సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం వివక్ష | Discrimination in irrigation projects | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం వివక్ష

Nov 7 2016 10:26 PM | Updated on Sep 4 2017 7:28 PM

సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం వివక్ష

సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం వివక్ష

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని కర్నూలు పార్లమెంట్‌ సభ్యురాలు బుట్టా రేణుక విమర్శించారు.

– ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
– అప్పెరల్‌ పార్కుపై అలసత్వం తగదు
 - కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
 
ఎమ్మిగనూరు:  జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని కర్నూలు పార్లమెంట్‌ సభ్యురాలు బుట్టా రేణుక విమర్శించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మిగనూరులోని మాచాని శివన్న స్వగృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర దిగువ కాలువ నీటిని సక్రమంగా, విడుదల చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. రూ. 30 కోట్లు కేటాయిస్తే పులికనుమ ప్రాజెక్టు పూర్తయి రూ. 24,600 ఎకరాలకు సాగునీరందించవచ్చన్నారు. రూ. 15 కోట్లతో నగరడోణ ప్రాజెక్టు పూర్తవుతోందనీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ మాత్రం నిధులు కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. బనవాసి దగ్గర అప్పెరల్‌ పార్కు కోసం కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ అడిగితే రాష్ట్రం నుంచి ఇంత వరకూ డీపీఆర్‌యే వెళ్లకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఎమ్మిగనూరుకు రెండు చేనేత క్లస్టర్‌ తెస్తే అదితామే తెచ్చామంటూ ఎవరో ప్రచారం చేసుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
 
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 50 లక్షలు :
 పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ కోటా నిధులతో ఏటా రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలు, మండలాలు ఎక్కువ ఉన్న పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు రూ. కోటి వరకు వెచ్చిస్తున్నామన్నారు. తాగునీటి అవసరాలు, రోడ్లు, డ్రైనేజి వ్యవస్థల మెరుగుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో వాటర్‌ ట్యాంకుల వెహికల్స్‌ కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలుతో పాటు గూడూరు నగర పంచాయతీ అభివృద్ధి కోసం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ కన్నబాబుతో యాక‌్షన్‌ ప్లాన్‌పై చర్చించామన్నారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి సమస్య పరిష్కారం కోసం స్పెషల్‌ ఆఫీసర్‌ అంకయ్యతో చర్చించి రీ ఎస్టిమేషన్స్‌ వేయిస్తున్నామన్నారు.
 
ఆదర్శానికి అడ్డంకులు :
 చేనేతలు, ప్రజల కోరిక మన్నించి తుంగభద్ర వరదల్లో నష్టపోయిన నాగలదిన్నెను దత్తత గ్రామంగా తీసుకున్నామన్నారు. అయితే అక్కడ అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయన్నారు. మొత్తం 1599 ఇళ్లను పునరావాసం కింద నిర్మించాల్సి ఉంటే కేవలం 524 ఇళ్లతో సరిపెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించి విసిగిపోయాననీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయిస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకారం తప్పని సరి కావడంతో ఇళ్ల నిర్మాణంపై ముందుకు వెళ్లలేక పోయామన్నారు.  
 
ఆసుపత్రులు ఆధ్వానం:
ఆదోని ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగు పడాల్సి ఉందన్నారు. మదర అండ్‌ చైల్డ్‌ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సేవలు బాగున్నా వసతులు కరువయ్యాయన్నారు. జిల్లా పెద్దాసుపత్రి పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కోట్లలో నిధులున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులున్నాయన్నారు. కర్నూలు మెడికల్‌ కళాశాల డైమండ్‌ జూబ్లి ఉత్సవాలకు ప్రధానిని ఆహ్వానించాననీ, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఆహ్వానం అందితే అది ఉన్నతంగా ఉంటుందన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement