'ఎన్టీఆర్ ఫొటో పక్కన వైఎస్ఆర్ ఫొటో పెట్టడం వల్లే..'

'ఎన్టీఆర్ ఫొటో పక్కన వైఎస్ఆర్ ఫొటో పెట్టడం వల్లే..' - Sakshi


విజయవాడ: పోలీసులు అధికార టీడీపీకి తొత్తులుగా మారి తనపై అక్రమ కేసులు పెట్టారని కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. 12 ఏళ్లుగా ప్రస్తుత ఆఫీసులోనే తాను ఉంటున్నానని, ఎన్టీఆర్ ఫొటో పక్కన దివంగత మహానేత వైఎస్ఆర్ ఫొటో పెట్టడం వల్లే వివాదం సృష్టిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోను ఆఫీసులో  తొలగించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఆదివారం ఉదయం గుడివాడలో వైఎస్సార్సీపీ కార్యాలయానికి సంబంధించిన వివాదంలో  పోలీసులు నానిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి  తెలిసిందే. పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న అద్దె భవనానికి ఇటీవల యజమాని తాళం వేయడంతో దాన్ని తొలగించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు నానిని అదుపులోకి తీసుకుని కైకలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ బెయిల్ పై నాని బయటకు వచ్చారు.


అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. ఆఫీసును ఖాళీ చేయాలని రెండు రోజుల క్రితం చెప్పారని, వేరే భవనం చూసుకునే లోపే ఇలా చేశారని చెప్పారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చేయించారని ఆరోపించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే గుడివాడలో టీడీపీ తరపున పోటీ చేయాలని సవాల్ విసిరారు. నిష్పక్షపాతంగా ఉంటానని ప్రమాణం చేసిన చంద్రబాబు, ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని నాని విమర్శించారు.



సివిల్ వివాదంలో పోలీసులు ఎలా తలదూరుస్తారని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి ప్రశ్నించారు. ప్రజల సౌకర్యార్థం ఆఫీసు పెట్టుకుంటే, సీఎం కుటుంబ సభ్యుల ప్రమేయంతో పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. ఆఫీసులోని వస్తువులను తొలగించడం దారుణమని అన్నారు. ఈ విషయంలో డీజీపీ జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని పార్థసారధి డిమాండ్ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top