దాహం తీర్చేదెలా?

mpdos special meetings for water problem issues - Sakshi

పలు ప్రాంతాల్లో నీటి సమస్య

వేసవి కార్యాచరణ సిద్ధం చేస్తున్న యంత్రాంగం

నీటి ఎద్దడి ప్రాంతాలను గుర్తిస్తున్న అధికారులు

మండలాల్లో ఎంపీడీవోల ప్రత్యేక సమావేశాలు

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: వేసవి ప్రారంభానికి ముందే జిల్లాలో నీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా సిరికొండ, ధర్పల్లి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు ముదరక ముందే ఈ పరిస్థితులు నెలకొంటే, మండు వేసవిలో నీటి సమస్య మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణకు గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్‌) వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. జిల్లాలో ఏయే గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది.. ఎద్దడి తీవ్రంగా ఉన్న నివాసిత ప్రాంతాలు.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడే ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఎండలు ముదిరితే పని చేయకుండా పోయే తాగునీటి పథకాల గుర్తింపు, బోర్లు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఎన్ని గ్రా మాల్లో ఉంటుంది.. తదితర వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రణాళికను రూపొందించాక నిధులు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ కార్యచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉండగా, ఆలస్యమైంది. ఇప్పటి కే తాగునీటి సమ స్య ప్రారంభమైన ఈ తరుణంలో ప్రణాళికలు రూపకల్పన దశలో ఉండటం.. వాటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పం పడం.. ఈ ప్రతిపాదనలను పరిశీలన.. నిధుల మంజూరు.. పనుల ప్రారంభం వంటి ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చనుంది.

మండల సమావేశాలు..
వేసవి కార్యాచరణ ప్రణాళికను రూ పొందించేందుకు అన్ని మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ డి.రమేశ్‌ ఈ నెల 10న అన్ని మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లతో చర్చించి నీటి ఎద్దడి నెలకొనే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీడీవోలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన నిధుల కోసం కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు.

వీలైతే గ్రిడ్‌ నుంచే..
గ్రామీణ నీటిపారుదల శాఖ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 860 నివాసిత ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గ్రిడ్‌ పరిధిలోకి రాగా, మరో 785 నివాసిత ప్రాంతాలు సింగూరు గ్రిడ్‌ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఈ వేసవిలోనే తాగునీటిని సరఫరా చేయడానికి వీలున్న నివాసిత ప్రాంతాలను గుర్తిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ రమేశ్‌ ‘సాక్షి’తో పేర్కొన్నా రు. ఆయా ప్రాంతాలకు గ్రిడ్‌ ద్వారానే నీటిని సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. గ్రిడ్‌ పనులు కొన్ని గ్రామాల్లో చివరి దశకు చేరుకుంటున్నాయని తెలిపారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top