పరీక్ష మధ్యలో బిడ్డ ఆకలి తీర్చిన తల్లి | Mother feeding 6 months old baby in the middle of exam | Sakshi
Sakshi News home page

పరీక్ష మధ్యలో బిడ్డ ఆకలి తీర్చిన తల్లి

Apr 24 2016 8:12 PM | Updated on Mar 19 2019 5:52 PM

పరీక్ష మధ్యలో బిడ్డ ఆకలి తీర్చిన తల్లి - Sakshi

పరీక్ష మధ్యలో బిడ్డ ఆకలి తీర్చిన తల్లి

కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ బాలింత.. గుక్కపట్టి ఏడుస్తున్న పసికందుకు పాలివ్వడానికి పరీక్ష మధ్యలో వెళ్లాల్సి వచ్చింది.

మెదక్ : కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ బాలింత.. గుక్కపట్టి ఏడుస్తున్న పసికందుకు పాలివ్వడానికి పరీక్ష మధ్యలో వెళ్లాల్సి వచ్చింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండాకు చెందిన మహిళ ఆదివారం తన 6 నెలల పాపను తీసుకుని పోలీస్‌ కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు మెదక్ పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష కేంద్రంలోకి వెళుతూ తమ్ముడికి తన కూతురిని ఇచ్చి వెళ్లింది.

తల్లి పరీక్ష హాలులోకి వెళ్లగానే చిన్నారి గుక్కపెట్టి ఏడ్వటం మొదలు పెట్టింది. ఆ పాపను ఎత్తుకున్న బాలుడు.. పాప ఏడుపు ఆపకపోవడంతో పరీక్ష హాలు నుంచి తల్లిని రప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. దీంతో పోలీసులు చిన్నారిని ఎత్తుకుని ఊరడించే ప్రయత్నం చేశారు. ఎంతకూ ఊరుకోక పోవటంతో పట్టణ సీఐ సాయిశ్వర్‌ గౌడ్ పరీక్ష హాలులో గల ఇన్విజిలేటర్ అనుమతులు తీసుకుని పాప తల్లిని బయటకు రప్పించారు. చిన్నారి ఆకలి తీర్చిన అనంతరం ఆ తల్లి తిరిగి పరీక్షకు హాజరైంది.

పది నిముషాల లేటు.. భవితపై వేటు
ఓ అభ్యర్థి పరీక్ష కేంద్రానికి పది నిముషాలు ఆలస్యంగా రావటంతో అతనిని వెనక్కి తిప్పి పంపారు. మెదక్ జిల్లా చందానగర్‌లో ఉంటున్న (స్వస్థలం నల్లగొండ జిల్లా) రాజు మెదక్ పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉండగా.. పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. దీంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. కన్నీటి పర్యంతమై వేడుకున్నా ఫలితం లేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement