అనంతలో వడ్డీ వ్యాపారుల దాష్టీకం


ధర్మవరం: తీసుకున్న అప్పు చెల్లించినా, కేవలం రూ.వెయ్యి వడ్డీ కట్టలేదనే కారణంతో వడ్డీ వ్యాపారులు ఓ యువతిని బలవంతం చేయబోయారు. ఆమె ఎదురు తిరగడంతో తలపై రాళ్లతో కొట్టి గాయపర్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో గురువారం చోటుచేసుకుంది.



వివరాల్లోకి వెళితే... పట్టణంలోని యాదవవీధికి చెందిన చాకలి పెద్దన్న, సరోజమ్మ కుమార్తె లావణ్య. వీరు అదే కాలనీకి చెందిన వడ్డీవ్యాపారి ఖాజాపీరా వద్ద మూడేళ్ల క్రితం రూ.2లక్షల వరకు అప్పు తీసుకున్నారు. బుధవారం రాత్రి అసలు, వడ్డీ కలిపి చెల్లించారు. అయితే.. పది రోజులు ఆలస్యంగా చెల్లించినందుకు గాను అదనంగా రూ. వెయ్యి వడ్డీ ఇవ్వాలని అతను ఒత్తిడి చేశాడు. అంత డబ్బు కట్టాము కదా.. వదిలేయాలని కోరారు. కాగా.. గురువారం ఉదయం 11.30 గంటలకు లావణ్య ధర్మవరం చెరువు నుంచి పశువులకు గడ్డి కోసుకుని వస్తుండగా ఖాజాపీరాతో పాటు ఫకద్ధీన్, మబ్బాషా అనే వ్యక్తులు ఆమెను అటకాయించారు. వడ్డీ ఇస్తావా.. కోర్కె తీర్చుతావా అంటూ చెరువులోకి లాక్కుపోయారు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వస్తుండగా.. వెనక నుంచి రాళ్లతో దాడి చేశారు. ఆమె తల వెనుక భాగంలో రాయి తగిలి తీవ్ర గాయమైంది. బాధితురాలు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top