కోర్టు ధిక్కారం!


సాక్షి, చెన్నై:

 కర్ణాటక ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదుకు తగ్గ కసరత్తుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. సోమవారం ఇందుకు తగ్గ పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా కోర్టు ధిక్కారం అంటూ కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు అత్యవసర లేఖ రాశారు.

 

 కావేరి జలాల కోసం కర్ణాటకతో పెద్ద సమరమే సాగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తమిళులకు అండగా నిలబడడంతో కావేరి జలాలు మెట్టూరు డ్యాంలోకి వచ్చి చేరుతాయన్న ఆనందం తాండవం చేసింది. అయితే, కోర్టు ఆదేశాలు ఇచ్చినా, కర్ణాటక ఖాతరు చేయక పోవడం గమనార్హం. అదే సమయంలో తమిళనాడుకు చుక్క నీళ్లు కూడా ఇవ్వబోమని స్పందిస్తున్న కన్నడీగులకు కోర్టు ద్వారా చెంప పెట్టు వేయించేందుకు తగ్గ కసరత్తుల్లో రాష్ర్ట ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్టు సమాచారం.

 

 ఈనెల 19న కావేరి మధ్య వర్తిత్వ కమిటీ తమిళనాడుకు పది రోజుల పాటు సెకనకు మూడు వేల గణపుటడుగుల మేరకు నీళ్లు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఆ మరుసటి రోజు సుప్రీంకోర్టు ఈనెల 27 వరకు తమిళనాడుకు సెకనుకు ఆరు వేల గణపుటడుగుల మేరకు నీళ్లు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా కర్ణాటక పాలకులు వ్యవహరించే పనిలో పడ్డారు. కోర్టు ఆదేశించి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు నీటిని విడుదల చేయలేదు.



 దీంతో కావేరిలో నీటి రాక తగ్గింది. మెట్టూరు జలాశయంలోకి నీటి రాక క్రమంగా తగ్గుముఖం పట్టడం ఆందోళన రేకెత్తిస్తున్నది. తమిళనాడుకు చుక్కనీళ్లు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చుతూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కన్నడీగులు తీర్మానం చేశారు. ఈ పరిణామాలు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తమిళనాడుకు కోర్టు ఆదేశాలతో నీళ్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్న కర్ణాటక ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదుకు తగ్గ కసరత్తులు వేగవంతమయ్యాయి.

 

 ఇప్పటి వరకు కోర్టు ఆదేశాల మేరకు నీళ్లను కర్ణాటక విడుదల చేయక పోవడాన్ని పరిగణలోకి తీసుకుని సోమవారం కోర్టు ధిక్కార కేసు సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు లేఖ రాసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందులో కోర్టు ధిక్కారం తగదు అని, కోర్టు ఆదేశాల మేరకు నీళ్లు విడుదల చేయక పోవడాన్ని ఖండించడం గమనార్హం. కాగా ఇన్నాళ్లు హొగ్నెకల్ వద్ద పరవళ్లు తొక్కిన కావేరి నదిలో ప్రస్తుతం నీటి రాక తగ్గింది. దీంతో సందర్శకులకు నిరుత్సాహం తప్పడం లేదు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top