
మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో మానసిక రుగ్మతలు ఇప్పటికీ అలక్ష్యానికి గురవుతున్నాయి. శారీరక వ్యాధులతో పోలిస్తే, స్కిజోఫ్రెనియా (Schizophrenia) వంటి మానసిక సమస్యల గుర్తింపు, చికిత్సలో సమాజం వెనుకబడి ఉంది. అందుకే ఈ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం పెంచడం, బాధితుల పట్ల సానుభూతి చూపడం, అపోహలు తొలగించడం వంటి ప్రధాన ఉద్దేశాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 24న ‘స్కిజోఫ్రెనియా అవగాహన దినో త్సవం’ జరుపుకొంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ప్రపంచంలో 0.3–0.7% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 1 కోటి మంది స్కిజోఫ్రెనియాతో జీవిస్తున్నట్టు అంచనా. ఈ వ్యాధిగ్రస్థులు తరచుగా భ్రమలకు లోనవు తారు. ఉదాహరణకు తనను ఎవరో హత్య చేయాలనుకుంటు న్నారని భావిస్తూ భయపడుతుంటారు. అలాగే వారికి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నట్లు, ఏవో దృశ్యాలు కనిపిస్తు న్నట్లు ఉంటుంది. సంభాషణలో అస్పష్టత ఉంటుంది.
బంధువుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం, హఠాత్తుగా కోపగించుకోవడం, చికాకుపడడం, నిరాశకు లోనవ్వడం వీరి ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధికి స్పష్టమైన ఒకే కారణం లేకపోయినా... జన్యుపరమైన సున్నితత్వం, మెదడులో రసాయన అసమ తుల్యత, బాల్యంలో జరిగిన మానసిక గాయాలు, మత్తు పదార్థాల వినియోగం వంటి అంశాలు ఉమ్మడిగా ప్రభా వితం చేస్తాయి. మందులు (యాంటీ సైకోటిక్స్) వాడితే భ్రమలు వంటివి తగ్గుతాయి. ఆలోచనలను సమతుల్యం చేయడానికి తగిన మానసిక చికిత్స అందించాలి.కుటుంబం ఓర్పు, ప్రేమతో నిలబడటం బాధితుల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. స్కిజోఫ్రెనియా బాధితులు ప్రమాదకరమనీ, వారికి సాధారణ జీవితం సాధ్యం కాదనీ చెప్పే మాటలు నిజం కాదు. చికిత్స అందిస్తే వారూ మన లాగే జీవిస్తారు.
– డా.బి. హర్షిణి (ఎమ్‌డీ, సైకియాట్రీ), ఫాదర్స్ ముల్లర్స్ మెడికల్ సైన్సెస్, మంగళూరు
(నేడు ప్రపంచ స్కిజోఫ్రెనియా అవగాహన దినోత్సవం)