రైలు పట్టాలపైనే మందుపార్టీ
ఆటోలు తోలుతూ జీవనం సాగిస్తున్న ఓ ఇద్దరు యువకులు ఏకంగా రైలు పట్టాలపైనే మందుపార్టీ పెట్టుకుని మత్తులో రైలు కింద పడి చనిపోయారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నంద్యాలలో చోటుచేసుకుంది.
- మద్యం మత్తులో యువకుల దుస్సాహసం
- దూసుకెళ్లిన రైలు - ఇద్దరు దుర్మరణం
నంద్యాల: ఆటోలు తోలుతూ జీవనం సాగిస్తున్న ఓ ఇద్దరు యువకులు ఏకంగా రైలు పట్టాలపైనే మందుపార్టీ పెట్టుకుని మత్తులో రైలు కింద పడి చనిపోయారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నంద్యాలలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఎన్‌జీఓ కాలనీకి చెందిన దూదేకుల హుసేన్(22), ఎస్‌బీఐ కాలనీకి చెందిన షేక్‌రహీం(21) స్నేహితులు. వీరికి ఇంకా పెళ్లి కాలేదు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరితో పాటు స్నేహితులు అక్రమ్, భూపాల్ కలిసి పొన్నాపురం కాలనీ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో తప్పతాగారు. తర్వాత హుసేన్, షేక్‌రహీం తూలుతూ రైల్వే ట్రాక్‌పై వెళ్లి మద్యం సేవించడం ప్రారంభించారు. అక్రమ్, భూపాల్ వారిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో రైలు దూసుకెళ్లిపోవడంతో హుసేన్, రహీం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైల్వే అధికారులు ఆదివారం తెల్లవారుజామున మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టంకు తరలించారు.