కుమార్తె, కుమారుడికి విషమిచ్చి.. | Family commit suicide | Sakshi
Sakshi News home page

కుమార్తె, కుమారుడికి విషమిచ్చి..

Jul 29 2016 1:49 PM | Updated on Sep 4 2017 6:46 AM

కుమార్తె, కుమారుడికి విషమిచ్చి..

కుమార్తె, కుమారుడికి విషమిచ్చి..

వ్యాపారం చేసే చంద్రశేఖర్‌రెడ్డి, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై తాను కూడా తాగాడు.

ప్రొద్దుటూరు: అతనికి ఏం కష్టం వచ్చిందో ఏమో తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై అతను కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం సాయంత్రం సంబటూరులో చోటు చేసుకుంది. కమలాపురం మండలం సంబటూరు గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రొద్దుటూరుకు చెందిన జంపాల చంద్రశేఖర్‌రెడ్డి శీతల పానీయంలో విషం కలిపి కుమారుడు మంజునాథరెడ్డి, కుమార్తె హన్సికలకు తాగించి, తాను కూడా తాగాడు. వారిని పొలాల్లో పనిచేస్తున్న స్థానికులు  గమనించి వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు.

బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని నాగేంద్ర నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి శెనగలు, వరి ధాన్యం కమీషన్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతను మేనత్త కూతురు రమాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇంటర్‌ చదువుతున్న మంజునాథరెడ్డి, 3వ తరగతి చదువుతున్న హన్సికలు ఉన్నారు. వీరిది మేనరికం వివాహం కావడంతో పిల్లల ఆరోగ్యం సరిగా లేదు. ఈక్రమంలో ఐదేళ్ల క్రితం వీరికి ఆనారోగ్యం చేయడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్లారు.

పరీక్షించిన అక్కడి వైద్యులు పిల్లలిద్దరికి 20 ఏళ్లు వచ్చిన తర్వాత మంచాన పడతారని, నడవలేరని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర కలత చెందారు. అప్పట్లోనే ఇంటికి వచ్చిన నెల రోజుల తర్వాత రమాదేవి శీతల పానీయంలో శెనగ గుళికలు కలిపి పిల్లలకు తాగించింది. ముందుగా రమాదేవి తాగి మంజూనాథరెడ్డికి తాగిస్తుండగా కొద్దిగా నోట్లో పెట్టుకున్న అతను గ్లాసును విసిరిగొట్టాడు. కుమార్తెకు కూడా తాగిస్తుండగా మంజునాథరెడ్డి గ్లాసును చేత్తో విసిరివేశాడు. అయితే రమాదేవి ఎక్కువగా  తాగడంతో మృతి చెందింది. కొద్దిగా సేవించిన మంజునాథరెడ్డిని ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఏడాది తర్వాత చంద్రశేఖర్‌రెడ్డి ముద్దనూరుకు చెందిన కవితను పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిన్నర తర్వాత విఘ్నేశ్వరుడు అనే కుమారుడు జన్మించాడు.

శీతల పానీయంలో విషం కలిపి
గత కొన్నినెలల నుంచి చంద్రశేఖర్‌రెడ్డి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు సన్నిహితులు, బంధువులు చెబుతున్నారు. అంతేగాక పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా అతను గుర్తుకు తెచ్చుకుని రోదించేవాడన్నారు. ఈ క్రమంలో గురువారం కాలేజిలో ఉన్న కుమారుడు మంజునాథరెడ్డిని, పాఠశాలలో ఉన్న హన్సికలను మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తీసుకొచ్చాడు. వారిని మోటార్‌ బైక్‌లో కూర్చోబెట్టుకుని సంబటూరు సమీపంలోని ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్లాడు. అక్కడ ముందే విషం కలిపిన మాజాను పిల్లలకు తాగిపించి తాను కూడా తాగాడు. వీరు ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు 108కు సమాచారం అందించారు. ప్రస్తుతం ముగ్గురు ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement