
ఆర్కే జాడ పోలీసులకు తెలుసు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ ఇన్‌చార్జి రామకృష్ణ సమాచారం మావోయిస్టులకు, ప్రజలకు తెలియడం
వైద్యం అందకుండా చేస్తున్నారు
- ఎన్‌కౌంటర్‌పై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలి
- వెంటనే కోర్టులో హాజరుపర్చాలి
- విరసం నేత వరవరరావు
వరంగల్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ ఇన్‌చార్జి రామకృష్ణ సమాచారం మావోయిస్టులకు, ప్రజలకు తెలియడం లేదంటే కచ్చితంగా పోలీసులకు తెలిసి ఉంటుందని విరసం నేత వరవరరావు పేర్కొన్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా.. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. హన్మకొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్కే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలకు సుపరిచితుడని, శాంతి చర్చల్లో ఆయన సుమారు పది రోజల పాటు ప్రభుత్వంతో చర్చలు జరపడం మీడియా, పత్రికల ద్వారా ప్రజలు వీక్షించారని తెలిపారు.
ఆర్కే ఏ గ్రామంలోని వీధుల్లో తిరిగినా సులువుగా ప్రజలు గుర్తుపడతారని తెలిపారు. పోలీసులు, ఏపీ ప్రభుత్వం సాంకేతికంగా తమ అదుపులో లేడని చెబుతున్నారని, అది నిజం కాదన్నారు. ఆర్కే గాయపడినట్లు, ఆయనతో పాటు మరో 9మంది ఆదివాసీలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. వారంతా ప్రస్తుతం పోలీసుల అదుపులో లేకున్నప్పటికీ వారు ఆశ్రయం పొందిన ప్రాంతం మాత్రం పోలీసుల కనుసన్నల్లోనే ఉందన్నారు. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అదుపులోకి తీసుకునే విధంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేసుకున్నట్లు వరవరరావు ఆరోపించారు. ఆర్కే ఎన్‌కౌంటర్‌లో గాయపడి కటాఫ్ ఏరియా, బలిమెల రిజర్వాయర్ ప్రాంతంలో ఏదో ఒక చోట ఉండి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని వరవరరావు వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న 148 ఇళ్ల ప్రాంతంలో ఆర్కేతో పాటు ఆదివాసీలు ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆర్కే, ఆదివాసీలు ఉన్న ప్రాంతం కచ్చితంగా పోలీసులకు తెలిసి ఉంటుందన్నారు.
ఆర్కేకు వైద్య సహాయం అందకుండా చేసి అంతమొందించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసమే ఆ ప్రాంతంలోని ఆర్‌ఎంపీలను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారని, మెడికల్ షాపులపై నిఘా పెట్టారని అన్నారు. పోలీసుల కనుసన్నల్లో ఉన్న ఆర్కేను కోర్టులో హాజరుపర్చాలని ఆయన కుటుంబీకులు హైకోర్టులో వేసిన పిటీషన్‌పై ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. ఏకపక్షంగా కాల్పులు జరిపినందున హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని కోర్టు సూచించినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే, ఈ ఎన్‌కౌంటర్ పూర్తిగా కోవర్టు ఆపరేషన్ అని, ఈ ఆపరేషన్‌కు సహకరించిన వ్యక్తికి జీపీఎస్ చిప్ ఏర్పాటు చేసినట్లు సమాచారం ఉందన్నారు.
ఒక వేళ కోవర్టు చనిపోయినప్పటికీ అతని శరీరంలో బిగించిన చిప్‌తో ఎక్కడున్నారు.. అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకునే అవకాశాలున్నాయన్నారు. గతంలో బిజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నాలుగు వైపుల నుంచి కాల్పులు జరపడంతో ఎదురుగా ఉన్న పోలీసులు చనిపోయిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్‌కౌంటర్ వ్యూహాన్ని మార్చినట్లు ఓ ప్రముఖ ఇంగ్లిషు దినపత్రిక వెబ్‌సైట్‌లో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నట్టు ఉందన్నారు. మూడు వైపులా బలగాలు చుట్టుముట్టే విధంగా ‘వి’ ఆకారంలో చుట్టుముట్టి ఒకసారి ఏకపక్షంగా కాల్పులు జరిపినట్లు ఉన్నతాధికారితో పాటు గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న కమెండో దినపత్రికకు తెలిపినట్లు ఆయన వివరించారు.