవని తన పరిశీలనలో తేలినట్టు వెల్లడించారు. కేవలం ఫెన్సింగ్‌తో ఉన్న భూముల వివరాలను సర్వే నంబర్‌తో సహా తన నివేదికలో ప్రస్తావించారు.


ఈ-టెండర్ లేదు.. వేలానికి ప్రచారమూ లేదు
దేవాదాయ శాఖకు చెందిన భూముల అమ్మకంలో ఈ-టెండర్ విధానాన్ని పాటించాలని 2011లో ఆ శాఖ కమిషనర్ జారీ చేసిన మెమో ఏ4/14389లో స్పష్టంగా ఉంది. సదావర్తి సత్రం భూముల అమ్మకానికి ఈ-టెండర్‌ను అమలు చేయలేదని ఆర్‌జేసీ తప్పుపట్టారు. భూముల వేలం గురించి అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదని తెలిపారు. వేలానికి పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలోనూ భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలను పేర్కొనలేదని నివేదికలో వెల్లడించారు. ఈ భూములకు అధిక ధర పలుకుతోందనే సంగతి అందరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారని, వేలం వేస్తున్న భూముల్లో పెద్ద మొత్తంలో భూమి ఖాళీగా ఉందన్న విషయాన్నీ రహస్యంగా ఉంచారని తెలియజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement