
మున్సిపల్ అధికారుల తీరుపై హైకోర్టు మండిపాటు
భవన నిర్మాణమంతా పూర్తయ్యే వరకు ఏం చేస్తారు?
తర్వాత అక్రమ నిర్మాణం,కూల్చివేత అంటూ హడావుడి చేస్తారు
పన్ను వసూలుకు మాత్రం భవన వివరాలన్నీ తెలుస్తయ్!
రాష్ట్రంలో అనధికారిక నిర్మాణాలకు అధికారులదే బాధ్యత
తీరు మారకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: దేవుడు దిగివచ్చినా మున్సిపల్ అధికారుల తీరును అర్థం చేసుకోవడం సాధ్యం కాదని హైకోర్టు మండిపడింది. కళ్ల ముందే అంతస్తులకు అంతస్తులు భవన నిర్మాణం జరుగుతున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారని.. తీరా నిర్మాణం పూర్తయ్యాక విధులు గుర్తుకొచ్చి కూల్చివేత అంటూ హడావుడి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రంలో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులే బాధ్యులని చెప్పింది. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించగా.. ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు.
‘నెలల తరబడి భవన నిర్మాణమంతా పూర్తయ్యే వరకు మున్సిపల్ అధికారులు ఏం చేస్తుంటారు? ఆ ప్రాంతంలోని ఏరియా ఇన్‌స్పెక్టర్లు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా? సెక్షన్ 461 ప్రకారం నిర్మాణం ప్రారంభంలోనే సీజ్ చేసే అధికారమున్నా ఎందుకు చేయరు? ఎవరో పిటిషన్ వేస్తే.. కోర్టు ఆదేశాలు జారీ చేస్తే.. తర్వాత స్పీకింగ్ ఆర్డర్స్ ఇస్తారు. స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చేలోపు భవన నిర్మాణం పూర్తవుతుంది.
అప్పుడు కూల్చివేత అంటూ హడావుడి ప్రారంభిస్తారు.. రాష్ట్రంలో ఏటా వెలుస్తున్న అనధికార నిర్మాణాలను ఎందుకు ఆపలేకపోతున్నారు? విచిత్రమేంటంటే.. అక్రమ నిర్మాణం చేసేటప్పుడు వారికి కనిపించదు.. కానీ, పన్ను వసూలుకు మాత్రం ఆ భవనం కనిపిస్తుంది.. దాని వివరాలన్నీ తెలుస్తాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంటారు.
మునిసిపల్‌అధికారులను దేవుడు కూడా బాగుచేయలేడు. ప్రజలకు మునిసిపల్ అధికారులు, న్యాయవాదులు, కోర్టుల గురించి తెలుసు. అధికారుల తీరు మారకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు’అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
క్రమబద్ధీకరణపై నిర్ణయం వరకు యథాతథస్థితి
జీహెచ్‌ఎంసీ చట్టం–1955లోని సెక్షన్ 462 కింద చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నోటీసు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌కు చెందిన కె.రఘువీర ఆచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భవనం కూల్చివేస్తామంటూ అధికారులు నోటీసులు జారీ చేయడం చట్టవిరుద్ధమన్నారు. భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన నోటీసులను నిలుపుదల చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. చాలాప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులకు అధికారులు సహకరిస్తున్నారని, అందుకే నిర్మాణాలు పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.
పిటిషనర్ సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకునే వరకు యథాతథస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను జూలై 15కు వాయిదా వేశారు.