అడ్డకొండలో ఉన్న గజరాజుకు చెరుకులను తరలిస్తున్న అధికారులు
కర్ణాటక రాష్ట్రం కారంగి అడవి నుంచి మండలంలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ గజ బుధవారం కూడా విఫలమైంది. ఏనుగు అడ్డకొండలో తిష్టవేసింది. దాన్ని కొండ దింపేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు.
–మూడో రోజూ విఫలమైన ఆపరేషన్ గజ
–గజరాజును పట్టేందుకు కొండపైకి చెరుకులు, పైనాఫిల్, అరటికొమ్మలు
రామసముద్రం: కర్ణాటక రాష్ట్రం కారంగి అడవి నుంచి మండలంలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ గజ బుధవారం కూడా విఫలమైంది. ఏనుగు అడ్డకొండలో తిష్టవేసింది. దాన్ని కొండ దింపేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదిలా ఉండగా ఏనుగు బుధవారం తెల్లవారుజామున అడ్డకొండకు పడమర వైపున ఉన్న మనేవారిపల్లె సమీపంలోకి దిగి వచ్చింది. వరి, రాగి పంటను తినేసి బంతి పూల తోటలో కొంతసేపు సేదతీరింది. కుక్కలు గమనించి చుట్టుముట్టడంతో తిరిగి కొండపైకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ట్రాకర్స్‌ను, కొంతమంది స్థానికులను కొండపైకి పంపించారు. వారిని ఏనుగు ముప్పుతిప్పలు పెట్టడంతో పరుగులు తీశారు.
చెరుకులు, అరటి కొమ్మలు, అనాస పండ్లు
గజరాజును కిందకు దించేందుకు దారి పొడవునా చెరుకులు, అరటి కొమ్మలు, అనాస పండ్లను ఉంచుతున్నారు. వాటిని తింటూ కిందకి వస్తుందని డీఎఫ్‌వో చక్రపాణి తెలిపారు. తద్వారా దాన్ని పట్టుకునేందుకు శిక్షణ పొందిన మగ ఏనుగులను మనేవారిపల్లె సమీపంలోనే ఉంచామని పేర్కొన్నారు.