సంగీతమంటే ప్రాణం

సంగీతమంటే ప్రాణం


సరదాగా మా ఆయనతో షార్ట్ ఫిలింలో నటించా..

వరంగల్‌కు రావడమంటే ఇష్టం

♦  సినీ నేపథ్య గాయని  గీతామాధురి


‘ఒకప్పుడు అందరు పాటలు పాడుతుంటే వినేదాన్ని.. ఇప్పుడు స్వయంగా సినిమాల్లో పాటలు పాడడం కొత్త అనుభూతిని ఇస్తోంది. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఉన్న ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాను. ఇక వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడకు వచ్చినప్పుడల్లా వేయిస్తంభాల దేవాలయాన్ని తప్పక దర్శిస్తాను..’ అంటూ చెప్పుకొచ్చారు సినీ నేపథ్య గాయని గీతామాధురి. వరంగల్ నిట్‌లో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీకి శనివారం వచ్చిన ఆమె మధ్యాహ్నం విరామ సమయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా గీతామాధురి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే...     - పోచమ్మమైదాన్


వరంగల్‌కు చాలా కార్యక్రమాలకు హాజరయ్యాను. వరంగల్‌లోని ప్రజలు నా పాటలు వినేందుకు ఎంతగానో ఇష్టపడుతారు. వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం. వరంగల్‌లో ఏదైన కార్యక్రమానికి ఆహ్వానిస్తే తప్పక వస్తున్నా.  ఇక్కడి అభిమానులు నేను సినిమాలలో పాడిన పాటలను మళ్లీమళ్లీ పాడాలని కోరుతుంటారు. వరంగల్‌కు వస్తే హన్మకొండలోని వేయిస్తంభాల గుడిని తప్పక ద ర్శిస్తారు. అలాగే, భద్రకాళి అమ్మ వారిని దర్శించుకుంటే చాలు ఒత్తిళ్లు అన్నీ తీసేసినట్లవుతుంది. ఇంకా ఖిలా వరంగల్, రామప్ప, లక్నవరం వంటి ఎన్నో అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.


 చిన్నవయస్సులోనే హైదరాబాద్‌కు..

చిన్నప్పటి నుంచి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే లిటిల్ మ్యుజీషియన్స్ కచ్చర్తకోట పద్మావతి, రామాచారి వద్ద శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందాను. ఆ తర్వాత టీవీ చానల్‌లో ప్రసారమైన పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలవడం.. ఆ తర్వాత నా ప్రతిభ అవకాశాలు వస్తుండడంతో ఈ రంగంలోనే స్థిరపడిపోయా. మా నాన్న ఎస్‌బీహెచ్‌లో పని చేయడం వలన చాలా చిన్న వయస్సులోనే హైదరాబాద్‌కు మారిపోయాము. నేను వనస్థలిపురంలోని లయోలా పాఠశాలలో చదివాను.


 ‘ప్రేమలేఖ రాశా’తో..

ఇప్పటి వరకు 350 పాటలకు పైగా పాడాను. కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాశా సినిమాలో పాటతో సినీ రంగ ప్రవేశం చేశాను. అయితే, మా ఆయన నందు, నేను సరదాగా ‘అదితి’ షార్ట్ ఫిలింలో నటించాను. భవిష్యత్‌లో గాయకురాలిగా స్థిరపడతానే తప్ప నటనపై ఆసక్తి లేదు. నాకు ఇళయరాజా, కిర వాణి, ఏఆర్.రహమాన్ సంగీతం ఇష్టం. నేను పాడిన పాటలు ఎఫ్‌ఎంలో లేదా ఎక్కడైనా వింటే మనస్సుకు సంతోషంగా ఉంటుంది. కాగా.. సినీ రంగంలో ప్రతిభ ఉన్న గాయకులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే, పట్టుదలతో ముందుకు సాగితే అవకాశలు అవే లభిస్తాయి.


అవార్డులు ..

2008 సంవత్సరంలో నచ్చావులే చిత్రంలోని నిన్నే నిన్నే.. పాటకు గాను ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నేపథ్య గాయని పురస్కారానికి నామినేట్ అయింది. అదే పాటకు నంది అవార్డు వచ్చింది. చిరుతలోని చమ్‌కా చమ్‌కా పాటకు మా టీవీ ఉత్తమ గాయని పురస్కారం లభించింది.  సంతోషం అవార్డు సైతం వచ్చింది. ఏక్ నిరంజన్‌లోని గుండెల్లో గిటార్ పాటకు గానూ సౌత్ స్కోప్ పురస్కారం అందుకున్నా. అలాగే, తమిళంలో బాహుబలి చిత్రంకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top