దట్టమైన పొగమంచు పరిస్థితుల్లో వినియోగం
‘పేలుడు పదార్థం’ సిద్ధం చేసుకోవాలని ద.మ. రైల్వే జోన్ పరిధిలో ఆదేశం
ప్రమాదాలు నివారించేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా డిటోనేటర్ సిగ్నళ్లు
చాలినన్ని ఫాగ్ సేఫ్టీ డివైస్‌లు అందుబాటులో లేని వైనం
సాక్షి, హైదరాబాద్: దట్టమైన పొగమంచుతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో రైలు సిగ్నళ్ల కోసం డిటోనేటర్ల వినియోగానికి ఆ శాఖ సిద్ధమవుతోంది. దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని డివిజన్లలో చాలినన్ని డిటోనేటర్లను యుద్ధప్రాతిపదికన సమకూర్చాలనే ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రస్తుతం పొగ మంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో, రైలు ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏర్పాటు చేస్తున్నారు.
డిటోనేటర్ పేలుడు శబ్దమే సిగ్నల్!
పొగ మంచు తీవ్రతకు రైళ్ల లోకో పైలట్లకు సిగ్నళ్లు కనిపించని సందర్భాల్లో డిటోనేటర్ పేలుడునే సిగ్నల్‌గా వినియోగించటం చాలా కాలంగా కొనసాగుతోంది. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో కూడా వీటి వినియోగం ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. శీతాకాలంలో ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి నుంచి తెల్లవారే వరకు పొగమంచు కారణంగా లోకో పైలట్లకు సిగ్నళ్లు కనిపించవు. అలాంటి సందర్భాల్లో ముందు రెడ్ సిగ్నల్ ఉన్నా రైళ్లు ఆగకుండా దూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగానే డిటోనేటర్లను వినియోగిస్తున్నారు. తీవ్రమైన పొగమంచు సమయంలో రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు డిటోనేటర్ ఉన్న చిన్న స్ట్రిప్‌ను సిగ్నల్‌కు 270 మీటర్ల నుంచి 280 మీటర్ల ముందుగా పట్టాలకు సిబ్బంది అమర్చుతారు.
రైలు చక్రం దాని మీదుగా వెళ్లగానే ఆ ఒత్తిడికి డిటొనేటర్ పేలి పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దం... ముందు రెడ్ సిగ్నల్ ఉందనేది సందేశం. దీంతో లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలును ఆపేస్తారు. ముందు మరో రైలు ఆగిఉన్నప్పుడు, ఎక్కడైనా పట్టా విరిగినప్పుడు, పట్టాలమీద జంతువులు నిలిచి ఉన్నప్పుడు, రైళ్లను నిలపాల్సిన మరే ఇతర కారణాలు ఎదురైనప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తారు. వెనక వచ్చే రైలు ఆ సిగ్నల్‌కు ముందే నిలవాల్సి ఉంటుంది. పొగమంచు ఏర్పడినప్పుడు నిర్ధారిత దూరంలో, ప్రతి పది అడుగులకు ఒకటి చొప్పున మూడు డిటోనేటర్లు అమర్చుతారు. మూడు శబ్దాలు వస్తే రైలును ఆపాలని సూచన ఇచ్చినట్టుగా లోకోపైలట్ భావిస్తాడు. అదే ఒకే డిటోనేటర్ పేలి శబ్దం వస్తే, రైలును అతి నెమ్మదిగా నడపాలన్నది సూచనగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఫాగ్ సేఫ్టీ డివైస్ చాలినన్ని లేకనే...
ఈ డిటోనేటర్ విధానం చాలా పాతది. దీంతో దానికి ప్రత్యామ్నాయంగా ఫాగ్ సేఫ్టీ డివైస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి జీపీఎస్ ఆధారిత నావిగేషన్ డివైస్‌లు. ముందుండే సిగ్నల్ కనిపించని సమయంలో నిర్ధారిత మీటర్ల ముందే లోకో పైలట్లకు బీప్ శబ్దం వినిపించటంతో పాటు సిగ్నల్ కలర్‌లో ఇండికేషన్ బ్లింక్ అవుతుంది. వెంటనే లోకో పైలట్లు తదనుగుణంగా స్పందిస్తారు. కానీ, ఈ ఫాగ్ సేఫ్టీ డివైస్‌లు ఇంకా అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 25,900 పరికరాలు మాత్రమే ఉన్నాయి. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే ఉత్తర భారతంలో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. దక్షిణ భారత్‌లో వీటికి కొరత ఉంది. ఈ కారణంగానే డిటోనేటర్లను వాడక తప్పని పరిస్థితి నెలకొంది.
డిటోనేటర్లు సమకూర్చుకోండి: జీఎం
‘శీతాకాలంలో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉండే సమయమిది. కాబట్టి జోన్ పరిధిలోని అన్ని సెక్షన్లలో చాలినన్ని డిటోనేటర్‌లు అందుబాటులో ఉండాలి. వెంటనే సమకూర్చుకోండి. ఎలక్ట్రికల్, ట్రాక్షన్, కీమెన్... ఇలా అన్ని చోట్ల అవి ఉండాలి. సిగ్నళ్లు కనిపించని పరిస్థితి ఉంటే వాటిని ఏర్పాటు చేసి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడండి. సిగ్నళ్లకు అడ్డుగా ఉండే చెట్ల కొమ్మలు కూడా తొలగించండి. జీపీఎస్ ట్రాకర్లు, వాకీ టాకీలు, ఇతర ఫాగ్ సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచుకోండి..’ అంటూ దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు.


