ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పోండి! | Privately to private labs! | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పోండి!

Aug 24 2017 3:03 AM | Updated on Sep 17 2017 5:53 PM

ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పోండి!

ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పోండి!

చాపాడు మండలం అల్లాడుపల్లెకు చెందిన రమణమ్మ గర్భిణీ.

అవసరం లేకున్నా బయటకు రాస్తున్నారని రోగుల ఆవేదన
కమీషన్ల రూపంలో వైద్యులకు కవర్లు
దోపిడీకి గురవుతున్న పేద రోగులు
జిల్లా ఆస్పత్రిపై నిర్లక్ష్యపు నీడలు


చాపాడు మండలం అల్లాడుపల్లెకు చెందిన రమణమ్మ గర్భిణీ. పరీక్షలు చేయించుకోవడానికి తల్లితో కలిసి జిల్లా ఆస్పత్రికి వచ్చారు. పరిశీలించిన వైద్యులు స్కానింగ్‌ కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌కు వెళ్లమని సూచించారు. ఆస్పత్రిలో స్కానింగ్‌ మిషన్‌ ఉన్నా ఎందుకు బయటకి పంపిస్తున్నారంటూ రమణమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.  

సంజీవనగర్‌కు చెందిన 16ఏళ్ల బాలుడికి కడుపునొప్పి రావడంతో వారంరోజుల క్రితం తల్లిదండ్రులు జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అపెండిక్స్‌ ఉన్నట్టుందని, స్కానింగ్‌ చేయించుకొని రమ్మని బయటకు పంపారు. దీంతో బాలుడికి గాంధీరోడ్డులోని సెంటర్‌లో స్కానింగ్‌ చేయించగా అపెండిక్స్‌ లేదని నిర్ధారణ అయింది.

ఇటీవల ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన నాగరాజు మూత్రం సరిగా రాలేదని జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. పరిశీలించిన వైద్యుడు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, బయట స్కానింగ్‌ చేసుకొని రమ్మని పంపించాడు. అయితే స్కానింగ్‌ తీస్తే రిపోర్టులో రాళ్లు లేవని తేలింది. వేడి వల్ల అలా జరిగిందని రేడియాలజిస్టు తెలిపాడు. ఇలాంటి సంఘటనలు తరచూ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్నాయి.

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ధర్మాసుపత్రిలో కమీషన్లు, మామూళ్లు పనులను చక్కబెడుతున్నాయి. ఇక్కడికి వచ్చే గర్భిణీ కేసులు గంట తిరిగే సరికే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంటున్నాయి. సాధారణ జబ్బులకు అవసరం లేకున్నా కొందరు వైద్యులు స్కానింగ్, ఇతర పరీక్షల కోసం రోగులను బయటికి పంపిస్తున్నారు. ఆస్పత్రిలో తరచూ మందుల కొరత ఉండటంతో రోగులు ప్రైవేట్‌ మెడికల్‌ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆస్పత్రిలో కాన్పుకు రావాలంటే పేదలు భయపడే పరిస్థితి ఉంది. సుఖ ప్రసవానికి ఒక రేటు, సీజేరియన్‌ జరిగితే మరొక రేటు పెట్టుకొని కొందరు సిబ్బంది ఆస్పత్రిలో దోపిడీకి పాల్పడుతున్నారు.

అవసరం లేకున్నా స్కానింగ్‌ పరీక్షలు
జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రక్త పరీక్షలతో పాటు సీటి స్కానింగ్‌ పరీక్షలు చేస్తారు. వైద్యులు సూచించిన కొన్ని ముఖ్యమైన వ్యాధులకు మాత్రమే స్కానింగ్‌ నిర్వహిస్తారు. ప్రతినెల 9వ తేదీన, అత్యవసరమైన సమయంలో గర్భిణులకు స్కానింగ్‌ చేస్తుంటారు. మిగతా సమయాల్లో గర్భిణీలను స్కానింగ్‌ పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో పెద్దమొత్తంలో ఖర్చు అవుతోందని పేదలు వాపోతున్నారు. ఇంకా సర్జికల్‌ ఆపరేషన్‌లకు సంబంధించిన కొన్ని కేసుల్లో వైద్యులు ఎక్కువగా బయటి ల్యాబ్‌లకే బాధితులను పంపిస్తున్నట్లు ప్రజ లు చెబుతున్నారు.

నెలనెలా జిల్లా ఆస్పత్రికి కవర్లు
జిల్లా ఆస్పత్రిలోని ప్రతి వైద్యుడి టేబుల్‌ మీద ప్రైవేట్‌ ల్యాబ్‌లు, స్కానిం గ్‌ సెంటర్ల ప్రిస్కిప్షన్‌ ప్యాడ్లు ఉన్నాయి. వాటిపైనే రాసి వైద్యులు బయటికి పంపిస్తున్నారు. ఒక్కో స్కానింగ్‌పై 40శాతం వరకు కమీషన్‌ ఇస్తున్నట్లు స్కానింగ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని ప్రతి నెలా 4, 5 తేదీల్లో కవర్లలో పెట్టి వైద్యులకు అందజేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో జిల్లా ఆస్పత్రి నుంచి ప్రైవేట్‌ సీటిస్కాన్, రక్త పరీక్షలను కూడా అవసరం లేకున్నా కొందరు వైద్యులు రాస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement