జాడలేని వరుణుడు.. | rain not comes | Sakshi
Sakshi News home page

జాడలేని వరుణుడు..

Jul 4 2017 11:05 PM | Updated on Jun 1 2018 8:39 PM

జాడలేని వరుణుడు.. - Sakshi

జాడలేని వరుణుడు..

ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలోనూ రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. జులై ప్రారంభమైనా కనీసం ఒక బలమైన వర్షం కురవక పోవడంతో అన్నదాతల్లో కలవరం మొదలైంది.

తడారిన బోర్లు
గుక్కెడు నీటికీ తిప్పలే


పెనుకొండ : ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలోనూ రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. జులై ప్రారంభమైనా కనీసం ఒక బలమైన వర్షం కురవక పోవడంతో అన్నదాతల్లో కలవరం మొదలైంది. 3.3 లక్షల పైచిలుకు జనాభా, 2.05 లక్షల ఓటర్లు ఉన్న పెనుకొండ  నియోజకవర్గంలో దాదాపు అన్ని చెరువులూ ఎండిపోయాయి. 90 శాతం బోరుబావుల్లో  ఎండిపోయాయి. పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, పరిగి, గోరంట్ల మండలాల్లో ఎటు చూసినా దుక్కి చేయకుండా వదిలేసిన పొలాలు కనిపిస్తున్నాయి.

విత్తనం కొనుగోలు చేయలేకపోయిన రైతులు
ఖరీఫ్‌ ఆరంభంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో విత్తన పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు.  అయితే వరుస పంట నష్టాలతో అప్పుల పాలైన రైతుల వద్ద ఈ ఏడాది విత్తనం కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేకపోయారు. దీనికి తోడు ఈ ఏడాదీ వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండడంతో పంట సాగుపై రైతులు చేతులెత్తేశారు.  ప్రతి రోజూ విత్తన పంపిణీ కేంద్రాలు రైతులు లేక బోసిపోతూ కనిపించాయి. రైతులు దుక్కి చేయని పొలాలు వేల ఎకరాల్లో ఉన్నాయి.

ఎండుతున్న తోటలు
పెనుకొండ  ప్రాంతంలో ఎటు చూసినా తోటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో 29,999 హెక్టార్ల మామిడి తోటలు ఉండగా,  వీటిలో 5,037  హెక్టార్లలో మామిడి తోటలు పెనుకొండ నియోజకవర్గంలోనే ఉన్నాయి.  అడుగంటిన భూగర్భజలాలు, ఎండిన బోర్ల ప్రభావంతో మామిడితో పాటు ఇతర పండ్ల తోటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి.

బీటలు వారుతున్న చెరువులు
నియోజకవర్గంలోని అన్ని చెరువులు చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. నెర్రెలు చీలి సీమజాలి చెట్లుకు నిలయంగా మారిపోయాయి. చెరువుల్లో నీరు లేకపోవడంతో బోర్లలో నీరు అడుగంటిపోయింది. కనీసం తాగునీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి  పెనుకొండకు తాగునీటిని అందించేందుకు రూ. 5 కోట్లతో చేపట్టిన పైప్‌లైన్‌ పనులు పూర్తిఅయినా ప్రారంభానికి నోచుకోలేకపోయింది.

దారి మళ్లిన జీడిపల్లి రిజర్వాయర్‌ నీరు
జీడిపల్లి నుంచి గొల్లపల్లికి రిజర్వాయర్‌కు చేరుతున్న హంద్రీ-నీవా నీరు కాస్తా దారి మళ్లింది  రిజర్వాయర్‌ నిండకుండానే నేరుగా బుక్కపట్నం చెరువుకు అధికారులు మళ్లించారు. దీనివల్ల పెనుకొండ, మడకశిర, హిందూపురం తదితర ప్రాంతాలకు నీరు అందించే అవకాశాలు సన్నగిల్లాయి. కాలువ పనులు విస్తరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు టీడీపీ నాయకులకు వరంగా మారింది. చెరువులకు నీరు అందించాల్సిన సప్లై చానల్‌ పనులు చేపట్టడం ప్రశ్నార్థకమవుతోంది.

చెరువులు నింపాలి
హంద్రీ-నీవా నీటితో చెరువులను నింపితే భూగర్భజలాలు పెరిగి ప్రజల మనుగడ సాగుతుంది. హంద్రీనీవా కాలువ పనులు వేగవంతం చేసి నీటిని గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి చెరువులకు మళ్లించాలి.
- ఆదినారాయణరెడ్డి, సమతా స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు, పెనుకొండ

కరువు నివారణా చర్యలు చేపట్టాలి
 హంద్రీ-నీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తిగా నింపాలి. లేకుంటే ఉపాధి లభ్యం కాక ప్రజలు వలస పోయే ప్రమాదముంది.  రిజర్వాయర్‌కు చేరే నీరు ఇతర ప్రాంతాలకు మళ్లించరాదు.
- శ్రీకాంతరెడ్డి, మండల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్, పెనుకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement