breaking news
mlc voters
-
ప్రలోభ పర్వం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు తాయిలాలు - బహుమతులు, నగదుతో పాటు విందు ఇస్తున్న అభ్యర్థులు - బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి - గతేడాది లాగే హాట్‌బాక్స్‌ల పంపిణీకి సిద్ధమైన బచ్చల పుల్లయ్య - ‘పెద్దనోట్ల’ అండతో పెద్దల సభకు ఎన్నికయ్యేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు - నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారంలో తలమునకలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) శాసనమండలి అంటే పెద్దల సభ. మండలి అభ్యర్థులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. కానీ పెద్దల సభకు వెళ్లేందుకు పెద్దనోట్ల అండ చూసుకుంటున్నారు కొందరు అభ్యర్థులు. సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రమూ తీసిపోకుండా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే నగదు ఏర్పాటు చేసుకున్న వీరంతా ప్రస్తుతం పంపకాలపై దృష్టి సారించారు. కొందరు డబ్బుతో పాటు బ్యాగ్‌లు, హాట్‌బాక్స్‌లు లాంటి బహుమతులు ఇచ్చేందుకూ సిద్ధమయ్యారు. అలాగే ఆయా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఖరీదైన ‘కాక్టైల్ డిన్నర్’లు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల బరిలో ఉన్న కొందరు అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. బ్యాగ్‌లు పంపిణీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కర్నూలు జిల్లా వాసి జనార్దన్‌రెడ్డి ఓటర్లకు ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బ్యాగ్‌లపై తన ఫొటోలను ముద్రించి ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి’ అని వేయించారు. దాదాపు 2.50 లక్షల బ్యాగ్‌లను పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఒక్కో బ్యాగు విలువ రూ.వెయ్యికి పైగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఓటర్ల జాబితా ఆధారంగా ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది లెక్కించి, వారికి నగదు పంపిణీ బాధ్యతను ఆ ప్రాంత పార్టీ ఇన్‌చార్జ్‌లపై పెట్టినట్లు సమాచారం. ఓటర్లకు ఇవ్వాల్సిన నగదు, పంపిణీ చేసే వారి ఖర్చులు, ఇతరత్రా ఖర్చు మొత్తం లెక్కించి వారికి ఇప్పటికే అందజేసినట్లు తెలుస్తోంది. జనార్దనరెడ్డి ఇప్పటి వరకూ జనాలకు పరిచయం లేని వ్యక్తి. టీడీపీ తరఫున బరిలోకి దిగినప్పటికీ పార్టీ నేతల సహకారం పెద్దగా లేదు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న విభేదాలతో సతమతమవుతున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్దగా దృష్టి సారించలేదు.ఈ నేపథ్యంలో గిఫ్ట్‌లు, నగదు, డిన్నర్లతో పట్టభద్రులను ప్రలోభపెట్టే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. బచ్చల పుల్లయ్య కూడా అదే దారిలో.. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వాసి బచ్చల పుల్లయ్య బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఈయన మద్దతుదారులు ఉపాధ్యాయులకు హాట్బాక్స్లను పంపిణీ చేశారు. కొన్నిచోట్ల హాట్బాక్స్లతో వెళుతున్న ఆటోలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈసారి కూడా వాటిని పంపిణీ చేసేందుకు బచ్చల పుల్లయ్య సిద్ధమైనట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడం, ఐదేళ్లలో ఆర్థికంగా బలపడడంతో ఖర్చుకు వెనకాడడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బరిలో 39 మంది అభ్యర్థులు! పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. పట్టభద్రుల కోటాలో 37, ఉపాధ్యాయ కోటాలో 14 కలిపి మొత్తం 51 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పట్టభద్రుల కోటాలో 10, ఉపాధ్యాయ కోటాలో 2 తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతానికి 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 23 వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఖరారు కానుంది. ప్రస్తుతానికి పట్టభద్రుల కోటా నుంచి 27 మంది బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోరుమాత్రం ముగ్గురి మధ్యే సాగనుంది! వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎన్జీవో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థి గేయానంద్, టీడీపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి మధ్య త్రిముఖపోటీ నెలకొంది. అధికారం, డబ్బు తనను గెలిపిస్తాయని జనార్దనరెడ్డి భావిస్తుంటే, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లు, వీటికి మించి వైఎస్సార్కాంగ్రెస్పార్టీ మద్దతుతో తాను తప్పక గెలుస్తాననే ధీమాతో గోపాల్‌రెడ్డి ఉన్నారు. ఉద్యోగులు కూడా గోపాల్‌రెడ్డిని తమ నాయకుడిగానే ఇప్పటికీ భావిస్తుండటం, ఎమ్మెల్సీగా ఎన్నికైతే తమ సమస్యలపై పోరాడుతారనే నమ్మకం ఆయనకు కలిసొచ్చే అంశాలు. సిట్టింగ్ ఎమ్మెల్సీ గేయానంద్ సీపీఎం మద్దతుతో తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి విజయం సాధించానని, ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందనే ఆశతో ఉన్నారు. ఉపా«ధ్యాయ బరిలో ఎవరికి వారే.. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 12 మంది బరిలో ఉన్నా ఐదాగురు అభ్యర్థుల మధ్య పోటీ ‘నువ్వానేనా’ అన్నట్లు సాగుతోంది. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, కత్తి నరసింహారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, రఘురామయ్య, బచ్చల పుల్లయ్య మధ్య పోటీ నెలకొంది. వీరు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగినా, ఆ సంఘం నేతలు చెప్పినట్లు యూనియన్‌లోని ఉపాధ్యాయులందరూ ఏకతాటిపై నిలుస్తారా? చివరి నిమిషంలో ఎవరి మనోభీష్టం మేరకు వారు ఓటేస్తారా అనే సందేహాలు అన్ని యూనియన్లను కలవరపరుస్తున్నాయి. గతంలో యూనియన్ల నిర్ణయానికి కట్టుబడి 20శాతం మంది మాత్రమే ఓటేశారని, తక్కిన వారంతా ఎవరికి నచ్చినట్లుగా వారు వేశారని పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఎవరు బలమైన అభ్యర్థి? విజయావకాశాలు ఎవరికి మెండుగా ఉన్నాయనేది అంతుబట్టడం లేదు. -
ఓటరు నమోదుకు మరో అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 13 వరకు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటిదాకా నమోదు చేసుకోని పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు దరఖాస్తులు పరిశీలించాలి
ఒంగోలు టౌన్ : పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల్లో ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను నూరుశాతం భౌతికంగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శాసనమండలి ఎన్నికలు, ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదు కోసం వచ్చిన దరఖాస్తులకు సంబంధించి చిరునామాలు, విద్యార్హతలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితా అందజేసి వారి నుంచి రసీదు తీసుకోవాలని చెప్పారు. ఆ జాబితాలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించాలన్నారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితిగతులను అంగీకరించారా లేదా తిరస్కరించారా లేదా పెండింగ్‌లో ఉంచారా అనే విషయం తెలుసుకునేందుకు ఈఆర్‌ఎంఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తద్వారా వారు గమనించుకొని ఈ నెల 19వ తేదీలోపు అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు, ప్రైవేట్ ప్రొఫెసర్లు తమ సర్వీసు సర్టిఫికెట్లకు సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ సంతకం ఉంటేనే అంగీకరించాలని, లేకుంటే వాటిని తిరస్కరించాలని సూచించారు. అప్పీళ్ల స్వీకరణకు ఈ నెల 19వ తేదీ చివరి గడువని, ఇకపై పొడిగించేది లేదని స్పష్టం చేశారు. 2017 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు పొందే గడువు ఈ నెల 14వ తేదీతో ముగిసిందని స్పష్టం చేశారు. సాధారణ ఓటర్ల నమోదుకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈఆర్ఎంఎస్లో డేటా ఉంచాం : ఇన్చార్జి కలెక్టర్ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల దరఖాస్తులన్నింటినీ ఈఆర్‌ఎంఎస్ వెబ్సైట్లో ఉంచినట్లు ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వివరించారు. ఓటర్ల నమోదుకు సంబంధించి ఇప్పటివరకు రాజకీయ పార్టీల నుంచి ఒక్క ఆరోపణ రాలేదన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు సర్టిఫికెట్లకు సంబంధించి ఉన్నత పాఠశాలల వరకు జిల్లా విద్యాశాఖాధికారి, ఇంటర్మీడియెట్ వరకు ఆర్ఐఓ కౌంటర్ సంతకాలు చేస్తున్నారని చెప్పారు. డిగ్రీకి సంబంధించి నాగార్జున విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్‌కు అయితే జేఎన్టీయూ, మెడికల్ కళాశాల అయితే ఒంగోలు రిమ్స్ డైరెక్టర్ ధృవీకరిస్తున్నారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్చార్జి డీఆర్ఓ భక్తవత్సలరెడ్డి, డీఈఓ సుప్రకాష్, ఎస్ఎస్ఏ పీఓ సుధాకర్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఎస్డీసీలు ఉదయభాస్కర్, నరసింహులు, కలెక్టరేట్ ఈ–సెక్షన్ సూపరింటెండెంట్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు గడువు పెంపు
చిత్తూరు (కలెక్టరేట్): చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల నమోదును డిసెంబరు 8వ తేది వరకు ఎన్నికల సంఘం గడువును పొడిగించినట్లు నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి, డీఆర్వో విజయ్‌చందర్ తెలిపారు. బుధవారం స్థానిక డీఆర్వో కార్యాలయంలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో పట్టభద్రులు 73,332 మంది దరఖాస్తులు అందాయని, వాటిని పరిశీలించిన అనంతరం సక్రమంగా లేని 10,084 దరఖాస్తులు తిరస్కరించగా, నికరంగా 63,248 నమోదయ్యాయన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి 8,788 మంది దరఖాస్తు చేసుకోగా అందులో సక్రమంగాలేని 1,459 దరఖాస్తులు తిరస్కరించగా, 7,329 దరఖాస్తులు ఓటర్లుగా నమోదు చేశారన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పట్టభద్రుల ఓటర్లుగా 72,375 మందిని, ఉపాధ్యాయ ఓటర్లుగా 5,252 మందిని, నెల్లూరు జిల్లాలో పట్టభద్రుల ఓటర్లుగా 63,477 మందిని, ఉపాధ్యాయ ఓటర్లుగా 4,407 మందిని నమోదు చేసినట్లు ఆయన వివరించారు. గురువారం నుంచి డిసెంబరు 8వరకు ఈ జాబితాపై ఆక్షేపణలు, ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. జాబితాలో మృతులు, బోగస్, వలసపోరుునవారు సమాచారం ఇస్తే వాటిని తొలగిస్తామన్నారు. అర్హతవుండి ఓటర్లుగా నమోదు చేసుకోని వారుకూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుత జాబితాలో లేని వారు తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. దరఖాస్తు చేసుకున్న జాబితాలను పరిశీలించి డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు.