హామీకి పాతరేశారు! | district stretches 192 kilometers and hundreds of coastal villages in the area | Sakshi
Sakshi News home page

హామీకి పాతరేశారు!

Jun 8 2016 12:02 AM | Updated on Sep 2 2018 4:48 PM

జిల్లాలో 192 కిలో మీటర్లు విస్తరించిన ఉన్న తీర ప్రాంతంలో వందల సంఖ్యలో గ్రామాలున్నాయి. అన్ని ఊర్లకు విద్యుద్ధీకరణ పూర్తయినప్పటికీ వర్షాకాలంలో

శ్రీకాకుళం టౌన్: జిల్లాలో 192 కిలో మీటర్లు విస్తరించిన ఉన్న తీర ప్రాంతంలో వందల సంఖ్యలో గ్రామాలున్నాయి. అన్ని ఊర్లకు విద్యుద్ధీకరణ పూర్తయినప్పటికీ వర్షాకాలంలో వంద రోజులకు పైగా చీకట్లోకి వెళ్లిపోతుంటాయి. ఏటా ఇదే పరిస్థితి. తుపాన్ల సమయంలో వీచే పెనుగాలులో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమై.. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. హుద్‌హుద్ తుపాను సమయంలో ఇదే జరిగింది. భీకర గాలులకు వేలాది స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జిల్లా మొత్తం అంధకారంలోకి వెళ్లింది. రోజుల తరబడి కరెంటు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇలాంటి సమయంలో జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు భూగర్భంలో విద్యుత్ కేబుల్ అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో పనులకు సర్వే జరిపించి రూ.234 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అరుుతే ఇప్పటి వరకూ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.
 
  తరచూ విద్యుత్ కష్టాలు
   హుద్‌హుద్ తుపాను తరువాత కూడా చిన్నచిన్న తుపాన్లు జిల్లాను తాకాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ఉన్న తీర ప్రాంత మండలాలైన ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం ప్రాంతాల్లో  ప్రకృతి వైఫరీత్యాల వల్ల తరచూ విద్యుత్ సరఫరా నిలిచి పోతోంది.
 
 భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కావాలంటే..
  భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కావాలంటే ఒక్కో మండలం పరిధిలో 33 కేవీ విద్యుత్ లైన్లు 15 కిలోమీటర్లు, 11 కేవీ విద్యుత్ లైన్ 15 కిలోమీటర్లు వంతున అవసరం. అలాగే 50 కిలోవాట్స్ యాంప్సు కెపాసిటీ ఉన్న 46 విద్యుత్ ట్రాన్సుఫార్మర్లు, 315 కిలోవాట్స్ యాంప్సు కెపాసిటీ ఉన్న ట్రాన్సుఫార్మర్లు 68 అవసరమవుతాయని అంచనా. అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థను 13 తీరప్రాంత సబ్‌స్టేషన్లకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇదే విషయూన్ని ట్రాన్స్‌కో అధికారులు తమ ప్రతిపాదనల్లో పొందుపరిచారు. కాల్వల తవ్వకానికి నిధులు అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంతోపాటు శ్రీకూర్మనాథస్వామి ఆలయాన్ని అనుసంధానం చేయాల్సి ఉంది.
 
 ప్రతిపాదనలు పంపించాం
 తుపాన్ల కారణంగా తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. భారీగా నష్టాలు వస్తున్నాయి. దీన్ని నివారించడానికి, పెద్దెత్తున మార్పులు చేయడానికి భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. దీంతో క్షేత్రస్థాయి అధ్యయనం చేసి ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. రూ.234 కోట్లుతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. ప్రపంచబ్యాంకు నిధులతో ఈ ఆధునికీకరణ చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నిధులు విడుదలైతే చర్యలు మొదలు పెడతాం.
 - శరత్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement