పాలన వైపు పరుగు! | District officials are engaged in duties | Sakshi
Sakshi News home page

పాలన వైపు పరుగు!

Oct 14 2016 11:38 AM | Updated on Oct 17 2018 3:38 PM

జోగుళాంబ గద్వాల జిల్లా ఉన్నతాధికారులు పాలనను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నారు.


సమీక్షలతో కలెక్టర్, ఎస్పీ, జేసీ బిజీబీజీ
విధుల్లో నిమగ్నమైన జిల్లా ఉన్నతాధికారులు
క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునే యత్నం
ప్రజలతో సందడిగా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్‌
గద్వాల:

జోగుళాంబ గద్వాల జిల్లా ఉన్నతాధికారులు పాలనను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నారు. కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైని, ఎస్పీ విజయ్‌కుమార్, జేసీ సంగీత అధికారులతో గంటలపాటు సమీక్ష సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తద్వారా సంక్షేమపథకాల అమలు, ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లాను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. విజయదశమిరోజున కొత్త జిల్లాకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. దసరా, మొహర్రం పండగలు వరుసగా రావడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ బోసిపోయి కనిపించాయి. కాగా, గురువారం ఉదయం నుంచి అన్ని కార్యాలయాలు అధికారులు, సిబ్బందితో హడావుడితో సందడిగా కనిపించింది. గ్రామీణ, పట్టణ ప్రజలు సైతం వ్యక్తిగత పనుల మీద జిల్లా కార్యాలయాలకు తరలిరావడం కనిపించింది.

 

పలువురు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రజల రాకపోకలతో సందడిగా మారింది. కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైని, జాయింట్‌ కలెక్టర్‌ సంగీతలు వేర్వేరుగా అధికారులతో సమీక్షలు నిర్వహించి బిజీబిజీగా గడిపారు. జాయింట్‌ కలెక్టర్‌ సంగీత డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ రజత్‌కుమార్‌షైని జిల్లా ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. జిల్లా నయాపాలనపై కలెక్టర్‌ క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఎస్పీ కార్యాలయంలో సందడి
అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ హడావుడి నెలకొంది. ఉదయమే డీఐజీ అకున్‌సబర్వాల్‌ జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు పోలీసు సాయుధ బలగాల కార్యాలయాన్ని పరిశీలించి వెళ్లారు. దీంతో పోలీసు అధికారులు ఉరుకులు, పరుగులతో విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఐజీ అకున్‌ సబర్వాల్‌ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు నాంది పలికారు. అనంతరం ఎస్పీ విజయ్‌కుమార్‌ జిల్లా పరిధిలోని ఎస్‌ఐలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న క్షేత్రస్థాయి సమస్యలు, నేర సమాచారాన్ని తెలుసుకున్నారు.

శాంతిభద్రతలకు తీసుకోవాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. త్వరలోనే గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తామని మౌఖికంగా ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీరితో పాటు డీఎంఅండ్‌హెచ్‌ఓ కృష్ణ సిబ్బందితో సమీక్షలు నిర్వహించి అంటురోగాలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఇలా అధికారులు ఎవరికి వారు ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. జిల్లా కార్యాలయాలు, అధికారులు ప్రజల ముంగిట్లోకి రావడంతో ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శక పాలన అందడంతో పాటు సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement