కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు | kidnap case.. accued arrested | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

May 20 2017 12:01 AM | Updated on Oct 4 2018 8:29 PM

కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త సతీమణి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన కారు డ్రైవర్ దయను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను కొత్తపల్లి పోలీసు స్టేషన్‌లో పిఠాపురం సీఐ అప్పారావు శుక్రవారం విలేకరులకు తెలియజేశారు. పశ్చిమ

కొత్తపల్లి: 
కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త సతీమణి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన కారు డ్రైవర్ దయను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను కొత్తపల్లి పోలీసు స్టేషన్‌లో పిఠాపురం సీఐ అప్పారావు శుక్రవారం విలేకరులకు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొత్తపల్లికి చెందిన ఆరుగుల సుబ్బారావు ఎలియాస్‌ దయ కారు డ్రైవర్‌. అతను కాకినాడ జగన్నాధపురంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. తెలిసిన వారివద్ద అతను అప్పులు చేయడంతో అమ్మమ్మ, తాతయ్య అతనిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దాంతో కాకినాడలో ఒక గదిని అద్దెకు తీసుకుని అతను ఉంటున్నాడు. ఆ క్రమంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పెండ్యాల బాబూరావు, విశ్వనాథరాజుతో పరిచయం పెంచుకున్నాడు. వారికి డబ్బు ఆశ చూపి తన యజమాని సతీమణిని కిడ్నాప్‌ చేసేందుకు ప్లాన్‌ వేశాడు. కాకినాడలోని యాక్ట్‌ ఫార్వర్డ్‌ షిప్పింగ్‌ కంపెనీ యజమాని కాలే వెంకట సత్యనారాయణ సాయి సతీమణి ధనలక్ష్మిని ఈ నెల 8వ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటివద్ద నుంచి కార్యాలయానికి కారులో తీసుకు వెళుతుండగా ప్లాన్‌ ప్రకారం రోటరీ క్లబ్‌ సమీపంలో పెండ్యాల బాబూరావు, విశ్వనాథరాజు ముఖానికి గుడ్డలు కట్టుకుని కత్తులు, తాళ్లతో కారు వెనుక సీటులోకి ఎక్కారు.  వారు ఆమెను బెదిరించబోగా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కాకినాడకు చెందిన విజయ్‌కుమార్‌ ఈ సంఘటనను గమనించాడు. కారుతో పాటు బైక్‌పై వెంబడించి తొలుత 100కు సమాచారం ఇచ్చాడు. 3 టౌన్‌ పోలీసుస్టేషన్‌కు ఈ సమాచారం అందింది. దాంతో లైట్‌ హౌస్‌ సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు సమాచారం అందించారు. ఆ కానిస్టేబుల్‌  కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందజేయగా ఉప్పాడలో బీచ్‌రోడ్డు సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై లోవరాజుకు సమాచారం ఇవ్వగా అటువైపు వస్తున్న కిడ్నాప్‌ కారును అడ్డగించబోయారు. అయితే కారు వేగంగా ఆపకుండా అద్దరిపేట వైపు సాగిపోయింది. దాంతో కొనపాపపేటలో ఉన్న మత్స్యకారులకు పోలీసులు ఈ సమాచారం అందజేశారు. వారు అటువైపు వస్తున్న ఇసుకలారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి కారును అడ్డగించారు. ఇది గమనించిన డ్రైవర్‌ దయ పరారయ్యాడు. మిగిలిన ఇద్దరు నిందితులను అప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌కుమార్‌లా ప్రతి ఒక్కరూ జరుగుతున్న అన్యాయాలపై పోలీసులకు సమాచారం అందజేస్తే ఎటువంటి కేసులనయినా ఛేదిస్తామని సీఐ అప్పారావు పేర్కొన్నారు. దయను కాకినాడలో శుక్రవారం  అదుపులోకి తీసుకున్నామని, శనివారం కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు. ఎస్సై కేవీఎస్‌ సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు.
19పీటీపీ111–23050003: విలేకరులతో మాట్లాడుతున్న సీఐ అప్పారావు. వృత్తంలో నిందితుడు దయ  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement