ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు?

ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు? - Sakshi


► యాదాద్రి లక్ష్మీనరసింహుడి కల్యాణం ఆలస్యంపై గవర్నర్  నరసింహన్ ఫైర్

► సమయం ఎందుకు పాటించడం లేదంటూ ఆలయ ఈవోపై మండిపాటు

► సమయం ప్రకారం జరపరా అంటూ ఆగ్రహం

► మాంగళ్య ధారణ పూర్తవకముందే అర్ధంతరంగా హైదరాబాద్‌కు తిరుగుపయనం


 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఎప్పుడూ భక్తిశ్రద్ధలతో, దైవ కార్యక్రమాలను తు.చ. తప్పకుండా పాటించే గవర్నర్.. సతీసమేతంగా లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. యాదగిరీశుడి కల్యాణం ముహూర్త సమయాని కన్నా ఆలస్యంగా జరుగుతుందన్న కారణంతో ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని, కొంతసేపు కూర్చుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని తెలుస్తోంది!

 

అసలేమైందంటే..?

గవర్నర్ నరసింహన్ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు గురువారం రాత్రి 8:30 గంటలకు సతీసమేతంగా యాదాద్రికి వచ్చారు. కల్యాణం జరిగే మండపంలో ఆశీనులై పెళ్లి తంతును తిలకించారు. అయితే, ముహూర్తం ప్రకారం స్వామి వారి ఉరేగింపు 9:45 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది. కానీ 18 నిమిషాలు ఆలస్యంగా 10:03 నిమిషాలకు వచ్చింది. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవో గీతారెడ్డిని ఆలస్యం ఎందుకు అయిందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరికొందరు ప్రజాప్రతినిధులు రావాల్సి ఉందని, అందుకే పావుగంట ఆలస్యంగా కల్యాణం నిర్వహిస్తున్నామని ఈవో బదులిచ్చినట్టు సమాచారం. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



మీ ఇష్ట ప్రకారం చేయడానికి ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు? అన్నీ సమయం ప్రకారం ఎందుకు జరపడం లేదు? అని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఈవో గీత వెంటనే పూజాది కార్యక్రమాలను ప్రారంభించాలని అర్చకులకు సూచించారని తెలుస్తోంది. ఎవరో రావాలన్న ఆలోచనతో స్వామివారి కల్యాణాన్ని ఆలస్యంగా చేస్తున్నారనే కారణంతో నరసింహన్ తన సతీమణితో కలిసి 10:45 గంటల సమయంలో కల్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లే సమయానికి మాంగళ్య ధారణ కార్యక్రమం కూడా పూర్తి కాకపోవడం, పెళ్లికి వచ్చిన దుస్తులతోనే ఆయన వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లిన తర్వాత 40 నిమిషాలకు అంటే 11: 25 నిమిషాలకు స్వామి వారి కల్యాణ ఘట్టం ముగియడం గమనార్హం. రాయగిరి కట్ట మీద ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద తన వాహనశ్రేణిని ఆపిన గవర్నర్ అక్కడ దుస్తులు మార్చుకుని హైదరాబాద్ వెళ్లినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.





 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top