
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరంతో చేరిన రోగులు
పలమనేరు, మదనపల్లె ప్రాంతాలతో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి లాంటి ప్రాంతాల్లో జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎప్పుడూ లేనివిధంగా ఒక్క తిరుపతి నగరంలోనే ఈ ఏడాది తొలినుంచీ ఇప్పటివరకు 10 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి.
– పట్టణాల్లో పెరుగుతున్న డెంగీ జ్వరాలు
– బాధితులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
– మౌలిక వసతుల్లేకపోవడమే దోమలకు ఆసరా
– నిధుల్లేక నీరశించిన మలేరియా విభాగం
– అధికారుల హడావిడి తప్ప.. క్షేత్రస్థాయిలో ఫలితం శూన్యం
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో నమోదైన జ్వరబాధితుల సంఖ్య .. 8,740
జూన్ నుంచి ఈనెల 19 వరకు జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వారి సంఖ్య .. 5,155
పట్టణాల్లో జ్వరంతో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య .. 2,118
ఈ ఏడాది నుంచి ఇప్పటివరకు డెంగీతో చికిత్స చేసుకున్న వారి సంఖ్య .. 72
జనవరి నుంచి ఇప్పటివరకు విషజ్వరాలతో మృతిచెందిన వారి సంఖ్య .. 13
ఈ సంఖ్య చూస్తుంటే వెన్నుల్లో వణుకు పుట్టక తప్పదు. జిల్లాలో దోమ కాటుకు గురవుతున్న వారి సంఖ్య ప్రతి నెలా వేలు దాటుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. జరగాల్సిన నష్టం మొత్తం జరిగాక మేమున్నామంటూ అధికార యంత్రాంగం చేస్తున్న హడావుడి కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతున్నాయి.
చిత్తూరు (అర్బన్):
జిల్లాలో ఈసారి పలమనేరు, మదనపల్లె ప్రాంతాలతో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి లాంటి ప్రాంతాల్లో జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎప్పుడూ లేనివిధంగా ఒక్క తిరుపతి నగరంలోనే ఈ ఏడాది తొలినుంచీ ఇప్పటివరకు 10 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇవి అధికారిక లెక్కలు. అనధికారికంగా ఈ సంఖ్య 35 వరకు ఉంది. ఇక శ్రీకాళహస్తిలో అయితే ఈ ఏడాది 797 మంది జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. పాలకులు ప్రజారోగ్యం కాపాడటానికి ఏం చేస్తున్నారో చెప్పడానికి ఈ సంఖ్యలే సాక్ష్యం.
ఈ ఏడాది మునిసిపాలిటీల్లో నమోదయిన జ్వరాల బాధితుల సంఖ్య
మునిసిపాలిటీ జ్వరాలు డెంగీ జ్వరాలు
––––––––––––––––––––––––––
తిరుపతి 136 10
చిత్తూరు 140 28
శ్రీకాళహస్తి 797 1
పుంగనూరు 18 1
పుత్తూరు 170 2
మదనపల్లె 414 1
నగరి 144 2
పలమనేరు 299 2
––––––––––––––––––––––––––
అంతా హడావిడే
దోమలు, విష జ్వరాలపై పట్టణాల్లో అవగాహన కల్పించడానికి రెండు రోజుల క్రితం వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రచార చైతన్య రథాన్ని ప్రారంభించారు. ఇందులో మైకులు పెట్టి దోమల నుంచి ఎలా రక్షించుకోవాలో ముందుగా రికార్డు చేసిన ఆడియోను వినిపిస్తున్నారు. ఇక మునిసిపాలిటీకి ఓ ప్రత్యేక సంచార మలేరియా క్లినిక్ వాహనాన్ని ఏర్పాటుచేసి ఒక్కో వాహనంలో నలుగురు సిబ్బందిని ఉంచారు. మురికివాడల్లో జ్వరాలతో బాధపడుతున్న వాళ్ల నుంచి రక్త నమూనాలు సేకరించడం, ఇంటింటికి వెళ్లి తిరిగి చెప్పడమే బృంద సభ్యుల పని. చిత్తూరు నగరంలో రెండు రోజుల్లో 17 వేల మందికి అవగాహన కల్పించినట్లు నిస్సిగ్గుగా అధికారులు రికార్డు రాసుకోవడం వీళ్ల పనితీరుకు నిదర్శనం. మరోవైపు విష జ్వరాలపై అవగాహన కల్పించడం, కరపత్రాలు, బ్యానర్లు ముద్రించడం, వాహనాలకు అద్దెలు చెల్లించడానికి ఈ ఆర్థిక సంవత్సరం ఎలాంటి నిధులు విడుదల కాలేదు. ఫైలు కలెక్టర్ వద్దే ఉండిపోయిందని అధికారులు నిట్టూరుస్తున్నారు.
మునిసిపాలిటీల్లో దోపిడీ
దోమల నివారణకు పట్టణాల్లో ఫాగింగ్ చేయాలి. చిత్తూరుతో పాటు పలు మునిసిపాలిటీల్లో ఫాగింగ్ పేరిట ఏటా రూ.లక్షల్లో నిధులు కాజేస్తున్నారే తప్ప.. ఏ పౌర్ణమి అమాస్యకో గానీ ఫాగింగ్ చేసే వాళ్లు కనిపిస్తుంటారు. పెరిత్రిమ్, ఏబెట్, మలాథియన్ లాంటి రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు తప్పుడు బిల్లులు సృష్టించి జేబులు నింపుకోవడం మునిసిపాలిటీలకు అలవాటుగా మారిపోయింది. ఇక మురికివాడల్లో కనీస వసతులు కల్పించడంలో స్థానిక సంస్థలు విఫలమవడం కూడా దోమల ఉత్పత్తికి ప్రధాన కారణం.
ప్రజల సహకారం ముఖ్యం
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మాత్రమే దోమలను నివారించగలుగుతాం. దీనికి ప్రజల సహకారం అవసరం. అన్ని శాఖలు సమన్వయంగా విష జ్వరాల రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం.. ప్రజలు జ్వరం వస్తే ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే సగం కేసులు నమయవుతాయి.
– విజయగౌరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి