బల్దియా సమావేశం.. గరం.. గరం | muncipal council meet hot hot | Sakshi
Sakshi News home page

బల్దియా సమావేశం.. గరం.. గరం

Jul 30 2016 5:39 PM | Updated on Oct 16 2018 6:33 PM

బల్దియా సమావేశం.. గరం.. గరం - Sakshi

బల్దియా సమావేశం.. గరం.. గరం

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు బహిష్కరించారు. తమ వార్డులపై చైర్‌పర్సన్‌, అధికారులు వివక్ష చూపుతూ.. అన్యాయం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.

వార్డుల్లో వివక్షపై కౌన్సిలర్ల ఆగ్రహం
సమావేశం నుంచి కాంగ్రెస్‌ సభ్యుల వాకౌట్‌
తాండూరు మున్సిపల్‌ కౌన్సిలర్ల మండిపాటు
చైర్‌పర్సన్‌, అధికారులపై కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్ల ధ్వజం
అనంతరం ఏజెండా అంశాలు చదవకుండానే ఆమోదం

తాండూరు: మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు బహిష్కరించారు. తమ వార్డులపై చైర్‌పర్సన్‌, అధికారులు వివక్ష చూపుతూ.. అన్యాయం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కోట్రిక విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు మండిపడ్డారు. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ కౌన్సిల్‌ ఫ్లోర్‌లీడర్‌ సునీత, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, ముక్తార్‌ అహ్మద్‌, బీజేపీ కౌన్సిల్‌ ఫ్లోర్‌లీడర్‌ బొప్పి అంజలి మాట్లాడారు. రూ.1.50 కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, తమ వార్డుల్లో మురుగుకాల్వల కోసం గుంతలు తీశారని కానీ ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదని మండిపడ్డారు. మూడు సమావేశాల్లో చెబుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసిన గుంతలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కూలిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తమ వార్డుల్లో ఎందుకు పనులు చేయడం లేదని చైర్‌పర్సన్‌ను నిలదీశారు.

          ఈ విషయమై ఇంజినీర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇసుక కొరతవల్ల కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేదని సమాధానమిచ్చారు. దీంతో ఇసుక సమస్య ఉన్నప్పుడు గుంతలు ఎందుకు తీశారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌, అధికారులతో వాదనకు దిగారు. వైస్‌చైర్మన్‌ సాజిద్‌ అలీ, టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌లీడర్‌ రజాక్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్ల వాదనలను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సమావేశం కొద్దిసేపు రసాభాసగా మారింది. ఉద్దేశపూర్వకంగానే తమ వార్డుల్లో పనులు చేయడం లేదని, చైర్‌పర్సన్‌, అధికార పార్టీ కౌన్సిలర్లు ఇష్టానురంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తమ మాటలకు గౌరవం లేదని కౌన్సిలర్లు సునీత, పట్లోళ్ల సావిత్రి, సరితాగౌడ్‌, లింగదళ్లి రవి, ముక్తార్‌ అహ్మద్‌, శ్రీనివాస్‌, బొప్పి అంజలి వాకౌట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, టీడీపీ కౌన్సిలర్లతో చైర్‌పర్సన్‌ సమావేశాన్ని కొనసాగించారు. డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న 384 చదరపు గజాల స్థలం కబ్జా అవుతుందనే ఆరోపణలు వస్తున్నాయని ఎంఐఎం కౌన్సిల్‌ ఫ్లోర్‌లీడర్‌ అసిఫ్‌ అన్నారు. ఈ విషయంలో ఆ స్థలం ఎవరిదో స్పష్టం చేయాలని, ఇతర శాఖలకు ఆ స్థలాన్ని బదలాయించే అవకాశం ఉందా? అని చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. కమిషనర్‌ సంతోష్‌కుమార్‌ సమాధానవిస్తూ.. ఆ స్థలం మున్సిపాలిటీకి చెందిందని సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించి మున్సిపాలిటీ రికార్డులో ఉందన్నారు. పట్టణంలో పార్కుల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, మినీ స్టేడియం బాధ్యతలు తీసుకోవడం అవసరం లేదని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అబ్దుల్‌ ఖవి అన్నారు. మినీ స్టేడియాన్ని అభివృద్ధి పరిస్తే క్రీడల నిర్వహణకు వెసులుబాటు ఉంటుందని కౌన్సిలర్‌ పరిమళ పేర్కొన్నారు.

           మున్సిపల్‌ స్థలాలు, పార్కులు కబ్జాలకు గురికాకుండా బోర్డులు ఏర్పాటు చేయాలని, తాండూరులో రోడ్లు అధ్వానంగా మారాయని, ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ సుమిత్‌కుమాగౌడ్‌ కోరారు. అంబేడ్కర్‌ పార్కు అభివృద్ధి పర్చాలని కౌన్సిలర్‌ శోభారాణి కోరారు. బస్వన్నకట్ట వద్ద నుంచి పశువుల వధశాలను తరలించాలని కౌన్సిలర్‌ ఉష కోరారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని చైర్‌పర్సన్‌ హామీ ఇచ్చారు. అనంతరం ఏజెండాలోని ఒకటి నుంచి 23 వరకు అభివృద్ధి పనుల అంశాలపై చర్చించకుండానే కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. మినీస్టేడియం నిర్వహణ బాధ్యతలను మున్సిపాలిటీ తీసుకోవడం తదితర 8 అంశాలపై స్వల్ప చర్చ అనంతరం రూ.1.85 కోట్ల పనులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement