చెట్లతోనే వర్షాలు | minister pocharam srinivas participated in haritha haram | Sakshi
Sakshi News home page

చెట్లతోనే వర్షాలు

Jul 12 2016 4:10 AM | Updated on Sep 4 2017 4:37 AM

చెట్లతోనే వర్షాలు

చెట్లతోనే వర్షాలు

కరువును, దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు పచ్చదనాన్ని పెంచడమే ఏకైక మార్గమని వ్యవసాయ, ఉద్యానవన, సహకారశాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ గమనించాల్సిన వాస్తవం
మొక్కలు నాటడం అందరి బాధ్యత
మూడేళ్లలో జిల్లాలో 10 కోట్ల మొక్కలు లక్ష్యం
కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
వీడియో కాన్ఫరెన్స్, సమీక్షలలో మంత్రి పోచా
రం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కరువును, దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు పచ్చదనాన్ని పెంచడమే ఏకైక మార్గమని వ్యవసాయ, ఉద్యానవన, సహకారశాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కసారి మనం ఇటీవల కురుస్తున్న వర్షాలు, వర్షపాతం గమనిస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అడవులున్న ప్రాంతాల్లో ఎక్కువ, చెట్లు లేని చోట తక్కువ వర్షం కురుస్తోందని, వర్షాభావానికి కేవలం అంతరించిన పచ్చదనమే కారణమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాని అన్నారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక హరితహారం విజయవంతం చేయడం అందరి బాధ్యతని అన్నారు.

సోమవారం కలెక్టరేట్ నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరితహారం అమలులో కొందరు అధికారుల పనితీరుపై మంత్రి  అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారం అమలు కోసం రెండు గ్రామ పంచాయతీలకు ఒక క్లస్టర్‌గా అధికారిని, ప్రతి గ్రామ పంచాయతీకి  ఒక నోడల్ అధికారిని, మున్సిపాలిటీలకు కమిషనర్‌లను నియమించినట్లు తెలిపారు.

 గ్రామ పంచాయతీలో 40 వేలు...
ప్రతి గ్రామ పంచాయతీలో 40 వేల మొక్కలను నాటించాల్సిన బాధ్యత నోడల్ అధికారులు, క్లస్టర్ అధికారులదేనని మంత్రి పోచారం అన్నారు. గుంతలు తవ్విన తర్వాతనే నర్సరీల నుంచి మొక్కలు విడుదల చేయాలని సూచించారు. నాటిన ప్రతి  మొక్కకు ఖచ్చితమైన లెక్కలతో, మొక్కలను బతికించాలని ఆదేశించారు. ఈ పనులకు ప్రభుత్వ పరంగా చెల్లించే సొమ్ము గురించి రైతులు, గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. నోడల్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అందరికీ అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో చెట్లు తక్కువగా ఉన్న లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, కమ్మర్‌పల్లి మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని ఉదహరించారు. మూడేళ్లలో జిల్లాలో 10 కోట్ల మొక్కలను నాటించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1.7 లక్షల హెక్టార్ల అడవులను కారడవులుగా మార్చేందుకు ఒక కోటి మొక్కలను, పొలాల గట్లు, నివాస ప్రాంతాల్లో 9 కోట్ల మొక్కలు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు.

సుడిగాలి పర్యటన..
‘తెలంగాణ హరితహారం పథకం భావి తరాల బాగు కోసం... మన ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు... మన దగ్గర మబ్బులు పైనుంచి పోతున్నా... వర్షాలు పడటలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి.. చెట్లున్న ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి... ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా భావించండి... భావితరాల భవిష్యత్‌ను దష్టిలో పెట్టుకుని మొక్కలు నాటుదాం’’ అంటూ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హరితహారం ప్రారంభం నుంచి బిజీ బిజీగా ఉన్నారు. ఈ నెల 11న బాన్సువాడలో మొక్కలు నాటి అధికారికంగా హరితహారం ప్రారంభించిన ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షలు జరుపుతూ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్.. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శాఖల వారిగా సమీక్షలు చేస్తున్నారు. అంతటా పర్యటించిన మొక్కలు నాటుతున్నారు. బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఆయన సోమవారం కూడ కలెక్టరేట్ నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ చైర్మన్ దపేదార్ రాజు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి, ముఖ్య అడవీ సంరక్షణ అధికారి ఎస్‌కే గుప్త, డీఎఫ్‌వోలు, డ్వామా పీడీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement