Commercial Tax Officer
-
పోలీస్ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ డివిజన్–1 కార్యాలయం ఇంటెలిజెన్స్ విభాగంలో జీఎస్టీ అధికారులు బి.మెహర్‌కుమార్, కె.సంధ్య, సీనియర్ అసిస్టెంట్ కె.వి.చలపతి, ఆఫీస్ సబార్డినేట్ ఎం.సత్యనారాయణలను పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. నలుగురు ఉద్యోగులు విధులను దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు రాష్ట్ర పన్నులశాఖ కార్యాలయం డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 31వ తేదీన కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల్ని విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులు నలుగురికి రిమాండ్ విధించిందన్నారు. నలుగురు ఉద్యోగులు కార్యాలయంలోని పలు రికార్డులను తారుమారు చేశారని, ఈ అవినీతిలో మరి కొందరు అధికారుల పాత్రపై విచారించాల్సి ఉన్నందున నిందితులను తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరినట్లు చెప్పారు. న్యాయాధికారి ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నలుగురు ఉద్యోగులను పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. చదవండి: IAS vs IPS: ఐపీఎస్ రూపకు ముందస్తు బెయిల్ -
ఆదాయానికి గండి
వ్యాపారులకు అధికారుల ‘సహకారం’ లెక్కల విషయంలో ఉదాసీనత అడ్రస్‌లేని చాలన్ల రిజిస్టర్ ఏళ్లుగా నమోదును మరిచిన అధికారులు వాణిజ్య పన్నుల శాఖలో వింతలు వరంగల్ : వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్న వ్యవహారం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇదే తరహా వ్యవహారాలు వరంగల్ వాణిజ్య పన్నుల శాఖ వరంగల్ డివిజన్‌లోనూ కొన్నిచోట్ల జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాణిజ్య పన్నులను వంద శాతం వసూలు చేసేందుకు రూపొందించిన వ్యవస్థను కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ వరంగల్ డివిజన్ పరిధిలో 11 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వరంగల్, బీట్ బజార్, రామన్నపేట, ఫోర్టు రోడ్డు, మహబూబాబాద్, జనగామ, నర్సంపేట, ఖమ్మం–1, ఖమ్మం– 2, ఖమ్మం–3, కొత్తగూడెం సర్కిళ్లు ఉన్నాయి. వీటికి కమర్షియల్ ట్యాక్స్ అధికారి(సీటీఓ) నేతృత్వం వహిస్తారు. సర్కిళ్ల పరిధిని బట్టి ఒకరు లేదా ఇద్దరు డిప్యూటీ సీటీవోలు, నలుగురు నుంచి ఆరుగురు వరకు అసిస్టెంట్ సీటీవోలు పనిచేస్తారు. మొత్తంగా వరంగల్ డివిజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయ స్థాయిలో ఆదాయం రావాల్సి ఉంది. కానీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తీరుతో ఆశించిన ఆదాయం రావడంలేదు. వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది వ్యాపారస్తులకు ‘సహకారం’ అందిస్తుండడంతో ఈ డివిజన్లో జరుగుతున్న వ్యాపారానికి, ఆదాయానికి పొంతన కుదరడం లేదు. చాలన్ల రూపంలో పన్నులు వాణిజ్య పన్నుల శాఖకు వ్యాపారస్తులు చెల్లించే పన్ను మొత్తాన్ని చాలన్ల రూపంలో ఇస్తారు. వాణిజ్య పన్నుల శాఖలో చాలన్లు ఇవ్వడంతోపాటు ఈ మొత్తాన్ని ఖాజానా శాఖ కార్యాలయంలో చెల్లింపులు జరపాలి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు... చాలన్లను, ఖాజానాలో చెల్లించే మొత్తాన్ని సరిచూసి ప్రతి నెలా ప్రభుత్వానికి వివరాలు పంపాలి. ఖజానా శాఖ అధికారి ధ్రువీకరించిన వివరాల ప్రకారం... వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యాపారుల వారీగా చెల్లింపులను పరిశీలించి బకాయిలు ఉంటే ప్రత్యేక జాబితా రూపొందించాలి. బకాయిలు ఉన్న వ్యాపారులకు నోటీసులు పంపి ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ, వాణిజ్య పన్నుల శాఖలో బకాయిల వివరాలను నమోదు చేయకుండా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. వ్యాపారులు సమర్పించిన చెక్కులు బౌన్స్ అయిన సందర్భాల్లో వారిపై కేసులు నమోదు చేయాల్సి ఉండగా ఇది కూడా జరగడం లేదని తెలుస్తోంది. వ్యాపారుల వారీగా ఆధారిత పన్ను(వ్యాట్), సీఎస్టీ (సెంట్రల్ సేల్ ట్యాక్స్) వివరాలను నిర్ధారించేటప్పుడు రికార్డులు పరిశీలించకుండానే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వ్యాపారులు చెప్పిన లెక్కలనే అధికారులు నమోదు చేసి వారికి పూర్తిగా సహకరిస్తున్నారు. చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని తక్కువగా నమోదు చేసిన అధికారులను వ్యాపారులు బాగా చూసుకుంటున్నారు. అధికారులు, వ్యాపారులు కలిసి చేస్తున్న వ్యవహారాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో భారీగా కోత పడుతోంది. ఏళ్లుగా ఇదే... వాణిజ్య పన్నుల శాఖలో ఆదాయానికి సంబంధించిన గణాంకాలను పేర్కొనే వ్యవస్థ కొన్ని సంవత్సరాలుగా గాడి తప్పిందని తెలుస్తోంది. వ్యాపారుల వారీగా సమర్పించిన చాలన్లు వివరాలను ప్రతీరోజు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రత్యేక రిజిస్టర్(పుస్తకం)లో నమోదు చేయాలి. చాలన్ల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయడం వల్ల ట్రెజరీలో సమర్పించిన మొత్తాన్ని సరిచూసే అవకాశం ఉంటుంది. వాణిజ్య పన్నుల శాఖ వరంగల్ డివిజన్లో కొన్నేళ్లుగా చాలన్ల వివరాలను రిజిస్టర్లో నమోదు చేసే ప్రక్రియ జరగడం లేదని తెలిసింది. డివిజన్ పరిధిలోని మొత్తం 11 సర్కిల్ కార్యాలయాల్లోనూ చాలన్ల నమోదు రిజిస్టర్లు సైతం లేవని తెలుస్తోంది. చాలన్ల నమోదు రిజిస్టర్ లేకపోవడంతో వ్యాపారులు ఖజానా శాఖలో చెల్లించే మొత్తం, వాణిజ్య పన్నుల శాఖకు సమర్పించే చాలన్లలో పేర్కొనే మొత్తానికి భారీగా వ్యత్యాసం ఉంటోందనే అభిప్రాయం ఉంది. ఖాజానా శాఖలో జమ అయిన మొత్తం ఎంతనేది పరిశీలించకుండానే చాలన్లను ఆమోదిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్లో జరిగిన వ్యవహారంతో వెలుగు చూసింది. ఈ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. పాత వివరాలను సరిచేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. -
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు ప్రోత్సహించాలని శ్రీకాకుళం జిల్లా వాణిజ్య పన్నుల అధికారిణి జి.రాణిమోహన్ పేర్కొన్నారు. ఇందుకు ఈ-పాస్, స్వైప్ యంత్రాల వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. స్థానిక వాణిజ్య పన్నుల కార్యాలయంలో ఈ-పోస్, స్వైప్ యంత్రాల వినియోగంపై డీలర్లు, బ్యాంకు అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణీమోహన్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల కమిషనర్, ఉప కమిషనర్ సూచనల మేరకు డీలర్లందరూ స్వైప్ మెషీన్లను వినియోగించాలని సూచించారు. స్వైపింగ్ మెషీన్ల వినియోగం వల్ల కలిగే లాభాలను బ్యాంకు అధికారులు వివరించారు. డీలర్లు అడిగిన అనేక సందేహాలను వారు నివృత్తి చేశారు. పెరిగిన స్వైపింగ్ వినియోగం రాష్ట్ర వాణిజ్య పన్నుల సంఘం (విజయనగరం డివిజన్) అధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్రంలో స్వైపింగ్ యంత్రాల వినియోగం బాగా పెరిగిందని, జిల్లాలో కూడా వీటి వినియోగం పెంచే దిశగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీలో కనీసం ఒక పెద్ద కిరాణా వర్తకుడైనా ఈ పోస్, స్వైపింగ్ వినియోగించాలని, రిజిష్టర్డు డీలర్లతో పాటు అన్ రిజిష్డర్డ్ డీలర్లు కూడా వినియోగించాలని కోరారు. ఇకపై ఆన్లైన్లో ఈ-వే బిల్లులు తీసే డీలర్లు తప్పనిసరిగా ఈ-పోస్ మెషీన్లు వాడాల్సి ఉంటుందని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ డి.మేరీసగారియా మాట్లాడుతూ డెబిట్, క్రెడిట్, రూపే కార్డుల గురించి, వాటి వినియోగం గురించి విపులంగా వివరించారు. కార్యక్రమంలో ఉప వాణిజ్య పన్నుల అధికారి కె.క్రిష్ణవేణి, సహాయ వాణిజ్య పన్నుల అధికారి కె.ఫల్గుణరావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
-
ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
హైదరాబాద్‌సిటీ: అవినీతి నిరోధక శాఖాధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. నల్గొండ జిల్లా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సయ్యద్ బాషా హుస్సేన్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న 2 లారీలను పట్టుకుని 2 రోజులైనా వాటిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా ఉంచి రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోనికి దిగిన నల్గొండ ఏసీబీ అధికారులు హుస్సేన్ లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. వనస్థలిపురంలో నివాసముంటున్న భాషా ఇంటిపై మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ రామదాసు అతని బృందం కలిసి బుధవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లో రూ.7 లక్షల నగదు, 500 గ్రాముల బంగారం, 4 కిలోల వెండితో పాటు పలు భూ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హుస్సేన్‌పై కేసు నమోదు చేసిన అధికారులు విచారిస్తున్నారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి
మామూళ్లు తీసుకుంటున్న వాణిజ్య పన్నుల శాఖాధికారిని అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. సరూర్‌నగర్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వేణుగోపాలరావు ఓ వ్యక్తి నుంచి రెండువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీకి పట్టుబడ్డ వేణుగోపాలరావు కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. -
కారు డ్రైవరే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్..!
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సీటీవోగా అవతారమెత్తి వసూళ్ల దందాకు తెరతీశాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. వివరాలివీ.. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు కమర్షియల్ ట్యాక్స్ అధికారి(సీటీవో) పోస్టు 8 నెలలుగా ఖాళీగా ఉంది. ఇదే అదనుగా ఆ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానాపురం సత్యనారాయణ పరకాయ ప్రవేశం చేశాడు. తనే సీటీవోగా చెప్పుకుంటూ దందా ప్రారంభించాడు. గత ఎనిమిది నెలలుగా దాదాపు రూ.20 లక్షలు వసూలు చేసుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు వారు అతనిపై ఓ కన్నేసి ఉంచారు. శుక్రవారం వేకువజామున మానవపాడు టోల్గేట్ వద్ద ట్యాక్స్ పేరిట వసూళ్లకు పాల్పడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నుల అధికారి
పెదవాల్తేరు : విశాఖపట్నంలో ఉప వాణిజ్య పన్నుల అధికారి(డీసీటీఓ)గా పనిచేస్తున్న కమలారావు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే... వన్‌టౌన్ ప్రాంతంలోని శ్రీనివాస్ జ్యూయెలరీ షాప్‌పై లోగడ నిర్వహించిన సోదాలకు సంబంధించి ఎసెస్మెంట్ ఇవ్వడం కోసం ఆయన రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. రూ.1.50లక్షలు లంచం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. అయితే షాపు యజమాని శ్రీనివాసరావు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చేరవేశాడు. కాగా సోమవారం ఉదయం శ్రీనివాసరావు నుంచి రూ.1.50లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డీసీటీవో కమలారావును పట్టుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.