ఆధిపత్య వర్గాల నుంచి తమకు ప్రాణహాని ఉన్నందున తమకు తుపాకీ లైసెన్సు ఇప్పించాలని చిప్పగిరికి చెందిన సి. లక్ష్మీనారాయణ, క్రిష్ణగిరి మండలం సీహెచ్ ఎర్రగుడికి చెందిన కె. కిష్టన్న అధికారులను కోరారు.
తుపాకీ లైసెన్సులు ఇప్పించండి
Aug 30 2016 12:38 AM | Updated on Aug 21 2018 3:16 PM
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌లో దళితుల మొర
కర్నూలు(అర్బన్): ఆధిపత్య వర్గాల నుంచి తమకు ప్రాణహాని ఉన్నందున తమకు తుపాకీ లైసెన్సు ఇప్పించాలని చిప్పగిరికి చెందిన సి. లక్ష్మీనారాయణ, క్రిష్ణగిరి మండలం సీహెచ్ ఎర్రగుడికి చెందిన కె. కిష్టన్న అధికారులను కోరారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి వీరు హాజరయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సీ. హరికిరణ్, జేసీ–2 ఎస్ రామస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ తమ సమస్యలను అధికారుల ముందుంచారు. పశు సంవర్ధకశాఖ నుంచి జీవక్రాంతి పథకం ద్వారా లబ్ధిపొందేందుకు దరఖాస్తులు సమర్పించినా, ఇంతవరకు రాలేదని, తమ దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొందని నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన 15 మంది జేసీకి ఫిర్యాదు చేశారు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కనక ప్రభాకర్ తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 4.19 ఎకరాలకు ఈ పాస్ బుక్ మంజూరు చేయలేదని ఫిర్యాదు చేశారు. కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన 30 కుటుంబాలకు చెందిన వారు తమకు ఇంటి పట్టాలకు సర్వే చేయించి హద్దులు చూపించాలని కోరారు. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన కురిసిన వర్షాలకు కూలి పోయిన తన ఇంటి స్థానంలో ఐఏవై కింద గహాన్ని మంజూరు చేయాలని ప్యాపిలికి చెందిన ఏ నాగేంద్రమ్మ కోరారు.
Advertisement
Advertisement