ఆర్భాటంగా సైకిళ్ల పంపిణీ | Distributed bicycle distribution | Sakshi
Sakshi News home page

ఆర్భాటంగా సైకిళ్ల పంపిణీ

Apr 20 2017 2:47 AM | Updated on Jul 28 2018 3:39 PM

ఆర్భాటంగా సైకిళ్ల పంపిణీ - Sakshi

ఆర్భాటంగా సైకిళ్ల పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

సైకిల్‌పై సీఎం స్టిక్కర్‌ వేసేంత వరకు పిల్లలకు ఇవ్వొద్దని హుకుం
అరకొరగా జిల్లాకు వచ్చిన సైకిళ్లు


చిత్తూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో సేవలు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బడికొస్తా... అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కణ్ణన్‌ కళాశాల ప్రాంగణంలో అమరనాథరెడ్డి చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. అమరనాథరెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ పరిధిలో ఉన్న జెడ్పీ, మోడల్‌ స్కూల్స్, ఎయిడెడ్, మున్సిపల్‌ పాఠశాలల్లో 2016–17 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివిన బాలికలకు బడికొస్తా పథకం కింద సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్‌ కటారి హేమలత, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, రాజసింహులు, ఇన్‌చార్జ్‌ డీఈవో శామ్యూల్, చిత్తూరు డీవైఈవో సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం బొమ్మ వేసేంత వరకు ఇవ్వొద్దు
పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కార్యక్రమంలో గొప్పలు చెప్పిన మంత్రి, కార్యక్రమం ముగిశాక సైకిళ్లపై సీఎం బొమ్మ వేసిన తరువాత విద్యార్థినులకు ఇవ్వాలని హుకుం జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. సైకిళ్లపై సీఎం బొమ్మ లేదని తెలిసినప్పటికీ మంత్రి ఎందుకు పంపిణీ కార్యక్రమం చేపట్టారని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో 16,722 మంది విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు.

అయితే ఆ విద్యార్థినులందరికీ సైకిళ్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచి జిల్లాకు 16,100 సైకిళ్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 622 సైకిళ్లు రావాల్సి ఉంది. ప్రభుత్వం సైకిళ్లను సరఫరా చేసేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఆ కంపెనీ జిల్లాకు మొత్తం సైకిళ్లను ఇచ్చేశామని చెప్పి తప్పించుకున్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలిసింది. పూర్తి స్థాయిలో జిల్లాకు సైకిళ్లు చేరకపోయినా టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజల మెప్పు పొందడానికి పలు చోట్ల ప్రారంభ కార్యక్రమాలు హడావిడిగా చేపట్టారు. మిగిలిన సైకిళ్లను విద్యార్థినులకు ఎలా అందజేయాలో తెలియక విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement