Sakshi News home page

ఐదు రోజులుగా కదలని మాచర్ల ప్యాసింజర్‌

Published Sat, Sep 17 2016 10:08 PM

ఐదు రోజులుగా కదలని  మాచర్ల ప్యాసింజర్‌ - Sakshi

మాచర్ల: భారీ వర్షాల వలన ఐదురోజులుగా మాచర్ల– గుంటూరు– భీమవరం ప్యాసింజర్‌ రైలు రాకపోకలు నిలిచిపోవడంతో సామాన్య ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో మాచర్ల– గురజాల రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైల్వే ట్రాక్‌ మరమ్మతు పనులు నిర్వహిస్తూనే ఉన్నారు. శనివారం సాయంత్రానికి కూడా రైలు రాకపోకలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నిత్యం రైలులో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మాచర్ల– గుంటూరుకు కేవలం రూ.30తో వెళ్లే ప్రయాణికులు ప్రస్తుతం బస్సులను ఆశ్రయించాల్సిరావడంతో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. నడికుడి నుంచి గుంటూరుకు రైలు తిరుగుతున్నా సంబంధిత వేళలు తెలియకపోవడం, మాచర్ల నుంచి నడికుడికి రూ.35కుపైగా బస్సు చార్జీ చెల్లించాల్సిన పరిస్థితి. బస్సులలో గుంటూరుకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్‌కు రూ. 120, 5 స్టార్‌కు రూ.150 చెల్లించాల్సిన పరిస్థితి. ఇందువల్ల ఆయా ప్రాంతాలకు నిత్యం రైలులో వెళ్లే ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు. రెండు రోజుల్లో ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పిన రైల్వే అధికారులు ఐదు రోజులైనా పూర్తి చేయకపోవడంపై ప్రయాణికుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి మాచర్ల– గుంటూరు రైలు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement