జిల్లాలో నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు ప్రోత్సహించాలని శ్రీకాకుళం జిల్లా వాణిజ్య పన్నుల అధికారిణి జి.రాణిమోహన్ పేర్కొన్నారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి
Nov 27 2016 3:41 AM | Updated on Sep 2 2018 4:52 PM
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు ప్రోత్సహించాలని శ్రీకాకుళం జిల్లా వాణిజ్య పన్నుల అధికారిణి జి.రాణిమోహన్ పేర్కొన్నారు. ఇందుకు ఈ-పాస్, స్వైప్ యంత్రాల వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. స్థానిక వాణిజ్య పన్నుల కార్యాలయంలో ఈ-పోస్, స్వైప్ యంత్రాల వినియోగంపై డీలర్లు, బ్యాంకు అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణీమోహన్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల కమిషనర్, ఉప కమిషనర్ సూచనల మేరకు డీలర్లందరూ స్వైప్ మెషీన్లను వినియోగించాలని సూచించారు. స్వైపింగ్ మెషీన్ల వినియోగం వల్ల కలిగే లాభాలను బ్యాంకు అధికారులు వివరించారు. డీలర్లు అడిగిన అనేక సందేహాలను వారు నివృత్తి చేశారు.
పెరిగిన స్వైపింగ్ వినియోగం
రాష్ట్ర వాణిజ్య పన్నుల సంఘం (విజయనగరం డివిజన్) అధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్రంలో స్వైపింగ్ యంత్రాల వినియోగం బాగా పెరిగిందని, జిల్లాలో కూడా వీటి వినియోగం పెంచే దిశగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీలో కనీసం ఒక పెద్ద కిరాణా వర్తకుడైనా ఈ పోస్, స్వైపింగ్ వినియోగించాలని, రిజిష్టర్డు డీలర్లతో పాటు అన్ రిజిష్డర్డ్ డీలర్లు కూడా వినియోగించాలని కోరారు. ఇకపై ఆన్‌లైన్లో ఈ-వే బిల్లులు తీసే డీలర్లు తప్పనిసరిగా ఈ-పోస్ మెషీన్లు వాడాల్సి ఉంటుందని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ డి.మేరీసగారియా మాట్లాడుతూ డెబిట్, క్రెడిట్, రూపే కార్డుల గురించి, వాటి వినియోగం గురించి విపులంగా వివరించారు. కార్యక్రమంలో ఉప వాణిజ్య పన్నుల అధికారి కె.క్రిష్ణవేణి, సహాయ వాణిజ్య పన్నుల అధికారి కె.ఫల్గుణరావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement