అవినీతికి ఆయనే బిగ్‌బాస్!

అవినీతికి ఆయనే బిగ్‌బాస్! - Sakshi


వేల కోట్ల మేర కుంభకోణాలు

రోజుకో అవినీతి వ్యవహారం బట్టబయలు


♦ అధికారపార్టీ ఎంపీ అవినీతిని మంత్రి బైటపెడితే...

     ఆ మంత్రి ముడుపుల వ్యవహారంపై ఎంపీ లేఖరాశారు..

♦ సాక్ష్యాలతో సహా ఎన్ని బైటపడుతున్నా

     చంద్రబాబు నోరు మెదపరు

♦ అవినీతి వసూళ్లన్నిటిలోనూ బాబుకూ వాటా

♦ ఇసుక లాబీ నుంచి చినబాబు వసూళ్లు

♦ {పాజెక్టు పనుల్లో ఏరులుగా పారుతున్న అవినీతి

♦ పట్టిసీమ మొదలు అవుకు వరకూ ఎన్నో ఉదాహరణలు

♦ అధికారులపై దాడులకూ తెగబడుతున్న తమ్ముళ్లు

♦ పారిశ్రామిక విధానానికి మించి ఆశ్రీతులకు రాయితీలు

♦ అయినవారికి వందల ఎకరాల భూములు

♦ బామ్మర్ది, ఆయన వియ్యంకుల కోసం జీవోలు

♦ మాట వినని అధికారులపై బదిలీ వేటు

♦ అవినీతి, బంధుప్రీతి.. బాబు మార్కు పాలనారీతి..

 

 రాష్ర్టంలో అవినీతి విచ్చలవిడిగా మారిపోయింది.ఎటు చూసినా కుంభకోణాలు...  అన్ని రంగాల్లోనూ దారుణ దోపిడీ... అధికార పార్టీ ఎంపీకి అదనపు ప్రయోజనం జరిగినట్లు సాక్షాత్తూ ఓ మంత్రి బైటపెడితే... ఆ ఎంపీ బహిరంగ లేఖ రాసి మరీ ఆ మంత్రి అవినీతిని బట్టబయలు చేశాడు... ఇదే కాదు ప్రాజెక్టు పనుల్లో అవినీతి ఏరులుగా పారుతోందని అనేక ఉదంతాలు రుజువు చేస్తున్నాయి.. పట్టిసీమ మొదలు అవుకు సొరంగం వరకు అనేక కుంభకోణాలు బైటపడ్డాయి... ‘నీరు చెట్టు’లో అవినీతి విరగగాసినట్లు సుస్పష్టంగా కనిపిస్తోంది.. అధికారులను తన్ని తరిమేసే స్థాయికి ఇసుక దందాలు పెరిగాయి.. బామ్మర్ది సహా ‘అయినవారి’కే భూములన్నీ అర్పితమౌతున్నాయి.. నామినేషన్ పద్ధతిన టెండర్లు ఖరారయి పోతున్నాయి... అవినీతి పుట్ట పగిలి రోజుకో బాగోతం బద్దలవుతోంది...

 

 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో అవినీతి జూలు విదిలిస్తున్నా ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. తమ్ముళ్లను కిమ్మనడం లేదు.. స్వయంగా మంత్రులు, అధికార పార్టీ ఎంపీలే అవినీతి వ్యవహారాల గురించి బైటపెడుతున్నా ముఖ్యమంత్రి వాటిపై మాట్లాడడంలేదు.  రోజుకో కుంభకోణం వెలుగుచూస్తున్నా ముఖ్యమంత్రి కిమ్మనకుండా ఎందుకు కూర్చుంటున్నారు?.. ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదేం? అధికారులను అదిలించడానికే  పరిమితమౌతున్నారెందుకు..? జవాబు అంత కష్టమేమీ కాదు.. అన్ని వ్యవహారాలలో ముఖ్యమంత్రికీ భాగముందని, అందుకే ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.



స్వయంగా సీఎం అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, అందుకే ఆయన ఎవరినీ ఏమీ అనలేకపోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు మాట్లాడలేకపోవడం అనుమానాలకు ఆస్కారమిస్తోందనీ విశ్లేషకులూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు బాబుకు ‘అన్ని విధాలా’ సాయం చేసిన వారు ఇపుడు యథేచ్చగా అవినీతికి పాల్పడుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఆ సాయానికి ప్రతిఫలంగానే బాబు ఇపుడు వారికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారని, అయినా ఆయన వాటా ఆయనకు దక్కుతున్నందునే నోరుమెదపడం లేదన్న విమర్శలున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన ఈ ఏడాదిన్నర కాలంలో సాగిన కుంభకోణాల్లో మచ్చుకు కొన్ని...



 ఎంపీ- మంత్రి సిగపట్లతో...

 గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) 29వ ప్యాకేజీలో టీడీపీ ప్రభుత్వం వచ్చే నాటికి 10 శాతం పనులు మిగిలిపోయాయి. మిగిలిపోయిన పనుల విలువ దాదాపు రూ. 11 కోట్లు. ఈ విలువను అమాంతం రూ. 110 కోట్లకు పెంచేశారు.పాలనా అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచి.. అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన ‘రిత్విక్ ప్రాజెక్ట్స్’కు అప్పగించారు. రూ. 35 కోట్ల మేర బిల్లులు చెల్లించిన తర్వాత.. వాటాల పంపకంలో సాగునీటి మంత్రి, అధికార పార్టీ ఎంపీ మధ్య విభేదాలు తలెత్తాయని నీటిపారుదల శాఖలో ప్రచారంలో ఉంది. దీంతో మంత్రి ఉమ వ్యూహాత్మకంగా విషయం బయటపెట్టారు. ప్రతిగా సీఎం రమేష్.. జీఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా చేపట్టిన అవుకు సొరంగం(ప్యాకేజి-30)లో అవినీతిని బయటపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్ల అదనపు చెల్లింపులకు నీటిపారుదల శాఖ సిద్ధమైదంటూ ప్రభుత్వానికి రమేష్ లేఖ రాశారు. ఇటు మంత్రి, అటు సొంత పార్టీ ఎంపీ.. ముడుపుల వాటాల విషయంలో సిగపట్లు పడుతున్నా.. ముఖ్యమంత్రి మౌనాన్ని ఆశ్రయించడం వెనుక కథేమిటన్నది బహిరంగ రహస్యమే.



 ముడుపుల పుట్ట పట్టిసీమ

 పట్టిసీమలో అవినీతి భాగోతానికి  ముఖ్యమంత్రి చంద్రబాబే సూత్రధారి అని విమర్శలు వెల్లువెత్తాయి. ఈపీసీ విధానంలో 5 శాతానికి మించి ‘ఎక్సెస్’ కోట్ చేయడానికి అవకాశం లేకపోయినా.. సీఎం పట్టిసీమ ప్రాజెక్టుకు 5 శాతం నిబంధనను తొలగించారు. కాంట్రాక్టర్‌తో ముందుగా అవగాహన ఉండటం వల్లే.. ‘మినహాయింపు’ పేరిట అదనపు బోనస్ తెర మీద కు తెచ్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి ఏడాది గడువు ఇచ్చి, ఇచ్చిన గడువులోగా పూర్తి చేస్తే 16.9 శాతం అదనంగా బోనస్ ఇస్తామంటూ విచిత్రమైన నిబంధన పెట్టి.. అవినీతికి గేట్లు ఎత్తేశారు. అంచనా వ్యయాన్ని రూ. 1,600 కోట్లకు పెంచి, ఆమేరకు తమ వాటాగా దాదాపు రూ.700 కోట్లు నొక్కేస్తున్నారంటున్నారు.



 కమీషన్ల కోసం పోలవరం బలి!

 పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కినా.. కేంద్రానికి నిర్మాణ బాధ్యత అప్పగించకుండా, సత్తాలేని సొంతపార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీ ‘ట్రాన్స్‌ట్రాయ్’ ప్రయోజనాలు రక్షించడానికి ప్రాజెక్టు భవిష్యత్‌నే బాబు ఫణంగా పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి  రూ. 250 కోట్లు, సబ్ కాంట్రాక్టర్‌కు రూ. 24 కోట్లు చెల్లించారు. ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇచ్చిన కాంట్రాక్టు అంచనాలు రూ. 4,050 కోట్ల నుంచి రూ. 6,961.70 కోట్లకు పెంచేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 30వేల కోట్లకు పెంచారు. ఇందులో కమీషన్లుగా 10 శాతం.. అంటే రూ. 3,000 కోట్ల వరకు పెద్దలకు దక్కనున్నాయని అధికారులంటున్నారు.



 అస్మదీయునికి కుప్పం పనులు

 కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు.దీనికోసం హైపవర్ కమిటీ మీద ఒత్తిడి తీసుకురావడాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ గట్టిగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి ‘నోట్’ పంపించారు. నిబంధనలు పాటించకుండా.. తాను చెప్పిన వారికి కాంట్రాక్టు ఇవ్వాల్సిందేనని బాబు పట్టుబట్టారు. దాంతో  రూ. 413 కోట్ల విలువైన పనులు అస్మదీయునికి కట్టబెట్టేశారు. ఇందులో తమ్ముడికి రూ 100 కోట్లకు పైనే మిగులుతుందని అంచనా.



 ఇసుక దందాల్లో చినబాబు!

 పెద్ద ఇసుక రీచ్ నుంచి రోజుకు వంద లారీల వరకు,చిన్న రీచ్‌ల నుంచి రోజుకు 25 లారీలకు తగ్గకుండా రాష్ట్రంలో అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 370 ఇసుక రీచ్‌లు పనిచేస్తున్నాయి. వాటి నుంచి రోజుకు సరాసరి పది లారీల  ఇసుక అమ్మకాలు జరిగినా.. మార్కెట్  ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 2,923 కోట్లు ఆదాయం రావాలి. రోజుకు 20 లారీల ఇసుక అమ్మకాలు జరిగినా.. ప్రభుత్వానికి ఆరు వేల కోట్లు  రావాలి. ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం కేవలం రూ. 831 కోట్లు మాత్రమే. మొత్తం 5,169 కోట్లు తమ్ముళ్లు కొట్టేశారన్నమాట.  ఇదంతా సీఎం కనుసన్నల్లోనే సాగుతోందని అధికారులే చెబుతున్నారు. టీడీపీ నేతల ఇసుక దోపిడీని ఎమ్మార్వో వనజాక్షి అధికారి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆమెపై అధికారపార్టీ ఎమ్మెల్యే  దాడి చేశారు.  రీచ్‌ల వారీగా స్థానిక టీడీపీ నేతల నుంచి, ఇసుక మాఫియా నుంచి చినబాబుకు నెలనెలా రూ.కోట్లు అందుతున్నాయన్న విమర్శ ఉంది.



 మట్టినీ వదలని తమ్ముళ్లు

 అధికారపార్టీ నేతలు మట్టినీ విడిచిపెట్టలేదు. నీరు-చెట్టు పథకం కింద చెరువుల పూడికతీత పనుల్లో అవినీతికి అంతేలేదు. 1.70 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని చెరువుల నుంచి తీసి అమ్ముకొని తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకున్నారు. ప్రాంతాన్ని, డిమాండ్‌ను బట్టి ట్రాక్టర్ మట్టిని రూ. 100-400 వరకు అమ్ముకున్నారు.  కనీసం రూ. 100 కోట్ల మేర తెలుగు తమ్ముళ్లు లబ్దిపొందినట్లు అధికారుల అంచనా.



 పత్తి కుంభకోణంలో మంత్రికే వత్తాసు!

 అమాయక రైతుల కడుపు కొట్టి రూ.కోట్లు   దోచుకున్న గుంటూరు జిల్లాకు చెందిన ’ప్రత్తి’ వ్యాపారి, సీఆర్‌డీఏలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ మంత్రికి సీఎం చంద్రబాబు అండగా నిలిచారన్న విమర్శలున్నాయి. గుంటూరు జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సేకరించిన పత్తిలో.. 80 శాతం బోగస్ రైతుల నుంచే కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చింది. కానీ బాబు విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేసి మంత్రికి బాసటగా నిలిచారు. ఈ కుంభకోణంలో- రైతులకు దక్కాల్సిన రూ.200 కోట్లను- బ్రోకర్లు, మంత్రి బంధువులు బొక్కినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



 గల్లా కుటుంబానికి భారీ నజరానా!

 మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గుంటూరు ఎంపీ గల్లా జయదేశ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు  చిత్తూరు జిల్లా కరకంబాడిలో 43.38 కోట్ల విలువైన భూమిని రూ.4.88 కోట్లకే కట్టబెట్టారు. ఇక్కడ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ. 2 నుంచి 2.5 కోట్లు వరకూ పలుకుతోంది. అయితే ప్రభుత్వం ఎకరా రూ. 22.50 లక్షల ధరతో 21.69 ఎకరాలను ధారాదత్తం చేసింది.



 నచ్చిన కంపెనీలకు  రాయితీలు

 కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమలకు అనేక రాయితీలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఓ పది పరిశ్రమలకు మాత్రం ’అంతకు మించి‘ ప్రయోజనాలు కల్పించింది. 10 పరిశ్రమలకు ఏకంగా రూ.5 వేల కోట్లకు పైగా వ్యాట్, విద్యుత్ చార్జీల్లో అదనంగా రాయితీలను కల్పించారు. పారిశ్రామిక విధానానికి మించి రాయితీలు పొందిన ఈ సంస్థల నుంచి ప్రభుత్వ ‘పెద్ద’లకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు దక్కాయని వినిపిస్తోంది.



  ప్రశ్నించే అధికారులకు ఉద్వాసన

 ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించకుండా.. నిబంధనలను గుర్తు చేసే సీనియర్ అధికారులను అప్రాధాన్య స్థానాలకు నెట్టివేయడం చంద్రబాబుకు అలవాటే. జూనియర్లు, నాన్-ఐఏఎస్ అధికారులకు కీలకమైన పోస్టులు కట్టబెట్టి.. తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు. గీతం మెడికల్ కాలేజీకి అటానమస్ హోదా కల్పించడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను అక్కడ నుంచి తప్పించారు.  సీఎంవో నుంచి తప్పించిన మరో సీనియర్ అధికారి గిరిధర్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు.  ఇండియన్ పోస్టల్ సర్వీస్(ఐపీవోఎస్) అధికారిణి సంధ్యారాణిని అత్యంత ముఖ్యమైన విద్యాశాఖ కమిషనర్‌గా, పోస్టల్ సర్వీసుకు చెందిన మరో అధికారి ఎం.వెంకటేశ్వర్లును భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డెవలెప్‌మెంట్ అథారిటీ ఎండీగా, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి కె.సాంబశివరావును ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు.



 పెన్షన్లనూ కాజేస్తున్న తమ్ముళ్లు..

 సంక్షేమ పెన్షన్ల నుంచి తెలుగు తమ్ముళ్లు జన్మభూమి కమిటీల పేరట ప్రతినెలా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో పెన్షనర్ నుంచి కనీసం రూ. 100 వసూలు చేస్తున్నారు. ప్రతినెలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వసూళ్ల మొత్తం రూ. 50 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.

 

 ఎన్టీఆర్ ట్రస్టు ‘భూ’దోపిడీ

 ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాల కేంద్రాల్లోనూ అత్యంత విలువైన ప్రభుత్వ భూములు కొట్టేసేందుకు సీఎం చంద్రబాబు, ఆ పార్టీ కీలక నేతలు పావులు కదుపుతున్నారు. శ్రీకాకుళం నడిబొడ్డున సర్వే నెంబరు 700-1లో 1.29 ఎకరాలు, సర్వే నెంబరు 701-1లో 0.71 ఎకరాల భూమిని ఏడాదికి రూ.25 వేలను లీజుగా నిర్ణయించి.. 99 ఏళ్లపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు అప్పగిస్తూ ఆగస్టు 4న ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నడిబొడ్డున సర్వే నెంబరు 60/1లో రెండు వేల చదరపు గజాల  భూమిని 99 ఏళ్లపాటు ఎన్టీఆర్ భవన్‌కు లీజుకు ఇస్తూ ఆగస్టు 22న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని విలువ రూ. 25 కోట్లకు పైమాటే.

 

 చినబాబు చెప్పినోళ్లకి భూపందేరం

 ‘చినబాబు’ స్నేహితుడికి చెందిన  ఇసెంట్రిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు  విశాఖ జిల్లా మధురవాడలో ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది.  రూ. 336 కోట్ల విలువైన 50 ఎకరాలను రూ. 25 కోట్లకే  ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి కట్టబెడుతూ ఇటీవల రెవెన్యూ శాఖ జీవో కూడా జారీ చేసింది. రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నేతృత్వంలోని కమిటీ ఇక్కడ ఎకరా రూ. 7.60 కోట్లు ప్రతిపాదించగా ముఖ్యమంత్రి స్వయంగా కలుగజేసుకుని ఎకరా రూ. 50 లక్షలకు తగ్గించారు. దీంతో రూ. 336 కోట్ల విలువైన భూమిని రూ. 25 కోట్లకే ఇచ్చినట్లయింది.

 

 బంధువులకు, బామ్మర్దికి అప్పనంగా భూములు

 కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల అ త్యంత విలువైన భూమిని  హిందూపురం  ఎమ్మెల్యే బాలకృష్ణ సమీప బంధు వు, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి కుటుంబానికి చెందిన విశాఖపట్నం బా ట్లింగ్ కంపెనీ (వీబీసీ) కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌కు అప్పనంగా ఇచ్చేసింది. ఈభూమి బహిరంగ మార్కెట్‌లో  ఎకరా హీనపక్షం రూ. 50 లక్షలకు పైగా ప లుకుతుండగా బాబు కేవలం రూ. లక్షకే ధారాదత్తం చేశారు. రూ. 249 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 4.98 కోట్లకే రాసిచ్చేశారు. బాలకృష్ణకు విజయవాడలోని విద్యాధరపురంలో రూ. 200 కోట్లు విలువైన ఐదెకరాల ఆర్టీసీ భూములను అప్పగించడానికి రంగం సిద్ధమైందని అధికారవర్గాలంటున్నాయి.

 

 ఇదిగో.. ఇది మచ్చుకే..

 బాబు జమానాలో మచ్చుకు కొన్ని ఎంపిక చేసిన అవినీతి వ్యవహారాలివి.  అతి స్వల్ప కాలంలో బాబు, చినబాబు, తమ్ముళ్ల జేబులోకి వెళ్లిన మొత్తం ఇది. ఇందులో రాజధాని, ఇతర భూ కుంభకోణాలు, పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో జరిగిన అవినీతి వ్యవహారాలను కలుపలేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top