పాత నోట్లు భద్రపరిచే చోటేదీ! | RBI stranding old notes store | Sakshi
Sakshi News home page

పాత నోట్లు భద్రపరిచే చోటేదీ!

Dec 23 2016 3:44 AM | Updated on Sep 4 2017 11:22 PM

పాత నోట్లు భద్రపరిచే చోటేదీ!

పాత నోట్లు భద్రపరిచే చోటేదీ!

రాష్ట్రంలో పాత నోట్లను భద్రపరిచేందుకు రిజర్వు బ్యాంకు అవస్థలు పడుతోంది. సరిపడేంత స్థలం లేకపోవడంతో స్ట్రాంగ్‌ రూమ్‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది.

రాష్ట్రంలో రిజర్వ్‌ బ్యాంకుకు కొత్త చిక్కు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాత నోట్లను భద్రపరిచేందుకు రిజర్వు బ్యాంకు అవస్థలు పడుతోంది. సరిపడేంత స్థలం లేకపోవడంతో స్ట్రాంగ్‌ రూమ్‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది. రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్రం రద్దు చేయటంతో నవంబర్‌ 9 నుంచి గురువారం వరకు (44 రోజుల్లో) రాష్ట్రవ్యాప్తంగా రూ.60 వేల కోట్ల విలువైన పాత నోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయగా బ్యాంకులు ఏరోజుకారోజు పాత నోట్లను ఆర్‌బీఐకి చేరవేస్తున్నాయి. అయితే హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం తమ పరిధిలో ఉన్న ఒక డెలివరీ పాయింట్‌లో కొత్త కరెన్సీతోపాటు పాత నోట్ల నిల్వకు స్థలం కేటాయించింది. అలాగే వివిధ బ్యాంకుల అధ్వర్యంలో ఉన్న 18 కరెన్సీ చెస్ట్‌లలోనూ పాత నోట్లను భద్రపరిచింది. అయితే ఆర్‌బీఐ ముద్రణాలయం నుంచి రాష్ట్రానికి సరఫరా అవుతున్న కొత్త కరెన్సీని సైతం బ్యాంకులకు చేరే వరకు స్ట్రాంగ్‌ రూమ్‌ల్లోనే భద్రపరుస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న పాత నోట్ల నిల్వలను భద్రపరిచే పరిస్థితి లేదని ఆర్‌బీఐ అధికారులు గుర్తించారు.

 పాత నోట్లు మరో రెండు వేల కోట్లు దాటితే నిల్వ సమస్య తీవ్రమవుతుందని, నోట్లు భద్రపరిచేందుకు అదనంగా స్ట్రాంగ్‌ రూమ్‌లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీలు, సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లను వినియోగించుకోవాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. ట్రెజరీలు, సబ్‌ ట్రెజరీల్లో పాత నోట్లను నిల్వ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతూ ఆర్‌బీఐ అధికారులు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం సైతం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నిర్దేశించిన గడువు మేరకు ప్రజలు తమ దగ్గరున్న పాత నోట్లు డిపాజిట్‌ చేసేందుకు ఇంకా 8 రోజుల గడువు ఉండటంతో మరో రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు జమ అవుతాయని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement