
సర్వేలో వెలుగుచూస్తున్న కేసులు
కొందరు క్యాన్సర్‌ను దాచిపెడుతున్న వైనం
ఈ వ్యాధి నివారణకుఅవగాహన కల్పిస్తే ఒట్టు
ఉచిత వ్యాక్సిన్ ఊసెత్తని ప్రభుత్వాలు
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముంచుకొస్తోంది. అవగాహన లోపంతో మహిళలను ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ వ్యాధి ఎక్కువగా పేద, మధ్య తరగతికి చెందిన అబలలనే బలితీసుకుంటోంది. ఉచిత టీకాల విషయంపై ఎవరూ నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో పెరుగుతున్న
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్, Cervical cancer)
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇటీవల సిబ్బంది ఎన్‌సీడీ సర్వే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 5,92,514 కుటుంబాలు ఉండగా 5,03,311 కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేలో కొంత మేర సరై్వకల్ క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. 18 ఏళ్లు దాటిన వారు 15,67,268 మంది ఉంటే 11,24,511 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఇందులో 273 మందికి ఓరల్ క్యాన్సర్, 218 మందికి రొమ్ము క్యాన్సర్, 203 మందికి సరై్వకల్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఇక అవగాహన రాహిత్యంతో సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి వారు వివిధ కారణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడంతో కేసులు బయటపడుతున్నాయి.
సర్వైకల్ క్యాన్సర్ వ్యాప్తి ఇలా...
సరై్వకల్ క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణం ‘హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ)’. ఎక్కు వ మంది భాగస్వాములతో శృగారంలో పాల్గొనడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కొన్నేళ్ల తర్వాత వృద్ధి చెంది క్యాన్సర్‌కు కారణమవుతుంది. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగుల్లో, కొన్ని రకాల మందులు తరచూ వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా కూడా సరై్వకల్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. చిన్న వయసులో శృంగారంలో పాల్గొనడం వల్ల హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే బాల్య వివాహాలు చేసుకునే వారిలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు ఏళ్ల తరబడి వాడినా సరై్వకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. వీటితో పాటు ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్యంగా కూడా కొంతమందిలో సరై్వకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ కేసులు అత్యధికంగా పేద కుటుంబాల్లోని మహిళల్లోనే వెలుగుచూస్తున్నాయి.
వ్యాధి లక్షణాలు
రుతుక్రమంలో సమస్యలు
యోని నుంచి రక్తస్రావం
లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం
పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం
యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం
మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు
పొత్తికడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలు
వ్యాక్సినేషన్ మాటేమిటో?
ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9–26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 19–14 ఏళ్ల లోపు బాలికలు సరై్వకల్ క్యాన్సర్‌బారిన పడకుండా వ్యాక్సినేషన్‌ను పోత్సహిస్తామని ప్రకటించింది. దీని ధర మార్కెట్లో రూ.2వేల వరకు ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. విడతల వారీగా ఈ వ్యాక్సినేషన్‌ను వేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకునే స్థోమత పేద, మధ్యతరగతి కుటుంబాల్లో లేదు. ఈ కారణంగా ప్రభుత్వమే వ్యాక్సిన్‌ను మహిళలకు ఉచితంగా అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు క్షేత్ర స్థాయిలో సరై్వకల్ క్యాన్సర్‌పై సరైనా అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ఈ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే క్యాన్సర్ నివారణ తొలి దశలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాక్సిన్ ఉంది
గంటకు దేశంలో 9 మంది సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. ఇప్పటి వరకు 80వేల మంది మరణించారు. కొత్త కేసులు 1.70 లక్షలు ఉన్నాయి. ఇలానే వదిలేస్తే ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అన్ని క్యాన్సర్లకంటే..ఈ సరై్వకల్ క్యాన్సర్ నివారణకు మాత్రమే వ్యాక్సిన్ ఉంది. ఈ క్యాన్సర్ నివారణకు ఏళ్ల లోపు పిల్లలకు 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలి. 35–45 సంవత్సరాల లోపు మహిళలకు 70 శాతం స్క్రీనింగ్ పరీక్షలు అయి ఉండాలి. బాధితులు కచ్చితంగా మెరుగైన వైద్యం చేయించుకోవాలి. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వల్ల 80శాతం కేసులను నివారించవచ్చు. – ఆశ్రీత, వైద్య నిపుణులు
గ్రామాల్లోనే అధికం
గ్రామాల్లోనే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్యాన్సర్‌ను పాప్ స్మియర్ టెస్టు ద్వారా ముందే గుర్తించే అవకాశం ఉంది. తద్వారా మరణాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ముప్పును తప్పించుకోవాలంటే మన శరీరంపై అవగాహన ఉండాలి. ఏ మాత్రం మార్పు కనిపించినా దాన్ని గుర్తించాలి. శరీరంలో నొప్పి లేని గడ్డలు ఏమి కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దు. తక్షణం వైద్యులను సంప్రదించాలి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు
ముందే గుర్తిస్తే మేలు
సరై్వకల్ క్యాన్సర్ దాచిపెడితే ప్రాణానికే ప్రమాదం. ఇందులో దాపరికాలు వద్దు. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పరీక్షలు చేయించాలి. నిర్థారణ అయితే సరైనా చికిత్స తీసుకోవాలి. బయపడాల్సి పనిలేదు. దీనికి తోడు కౌమార దశలో బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాధిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. - సుధారాణి, డీఎంఅండ్ హెచ్‌ఓ, చిత్తూరు