పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల్లో ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను నూరుశాతం భౌతికంగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
ఒంగోలు టౌన్ : పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల్లో ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను నూరుశాతం భౌతికంగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శాసనమండలి ఎన్నికలు, ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదు కోసం వచ్చిన దరఖాస్తులకు సంబంధించి చిరునామాలు, విద్యార్హతలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితా అందజేసి వారి నుంచి రసీదు తీసుకోవాలని చెప్పారు.
ఆ జాబితాలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించాలన్నారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితిగతులను అంగీకరించారా లేదా తిరస్కరించారా లేదా పెండింగ్‌లో ఉంచారా అనే విషయం తెలుసుకునేందుకు ఈఆర్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తద్వారా వారు గమనించుకొని ఈ నెల 19వ తేదీలోపు అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు, ప్రైవేట్ ప్రొఫెసర్లు తమ సర్వీసు సర్టిఫికెట్లకు సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ సంతకం ఉంటేనే అంగీకరించాలని, లేకుంటే వాటిని తిరస్కరించాలని సూచించారు. అప్పీళ్ల స్వీకరణకు ఈ నెల 19వ తేదీ చివరి గడువని, ఇకపై పొడిగించేది లేదని స్పష్టం చేశారు. 2017 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు పొందే గడువు ఈ నెల 14వ తేదీతో ముగిసిందని స్పష్టం చేశారు. సాధారణ ఓటర్ల నమోదుకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈఆర్‌ఎంఎస్‌లో డేటా ఉంచాం : ఇన్‌చార్జి కలెక్టర్
శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల దరఖాస్తులన్నింటినీ ఈఆర్‌ఎంఎస్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వివరించారు. ఓటర్ల నమోదుకు సంబంధించి ఇప్పటివరకు రాజకీయ పార్టీల నుంచి ఒక్క ఆరోపణ రాలేదన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు సర్టిఫికెట్లకు సంబంధించి ఉన్నత పాఠశాలల వరకు జిల్లా విద్యాశాఖాధికారి, ఇంటర్మీడియెట్ వరకు ఆర్‌ఐఓ కౌంటర్ సంతకాలు చేస్తున్నారని చెప్పారు. డిగ్రీకి సంబంధించి నాగార్జున విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్‌కు అయితే జేఎన్‌టీయూ, మెడికల్ కళాశాల అయితే ఒంగోలు రిమ్స్ డైరెక్టర్ ధృవీకరిస్తున్నారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి డీఆర్‌ఓ భక్తవత్సలరెడ్డి, డీఈఓ సుప్రకాష్, ఎస్‌ఎస్‌ఏ పీఓ సుధాకర్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఎస్‌డీసీలు ఉదయభాస్కర్, నరసింహులు, కలెక్టరేట్ ఈ–సెక్షన్ సూపరింటెండెంట్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.