ప్రముఖ కవి పార్శీ వెంకటేశ్వర్లు కన్నుమూత

ప్రముఖ కవి పార్శీ వెంకటేశ్వర్లు కన్నుమూత - Sakshi

 • ‘శబ్దం.. నిశ్శబ్దం’, ‘కవితా మయూరి’ తదితర కవితా సంకలనాలకు ప్రాచుర్యం

 • సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

 • హన్మకొండ కల్చరల్‌ : ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనా విధానమే ఆలంబనగా.. భావ కవిత్వమే బాసటగా.. సాహితీ వ్యాసంగమే లక్ష్యంగా ముందుకుసాగిన ప్రముఖ కవి, శివునిపల్లి ముద్దుబిడ్డ పార్శీ వెంకటేశ్వర్లు స్వగ్రామంలో మంగళవారం కన్నుమూశారు. ఆయనకు భార్య ఉమాదేవి, కుమారులు నవీన్, కమల్, కుమార్తెలు రమ,ప్రణతి ఉన్నారు. వెంకటేశ్వర్లు స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని శివునిపల్లి గ్రామంలో పార్శీ రామయ్య, గోదాదేవి దంపతులకు 1936 జూలై 10న జన్మించారు. బాల్యం నుంచీ వెంకటేశ్వర్లులో పరోపకార గుణం మెండుగా ఉండేది. ఎవరైనా సాయం కోసం వస్తే.. లేదనకుండా ఎంతో కొంత ఇచ్చి పంపేవారు. 

   

  అనంతర కాలంలో ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి భావాలతో ఆయన ఎంతో ప్రభావితుడయ్యారు. ఎంతగా అంటే జిడ్డు కృష్ణమూర్తి రాసిన పుస్తకాలను యువకులకు ఉచితంగా పంచేంతగా! ఆ ఆలోచనా ధోరణి గురించి అందరికీ వివరించేంతగా. కృష్ణమూర్తి వద్ద వెంకటేశ్వర్లు కొంతకాలం శిష్యరికం కూడా చేశారు. ఈక్రమంలోనే ప్రముఖ హిందీ చలనచిత్ర దర్శకుడు మహేష్‌భట్‌తో పరిచయం ఏర్పడి.. ఆత్మీయ మిత్రుడిగా మారారు. ఆ సమయంలోనే ప్రముఖ కవి వీ.ఆర్‌.విద్యార్థి, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, వేలూరి సదాశివరావు, బీ.సీ.రామమూర్తి, పీ.ఎల్‌.కాంతారావులతో పరిచయం ఏర్పడింది. ‘గొప్పవారితో స్నేహం.. గొప్ప ఆలోచనా దృక్పథాన్ని అలవరుస్తుంది’ అని పెద్దలు చెప్పిన విధంగా వెంకటేశ్వర్లు జీవన శైలి, జీవిత లక్ష్యాలకు ఆయనతో స్నేహం చేసిన గొప్పగొప్ప మేధావులే దిశానిర్దేశం చేశారు. ఈ ప్రభావంతో తన స్వగృహంలో మేధావులు, సామాజికవేత్తలతో ఆయన తాత్విక చర్చలు నిర్వహించేవారు.  

   

  సాహితీ సుధ వ్యవస్థాపకులుగా..

  1985 సంవత్సరంలో తన మిత్రులు నరేందర్, బుర్ర వెంకటయ్య, భిక్షపతిలతో కలిసి ‘సాహితీ సుధ’ అనే సాహిత్య సంస్థను వెంకటేశ్వర్లు స్థాపించారు. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన నిర్వహించే సాహితీ చర్చాగోష్టులకు కాళోజీ రామేశ్వర్‌రావు, కాళోజీ నారాయణరావు, అనుముల కృష్ణమూర్తి, పొట్లపల్లి రామారావు తదితర సుప్రసిద్ధ సాహితీవేత్తలు హాజరయ్యేవారు. పెండ్యాల వరవరరావు లాంటి వారికి మిత్రుడిగా అభిమానాన్ని చూరగొన్నారు. ‘కవితా మయూరి’, ‘శబ్దం–నిశ్శబ్దం’ పేరిట కవితా సంపుటాలను వెలువరించారు. ‘నెలవంక’ అనే సాహితీ మాసపత్రికను ప్రచురించేవారు. 

   

  అవార్డులు, బిరుదులు.. 

  పార్శీ వెంకటేశ్వర్లును పాలకుర్తి సోమనాథ కళాపీఠం వారు ‘తత్వదర్శి’ బిరుదుతో  గౌరవించారు. 

  మడికొండ పురజనులు వైశ్యరత్న బిరుదుతో సత్కరించారు. 

  వరంగల్‌ జిల్లా యంత్రాంగం ఉత్తమ సాహితీవేత్తగా సత్కరించింది. ఆయనకు 2012 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ కిషన్‌ చేతులమీదుగా తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందుకున్నారు. 

   

  సంతాపం తెలిపిన ప్రముఖులు

  స్టేషన్‌ ఘన్‌పూర్‌ టౌన్‌  : మండలంలోని శివునిపల్లికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, సాహితీ సుధ వ్యవస్థాపక అధ్యక్షుడు పార్శీ వెంకటేశ్వర్లు(80) మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. జిల్లా ఒక గొప్ప సాహితీవేత్తను కోల్పోయిందని వారు అభివర్ణించారు. ఆయన సాహిత్య రంగానికి చేసిన సేవలను కొనియాడారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ మంత్రి విజయరామారావు, వాసవి క్లబ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ తెల్లాకుల రామకృష్ణ, ఎర్రం శ్రీనివాస్, యంజాల ప్రభాకర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

   

  ఆయన మృతికి సంతాపం తెలిపిన వారిలో కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వి.ఆర్‌.విద్యార్థి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ఆచార్య బన్న అయిలయ్య దంపతులు, పొట్లపల్లి శ్రీనివాసరావు, టి. జితేందర్‌రావు, తదితరులు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజయ్య ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. కాగా, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు పార్శీ వెంకటేశ్వర్లు నేత్రాలను లయన్స్‌క్లబ్, వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో సేకరించి ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు తరలించారు.  
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top