‘మిషన్‌ ఎవరెస్ట్‌’కు ఆహ్వానం | invitation for mission everest | Sakshi
Sakshi News home page

‘మిషన్‌ ఎవరెస్ట్‌’కు ఆహ్వానం

Oct 31 2016 9:42 PM | Updated on Sep 4 2017 6:48 PM

‘మిషన్‌ ఎవరెస్ట్‌’కు ఆహ్వానం

‘మిషన్‌ ఎవరెస్ట్‌’కు ఆహ్వానం

ప్రపంచంలోనే ఎల్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలనుకునే ఔత్సాహికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్‌ ఎవరెస్ట్‌' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ(సెట్కూరు) మేనేజర్‌ పీవీ రమణ చెప్పారు.

–ప్రభుత్వ ఖర్చుతో ఎవరెస్ట్‌ అధిరోహణ అవకాశం
– ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
–సెట్కూరు మేనేజర్‌ పీవీ రమణ
 
కర్నూలు(హాస్పిటల్‌): ప్రపంచంలోనే ఎల్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలనుకునే ఔత్సాహికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్‌ ఎవరెస్ట్‌' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ(సెట్కూరు) మేనేజర్‌ పీవీ రమణ చెప్పారు. ఈ మేరకు ఈ నెల 28వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్‌టీ నెం.300ను జారీ చేసిందని తెలిపారు. సోమవారం ఆయన సెట్కూరు కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా..
  •  ఎవరెస్ట్‌ను అధిరోహించడం కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి 10 మంది చొప్పున ఔత్సాహిక నిరుపేద యువతీయువకులను ఎంపిక చేస్తారు.
  •  సంవత్సరాదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే ఏడాదికి రూ.81వేలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.1,03,000లు ఉండాలి.
  •  ఎంపికకు జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా యువజన సర్వీసుల శాఖ అధికారి, సభ్యులుగా శిఖరాలను అధిరోహించడంలో శిక్షణ ఇచ్చే సంస్థల నిర్వాహకులు, క్రీడల అధికారి, వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఒక మెడికల్‌ ఆఫీసర్‌ ఉంటారు.
  •  రాష్ట్ర స్థాయిలో ఎంపికైన 130 మంది యువతకు ఐదురోజుల పాటు విజయవాడ/వైజాగ్‌లలో శిక్షణ ఇచ్చి వీరిలో 20 మందిని ఎంపిక చేస్తారు.
  •  20 మందిని భారత రక్షణ శాఖతో శిక్షణ ఇచ్చి అందులోంచి 9 మందిని ఎంపిక చేస్తారు. వారికి మరోసారి శిక్షణ ఇచ్చి, శారీరక, మానసిక దారుఢ్యపరీక్షల కోసం హిమాలయ పర్వతాలకు తీసుకెళ్లి అక్కడ పర్వతాలు అధిరోహించడంలో అనుభవం ఉన్న లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ స్థాయి అధికారిచే శిక్షణ ఇప్పిస్తారు.
  •  9 మందిలో నుంచి చివరకు 5 మందిని ఎంపిక చేసి రెండు నెలల పాటు ఎత్తైన ప్రదేశాలలు ఎక్కడంలో శిక్షణ ఇస్తారు.
  •  వీరికి 2017 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో ఎవరెస్ట్‌ పర్వతాన్ని ఎక్కిస్తారు.
  •  వివరాలకు కల్లూరు ఎస్టేట్‌లోని సెట్కూరు కార్యాలయం, 08518–229146ను సంప్రదించవచ్చు. 
 

Advertisement
 
Advertisement
Advertisement