
గ్రామం యూనిట్‌గా వరికి బీమా
ప్రస్తుత రబీలో సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
♦ మండలం యూనిట్‌గా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు
♦ మామిడికి వాతావరణ ఆధారిత బీమా
♦ ఉత్తర్వులు జారీచేసిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రబీలో సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అమలు చేస్తారు. వరి పంటను గ్రామం యూనిట్‌గా తీసుకుంటారు. జొన్న, మొక్కజొన్న, ఉల్లి, పొద్దుతిరుగుడు, వేరుశనగ, మిరప, మినుములు, శనగ పంటలను మండలం యూనిట్‌గా తీసుకుంటారు. డిసెంబర్ 31 నాటికి రైతులు ప్రీమియం చెల్లించడానికి గడువు తేదీగా నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సాధారణ జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మండలం యూనిట్‌గా అమలుచేస్తారు.
ఈ పథకంలో రుణం పొందిన రైతులు ప్రీమియం చెల్లించడానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు, రుణం పొందని రైతులకు వచ్చే నెల 31 నాటికి గడువుగా నిర్ణయించారు. వరి, జొన్నపై నాలుగు జిల్లాల్లో బీమా అమలవుతుంది. పెసర, మొక్కజొన్నకు ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే అమలుచేస్తారు. మినుములకు ఖమ్మం జిల్లాల్లో మాత్రమే బీమా వర్తింప చేస్తారు. శనగకు మహబూబ్‌నగర్, మిరపకు ఖమ్మం, ఉల్లికి రంగారెడ్డి జిల్లాల్లో బీమా సౌకర్యం కల్పిస్తారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వేరుశనగకు బీమా వర్తిస్తుంది. పొద్దుతిరుగుడుకు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బీమా వర్తింపచేస్తారు.
మామిడికి వాతావరణ ఆధారితంగా..
అలాగే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని నిజామాబాద్ తప్ప మిగిలిన జిల్లాల్లో మామిడి పంటకు అమలుచేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రకటించారు. ఈ పథకానికి వచ్చే నెల 15 వరకు ప్రీమియం చెల్లించడానికి గడువుగా ప్రకటించారు. అకాల వర్షాలు, అధిక వర్షాలకు మామిడికి నష్టం జరిగితే ఈ పథకం కింద బీమా అందుతుంది. అలాగే రోజువారీ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, గాలి వేగాలను బట్టి పంట నష్టం బీమా అందుతుంది. 5 నుంచి 15 ఏళ్ల చెట్టుకు రూ. 450, 16 నుంచి 50 ఏళ్లున్న చెట్టుకు రూ. 800 బీమా అందుతుంది.