
మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి రూ. లక్షా 35 వేలు చోరీ
బస్సు ఎక్కుతుండగా మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి రూ. లక్షా 35 వేల నగదును దొంగలు చోరీ చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
- -లబోదిబోమన్న బాధితులు
- -పోలీసులకు ఫిర్యాదు
- -దొంగల కోసం పోలీసుల ముమ్మర గాలింపు
- -నర్సాపూర్ బస్టాండ్‌లో సంఘటన
నర్సాపూర్‌రూరల్: బస్సు ఎక్కుతుండగా మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి రూ. లక్షా 35 వేల నగదును దొంగలు చోరీ చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు మండలంలోని నాగులపల్లి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కేశన్నగారి విజయ, లక్ష్మణ్ దంపతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం హైదరాబాద్‌లో బంగారం కొనేందుకు భార్యాభర్తలు విజయ, లక్ష్మణ్‌లు రూ.లక్షా 50 వేలు హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని తమ గ్రామం నుంచి నర్సాపూర్ బస్టాండ్ వరకు వచ్చి హైదరాబాద్ వెళ్లేందుకు కొద్దిసేపు వేచి ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లనున్న మెదక్ డిపోకు చెందిన బస్సు వచ్చింది.
దీంతో విజయ హ్యాండ్‌బ్యాగ్ వేసుకొని ముందు డోర్ నుంచి బస్సు ఎక్కింది. భర్త లక్ష్మణ్ వెనుక డోర్ నుంచి ఎక్కాడు. బస్సులో ఎక్కిన అనంతరం ఇద్దరూ ఒకే సీటులో కూర్చున్నారు. నర్సాపూర్ శివారు దాటుతున్న సమయంలో హ్యాండ్ బ్యాగ్ బరువు తగ్గి ఉండడాన్ని గమనించి, వెంటనే దాన్ని తెరిచేందుకు జిప్ లాగబోయారు. కానీ అప్పటికే జిప్ తెరిచి ఉంది. బ్యాగ్‌లో ఉండాల్సిన రూ. లక్షా 50 వేలకుగాను రూ. 15 వేలు మాత్రతే ఉండగా మిగతా రూ. లక్షా 35 వేలు లేకపోవడంతో లబోదిబోమన్నారు. దీంతో బస్సు కండక్టర్, డ్రైవర్లు వెంటనే వారిని నర్సాపూర్‌కు తీసుకువచ్చారు.
నర్సాపూర్ బస్టాండ్‌లోనే దొంగతనం జరిగి ఉండవచ్చని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వెంకటరాజాగౌడ్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా పుటేజ్‌ను పరిశీలించగా విజయను ముగ్గురు మహిళలు బస్సు ఎక్కుతున్న సమయంలో అనుసరించిన విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. దీంతో దొంగల కోసం ఎస్సై వెంకటరాజాగౌడ్ సిబ్బందితో గాలింపు చర్యలు ముమ్మరం చేశాడు.
కూతురు పెళ్లికి బంగారం కొనేందుకు వెళ్తున్నాం
ప్రస్తుతం తమ కూతురు ఇంటర్మీడియెట్ చదువుఽతోందని విజయ, లక్ష్మణ్ దంపతులు బోరున విలపిస్తూ తెలిపారు. తాను అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నానని వేతనంలో వచ్చిన కొంత సొమ్మును కూడబెట్టుకోవడంతోపాటు ఇటీవల తన భర్తకు సంబంధించిన ఎల్‌ఐసీ పాలసీకి సంబంధించిన కొంత డబ్బు వచ్చిందన్నారు. మరికొంత డబ్బు తన తమ్ముడు సేనాధిపతి ఇచ్చారన్నారు. మొత్తం రూ. లక్షా 50 వేలు పోగుకావడంతో ఆ డబ్బుతో తన కూతురు పెళ్లికోసం బంగారం కొనిపెట్టుకుందామన్న ఆలోచనతో హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిపారు. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము దొంగలు ఇలా లూటీ చేయడంతో ఏమీ తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.