
ప్రతీకాత్మక చిత్రం
చిత్తూరు: ఓ మహిళా పోలీసును చిన్నారి పెళ్లికూతురు ముప్పుతిప్పలు పెట్టించిన ఘటన చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. కార్వేటినగరం మండలానికి చెందిన బాలిక (16)కు తల్లిదండ్రులు లేరు. తిరుపతి జిల్లాలోని సంరక్షణ కేంద్రంలో ఉంటోంది. అప్పుడప్పుడూడు చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేటలో ఉన్న అక్క దగ్గరకు వచ్చి వెళుతుంటోంది. ఈ క్రమంలో బీఎన్‌ఆర్‌పేట సర్కిల్‌లో షాపు నిర్వహిస్తున్న యాదమరి మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం వారు పెళ్లి చేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సంరక్షణ కేంద్ర సిబ్బంది బీఎన్‌ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు ఆ మైనర్ బాలికను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మెడికల్ రిపోర్ట్, ఇతరాత్ర అవసరాల నిమిత్తం మహిళా పోలీసు వంగి సంతకం పెట్టే లోపు.. బాలిక మాయమైంది. దీంతో ఆ మహిళా పోలీసు తెగ టెన్షన్ పడిపోయింది. బస్టాండు మొత్తం గాలించారు. చివరకు బెంగళూరులో ఆ బాలికను గుర్తించి.. మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.