
సైలెంట్ కిల్లర్ స్త్రీలకు గండంగా అండాశయ కేన్సర్
వ్యాధి ప్రారంభంలో బయటపడని లక్షణాలు
ఇబ్బందులు పడుతున్న బాధితులు
నేడు ఒవేరియన్ (అండాశయ) కేన్సర్ డే
కరీంనగర్‌టౌన్: ఒవేరియన్ (అండాశయ) కేన్సర్. స్త్రీలలో వచ్చే కేన్సర్లలో మూడోస్థానంలో ఉంటుంది. అండాశయ కేన్సర్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. ఇది చాపకింద నీరులా శరీరంలో ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీన్ని నిశ్శబ్దహంతకిగా పేర్కొంటారు. ఈ కేన్సర్ మొదటి, రెండో దశల్లో స్వల్ప లక్షణాలు ఉండటంతో రోగులు పెద్దగా పట్టించుకోరు. 60 నుంచి 70శాతం మంది వ్యాధి ముదిరిన త ర్వాతనే వైద్యులను ఆశ్రయిస్తుంటారు. దీంతో చాలా మంది మరణం అంచులకు వెళ్తున్నారు.
అండాశయ కేన్సర్ ఉంటే..
అండాశయాల్లో కేన్సర్ కణాలు అపరిమితంగా పెరిగిపోయి పక్కన ఉన్న కణజాలానికి, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని అండాశయ కేన్సర్ అంటారు. స్త్రీలకు ప్రమాదకంగా పరిణవిుంచే అండాశయ కేన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశముంది. కడుపు, ఉబ్బరంగా, నొప్పిగా ఉండడం, అజీర్తి, వికారం, తేన్పులు తదితర జీర్ణ సంబంధ సమస్యలు, యోని స్రావాలు అసాధారణంగా ఉండటం, అలసట, జ్వరం, ఆకలి లేకపోవడం, ఊపిరి కష్టంగా ఉండటం, వెన్నునొప్పితో బాధ పడుతుంటారు. అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, నెలసరి సక్రంగా లేకపోవడం ప్రధాన లక్షణాలు.
అండగా నిలుస్తున్న ఆరోగ్య మహిళ
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఆధ్వర్యంలో స్త్రీలకు నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. గత రెండేళ్లుగా ఎంపిక చేసిన ఆస్పత్రులతో పాటు అన్ని ప్రాంతాల్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్త్రీల కు ప్రత్యేకంగా ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేన్సర్ అనుమానం ఉన్న వారికి పరీక్షలు చేస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉంటే అల్ట్రాసౌండ్‌లో సీఏ–125 మార్కర్, రక్తపరీక్షలు, సిటీస్కాన్, ఎంఆర్‌ఐ వంటివి కూడా చేసి వ్యాధిని గుర్తిస్తున్నారు.
ముందే గుర్తిస్తే చికిత్స
వ్యాధి దశల ఆధారంగా సర్జరీ చేయడం, థెరపీ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ నేపథ్యం ఉండి, బ్రాకా పాజిటివ్ వచ్చిన వారు పిల్లలు పుట్టిన తర్వాత ముందుజాగ్రత్తగా అండాశయాలను తొలగించుకోవచ్చు. కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే సర్జరీ, హైపెక్‌కీమో థెరపీ చేస్తారు. అండాశయ కేన్సర్ చికిత్స తర్వాత మళ్లీ 40 శాతం మందిలో తిరగబెట్టేందుకు ఆస్కారం ఉంది. అప్పుడు కూడా కీమో థెరపీతోనే చికిత్స అందిస్తారు. – విష్ణుప్రియ, గైనకాలజిస్టు, మెడికవర్ ఆస్పత్రి
జన్యుపరమైన అంశం
మారుతున్న జీవనశైలిలో అండాశయ కేన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. జన్యుపరమైన అంశం దీనికి కారణమవుతోంది. ఐదు నుంచి 10శాతం కేన్సర్లు వంశపారంపర్యంగా ఉంటాయి. ఇటీవల ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా జిల్లాలో కేన్సర్ వ్యాధి లక్షణాలు కనిపించిన మహిళలకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. సాధారణంగా 50 ఏండ్లు నిండిన వారిలోనే అండాశయ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చాలా నిశ్శబ్దకరమైనది. ముందుగా గుర్తిస్తే చికిత్స సాధ్యమే. – వెంకటరమణ, డీఎంహెచ్‌వో